‘ఇవి పురుషులకు సంబంధించిన ఉద్యోగాలు. మహిళకు ఇక్కడ అవకాశం లేదు’.. ఆమె వెళ్లిన ప్రతిచోటా వినిపించిన మాట ఇది. ‘ఒక పని చేయడానికి నీకు అవకాశం లభించలేదు అంటే.. దేవుడు నీకు అంతకన్నా పెద్దపని అప్పగించబోతున్నాడని అర్థం!’ అని చెబుతారు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు. ఈమె విషయంలోనూ అదే జరిగింది. ఉద్యోగానికి తిరస్కరించినప్పుడు ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో కానీ.. ఆ తిరస్కారమే ఆమె పాలిట వరంగా మారింది. దేశంలోనే ‘నంబర్ వన్’ మహిళా సంపన్నురాలిగా ఆమెను నిలబెట్టింది. ఆమే.. స్వయం కృషితో ఎదిగిన మహిళా సంపన్నురాలు కిరణ్ మజుందార్ షా. భారతదేశంలో బయో టెక్నాలజీకి మార్గదర్శకురాలు కూడా!
Kiran Mazumdar Shaw | బ్రూయింగ్ రంగం అంటే బీర్, వైన్, స్పిరిట్ లాంటి మద్యపానీయాలను తయారు చేసే పరిశ్రమ. కిరణ్ 1975లో ఆస్ట్రేలియాలోని బల్లారట్ యూనివర్సిటీ నుంచి బ్రూయింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. ఇండియాకు తిరిగిరాగానే తనకు ఉద్యోగం ఖాయం అనుకున్నారు. కానీ, ఇక్కడికి వచ్చిన తరువాత అసలు విషయం బోధపడింది. ఎక్కడికి వెళ్లినా.. ‘సారీ! ఇక్కడ మహిళకు ప్రవేశం లేదు’ అని చప్పి, తిప్పి పంపారు. అయినా, ఆమె నిరాశ చెందలేదు. ‘పెద్దగా ఆలోచించాలి’ అంటూ, తండ్రి ఎప్పుడూ చెప్పే మాటను ఆచరణలో పెట్టారు కిరణ్.
ఉద్యోగం దొరక్క పోవడంతో పదివేల రూపాయల పెట్టుబడితో ‘బయోకాన్’ను స్థాపించారు. ఐర్లాండ్‌కు చెందిన బయోకాన్ బయో కెమికల్స్ లిమిటెడ్ స్థాపకుడు లెస్లీ ఆచిన్ క్లాస్‌తో కలిసి.. బెంగళూరులోని తన ఇంటి గ్యారేజ్‌లోనే ‘బయోకాన్ ఇండియా’కు అంకురార్పణ చేశారు. ప్రారంభంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతకాలానికి కంపెనీలో తన వాటాలు మొత్తం లెస్లీ అమ్ముకున్నారు. ఇలాంటి మరెన్నో సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటూ.. ‘బయోకాన్’ను ఒక మహావృక్షంగా మలిచారు కిరణ్.
ఇందులో తొలుత ఎంజైములు తయారు చేసేవారు. తరువాత బయో ఫార్మాసూటికల్కు మారి.. డయాబెటిస్, క్యాన్సర్, ఆటో ఇమ్యూనిటీ తదితర వ్యాధులకు చికిత్సపై దృష్టి పెట్టారు. మన దేశంలో మొట్టమొదటి బయోటెక్నాజీ ఐపీవో వీరిదే. 2004లోనే కంపెనీ విస్తరణకు ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. ఈ పరిణామంతో కిరణ్ తనకు తను సంపన్నురాలు కావడమే కాదు.. తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినవారినీ సంపన్నులను చేశారు.
కిరణ్ మజుందార్ షా పుట్టింది గుజరాతీ కుటుంబంలో. చాలా ఏళ్ల క్రితమే వీరి తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడ్డారు. తండ్రి రాసేంద్ర మజుందార్.. యునైటెడ్ బ్రూవరీస్లో బ్రూ మాస్టర్‌గా పనిచేసేవారు. కిరణ్ మజుందార్ బెంగళూరు యూనివర్సిటీ నుంచి 1973లో జంతు శాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత తండ్రి వృత్తిపై ఆసక్తితో.. ఆస్ట్రేలియాలో బ్రూయింగ్‌లో మాస్టర్ డిగ్రీ సాధించారు. ఆ కాలంనాటి పరిస్థితుల వల్ల మద్యం తయారీ రంగంలో ఆమెకు ఉద్యోగం లభించలేదు.
ఇన్సులిన్ ఉత్పత్తిలో బయోకాన్ ఇప్పుడు మొత్తం ఆసియాలోనే అతిపెద్ద తయారీదారు. డయాబెటిస్ రోగులకు ఇంజెక్షన్లకు బదులుగా అందిస్తున్న ఓరల్ ఇన్సులిన్.. బయోకాన్ ఆవిష్కరణనే. ఫార్మారంగంలో చేసిన విశేష కృషి చేసిన కిరణ్ మజుందార్ షాను.. కేంద్రప్రభుత్వం 1989లో పద్మశ్రీతో సత్కరించింది. 2005లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. అనేక అంతర్జాతీయ అవార్డులూ వరించాయి. టైం మ్యాగజైన్.. 100 మంది అత్యంత ప్రభావం చూపించే వ్యక్తుల జాబితాలో కిరణ్ మజుందార్‌కు స్థానమిచ్చి గౌరవించింది. ఫోర్బ్స్ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ మహిళల జాబితాలోనూ.. కిరణ్‌కు 68వ స్థానం లభించింది.
2004 నాటికి కిరణ్ మజుందార్ ఆస్తి.. 3. 6 బిలియన్ డాలర్లు. అప్పటికి దేశంలో అత్యంత సంపన్నురాలిగా కిరణ్ పేరే మొదటి స్థానంలో ఉండేది. హెచ్‌సీఎల్ కంపెనీ యజమాని శివనాడార్.. ఇటీవల తన కంపెనీలో 45 శాతం వాటాను తన కుమార్తెకు ఇవ్వడంతో రోష్నీ నాడార్ మొదటిస్థానంలోకి వచ్చారు. కిరణ్ కుటుంబంలో.. తానే మొదటి వ్యాపారవేత్త. స్వయంకృషితో వేల కోట్ల రూపాలయ సామ్రాజ్యాన్ని సృష్టించారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కిరణ్‌కు.. సదస్సుల్లో యువతను ఉద్దేశించి ప్రసంగించడంపైనా చాలా ఆసక్తి. ‘తిరస్కారం ఎదురైతే కుంగిపోవద్దు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి’ అంటారు కిరణ్. ఆలోచనలు ఎప్పుడూ పెద్దగా ఉండాలి అంటూ.. తన తండ్రి అందించిన ప్రోత్సాహమే, తనను ముందుకు నడిపింది అని చెబుతారు.
-బుద్దా మురళి
98499 98087