‘నాన్నా.. షాపింగ్‌కు వెళ్దాం’ అని కారు తాళాలు తీయడం. ‘అమ్మా.. ఈ రోజు డిన్నర్ బయట చేద్దాం..’ అంటూ బైక్ తాళాలు వెతకడం.. ఈ తరం టీనేజర్లు మర్చిపోయారు. ఎందుకంటే.. వాళ్లకు షాపింగ్ అంటే.. అమెజాన్, మింత్రా ఓన్లీ! లంచ్, డిన్నర్.. అంటే జొమాటో, స్విగ్గీ అనే ఫిక్సవుతున్నారు. ఇక సినిమాలు, షికార్లు అంటారా? అబ్బే.. ఓటీటీ.. ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయిగా అనేస్తున్నారు! ఇంతలా ఇంటర్నెట్, వర్చువల్ ప్రపంచానికి కనెక్ట్ అయిన టీనేజర్లతో తల్లిదండ్రులు టైమ్ ఎలా గడుపుతున్నారు? నట్టింట్లో ఉన్నప్పటికీ నెట్టింట్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నారో తెలుసుకుంటున్నారా?.. కచ్చితంగా తెలుసుకోవాలి. వారికి ఏది మంచో.. ఏది చెడో చెప్పాలి. అందుకే ఈ ‘టీన్స్ సేఫ్టీ టిప్స్’. మీరూ, మీ టీనేజ్ పిల్లలు కలిసి ప్రాక్టీస్ చేయండి..
పి ల్లలు ఓ వయసుకు వచ్చాక.. ఏ విషయం గురించైనా తల్లిదండ్రులతో చర్చించేంత చొరవ వారికి కల్పించాలి. నేటి డిజిటల్ ప్రపంచం గురించి అయితే విధిగా పిల్లలతో చర్చించాలి. ఎలాంటి మోసాలు, ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించాలి. వ్యక్తిగత సమాచారాన్ని మితిమీరి పంచుకోవడం వల్ల వచ్చే అనర్థాల్ని వాళ్లకు తెలియపరచాలి.
కంట్రోల్ మీ చేతుల్లో ఆఫ్‌లైన్ ప్రపంచంలో ఎలాగైతే హద్దులు నిర్ణయిస్తామో.. ఆన్‌లైన్‌లోనూ పిల్లలకు పరిధులు నిర్దేశించాలి. వీటినే పేరెంటల్ కంట్రోల్స్‌గా పిలుస్తారు. బ్రౌజర్లో, బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలు ఏయే సర్వీసుల్ని.. ఎంతెంత సమయం వాడాలో ముందే నిర్ణయించి సెట్ చేయొచ్చు. అంతేకాదు.. నెట్టింట్లో ఏమేం ఓపెన్ అవ్వాలో కూడా మీరే నిర్ణయించొచ్చు. ఉదాహరణకు పిల్లలకు ఆన్లైన్ షాపింగ్ సర్వీసులు ఓపెన్ కాకుండా చేయొచ్చు. లాక్ తీసేస్తే మాత్రమే ఆయా సర్వీసుల్ని వాడేందుకు వీలవుతుంది.
ఫ్యామిలీ ఈ-మెయిల్ నెట్టింట్లో ఎందులో లాగిన్ అవ్వాలన్నా.. కచ్చితంగా ఓ ఈ-మెయిల్ ఉండాల్సిందే. అందుకే ఫ్యామిలీ మెయిల్ ఐడీని క్రియేట్ చేయండి. ఆ ఐడీతోనే దేంట్లోనైనా రిజిస్టర్ అవ్వమని పిల్లలకు చెప్పండి. దీంతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కంట్రోల్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది. ఏదైనా ఆన్లైన్ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ని ప్రయత్నించినా, ఏదైనా వస్తువును కొనాలని చూసినా మీకు తెలుస్తుంది. వెంటనే మీరు అలర్ట్ కావొచ్చు. కొనుగోళ్లపై నిఘా సందు దొరికితే చాలు.. ఆన్లైన్ అంగట్లోకి వెళ్లి ఆర్డర్ పెట్టేస్తుంటారు టీన్స్. దీన్ని కట్టడి చేసేందుకు ఆయా యాప్స్ లోని ‘పర్చేజ్’ ఆప్షన్స్‌ని డిసేబుల్ చేయండి. అంతేకాదు.. బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. దీంతో పిల్లలు ఏ వస్తువులపై ఆసక్తి కనబరుస్తున్నారు.. వాటి అవసరం వారికి ఏముందో తెలుసుకొని, జాగ్రత్తపడొచ్చు.
‘సేఫ్ సెర్చ్’ యాక్టివేట్ బ్రౌజర్ ఏది వాడుతున్నప్పటికీ సురక్షితమైన బ్రౌజింగ్ కోసం.. ‘సేఫ్ బ్రౌజింగ్’ ఎనేబుల్ చేయండి. దీంతో ఎలాంటి మోసపూరితమైన, అసభ్యకరమైన వెబ్లింక్లూ పిల్లలకు కనిపించవు. ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే ‘ప్రైవసీ అండ్ సెట్టింగ్స్’ లోకి వెళ్లి ‘సేఫ్ బ్రౌజింగ్’ ఎనేబుల్ చేస్తే సరి. చూడకూడనివి చూస్తే? నెట్టింట్లో ఏ క్షణాన ఎలాంటి సమాచారం ప్రత్యక్షమవుతుందో చెప్పలేం. అసభ్యకరమైన కంటెంట్ కనిపించినా.. గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వెంటనే మీతో పంచుకునేలా పిల్లల్ని చైతన్యవంతం చేయాలి. అలాంటి సందర్భాలు ఎదురైతే ఇంటిల్లిపాదీ కూర్చుని చర్చించుకుని సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి. సేఫ్ గేమింగ్ ఎక్కువ మంది పిల్లలు ఆసక్తి చూపించేది ఆన్లైన్ గేమ్స్ పైనే. ఆన్లైన్లో గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గేమ్స్ ఆడటం సురక్షితం కాదు. ఆయా ఆన్లైన్ గేమింగ్ వేదికల్ని క్షుణ్నంగా పరిశీలించి ‘సేఫ్ మోడ్స్’ సెట్ చేసిన తర్వాత మాత్రమే ఆడేందుకు అవకాశం ఇవ్వాలి. స్కామ్స్‌పై అవగాహన టీనేజ్లోనే డిజిటల్ మొబైల్ వాలెట్స్ని వాడేస్తున్నారు చాలామంది. ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తున్న టీన్స్‌కి ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి అవగాహన కల్పించాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు, యూపీఐ, పిన్, ఓటీపీ సమాచారాల్ని మేనేజ్ చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తెలియజెప్పాలి.
ఇంట్లో ఎక్కడ ఫోన్ కనిపించినా.. చటుక్కున అందుకోవడం, ఏదో ఒకటి చేసేయడం పరిపాటిగా మారింది. ఇలా నియంత్రణ కోల్పోతూ.. పిల్లలు ఫోన్‌కు బానిసలుగా మారుతున్నట్టు అనిపిస్తే.. కొన్ని ఆంక్షలు విధించాల్సిందే. ఫోన్ వాడకాన్ని తెలిపే యాప్స్‌ని ఇన్స్టాల్ చేసి స్క్రీన్ టైమ్‌ని మానిటర్ చేయాలి. రోజులో కొంత సమయం పాటు ఎలాంటి టెక్ గ్యాడ్జెట్స్ కనిపించకుండా చేసి.. ‘టెక్ ఫ్రీ జోన్స్’లో సమయం గడిపేలా చూసుకోవాలి. ‘ఆఫ్‌లైన్’ యాక్టివిటీలపైకి పిల్లల దృష్టిని మళ్లించాలి. స్మార్ట్‌ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్ల రింగ్టోన్స్ మ్యూట్ చేయాలి. ఒకవేళ ఫోన్ మితిమీరి వాడుతుంటే.. నిపుణుల సలహాలతో బయటపడే ప్రయత్నం చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లు ‘డిజిటల్ వెల్ బీయింగ్’ లాంటి యాప్స్‌ని ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ వినియోగంపై నిఘా పెట్టొచ్చు. యాపిల్ యూజర్లు ‘స్క్రీన్ టైమ్’ యాప్ ప్రయత్నించొచ్చు. సో.. డియర్ పేరెంట్స్.. టీనేజ్ పిల్లలతో రోజూ ట్యూన్ అవుతూ.. అప్రమత్తంగా ఉండండి. కౌమారంలో పిల్లలు పట్టుతప్పారో.. ఆ ప్రభావం జీవితకాలం పడుతుంది.