మనచుట్టూ వందల వేల మనుషులు కనిపిస్తూ ఉంటే పెద్ద ఆశ్చర్యంగా ఉండదు. మహా అయితే ఎత్తు, రంగుల్లో మార్పుగా ఉంటారంతే. కానీ హఠాత్తుగా మనకన్నా భిన్నమైన బుద్ధిజీవి కనిపిస్తే! కాలం, దూరం లాంటి పరిమితులను తను అనాయాసంగా దాటేయగలుగుతుంటే! అలాంటి వ్యక్తులు ఉన్నారన్నది చాలామంది నమ్మకం. శాస్త్రవేత్తలు కూడా అలాంటి అవకాశమే లేదు అని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అనంతలోకాల్లో
ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. కానీ వాళ్లు మనల్ని చేరుకుంటున్నారా? తరచూ భూమ్మీదకు వస్తున్నారా? మన పూర్వికులతో కలిసిమెలిసి ఉండేవారా? అన్న ఊహలకు మాత్రం అడూ ్డఅదుపూ లేకుండా పోయింది. వాళ్లు మనకు మిత్రులా, రాబోయే కాలంలో భూమిని కబళించే ఆక్రమణదారులా లాంటి అనుమానాలకూ కొదవ లేదు. ఇప్పటివరకూ ఈ గ్రహాంతరవాసుల గురించి వినిపించిన నమ్మకాలు, వారి ఉనికి కోసం జరుగుతున్న అన్వేషణలను ఓసారి తలుచుకునే ప్రయత్నమిది.
ఈ అనంతవిశ్వంలో లెక్కలేనన్ని పాలపుంతలు ఉన్నాయి. వాటిలో కోటానుకోట్ల నక్షత్రాలూ ఉన్నాయి. సూర్యుడిలాంటి ఓ తార చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉండటంలో ఆశ్చర్యం లేదు కదా అనిపిస్తుంది. కానీ జీవం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. ఎన్నో అసాధారణమైన సందర్భాలు కలిసివస్తేనే జీవం ఉద్భవిస్తుందని చెబుతారు. దీనికి ‘రేర్ ఎర్త్ హిప్నాసిస్’ అనే పేరు కూడా ఉంది. ఓ పాలపుంతలో రేడియేషన్ ఎక్కువగా లేని చోట ఉండే తార, దాన్నుంచి మరీ దూరంగానో దగ్గరగానో లేని గ్రహం, ఆ గ్రహగతిని ప్రభావితం చేయని పక్క గ్రహాలు, స్థిరమైన కక్ష్య, తగినంత గురుత్వాకర్షణ, ప్రాణానికి తోడ్పడే వాయువులు, నీటినీ, వర్షాన్నీ అందించే సముద్రాలు, ఆ సముద్రాలు గట్టుదాటకుండా పట్టి ఉంచే ఉపగ్రహపు ఆకర్షణ, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, ఆ పొర దిగువన ప్రాణానికి అండగా నిలిచే వాయువులు, గ్రహం మీద ఉన్న జీవం అంతా ఒకదానిమీద ఒకటి ఆధారపడే ఆహారగొలుసు… లాంటి సవాలక్ష అంశాలు కలిసిరావాలి. ఇది భూమి విషయంలోనే జరిగింది అని చెబుతుందీ సిద్ధాంతం. ఆఖరికి భూమి 23.5 డిగ్రీలు వాలుగా తిరగడం కూడా దాని రుతువులకు కారణం అవుతున్నది. మరి గ్రహాంతరవాసులకు అవకాశం ఉన్నట్టా లేనట్టా! ఇందుకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తుంది డ్రేక్ ఫార్ములా.
N = R* x fp x ne x fl x fi x fc x L. కాస్త గందరగోళంగా ఉంది కదా! కానీ ఐన్‌స్టీన్ సిద్ధాంతం తర్వాత ఇదే అత్యంత ఆసక్తికరమైన ఫార్ములాగా శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. 1961లో డ్రేక్ అనే ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. R* అంటే ఓ గెలాక్సీలో నక్షత్రాలు ఏర్పడే వేగం, fp అంటే ఆ గెలాక్సీలో నక్షత్రాలు, ne అంటే ఆ నక్షత్రాలలో జీవానికి అనుకూలమైన తారలు… ఇలా వేర్వేరు లెక్కల ఆధారంగా దీనికి జవాబును కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, డ్రేక్ సిద్ధాంతం ప్రకారం కొన్ని వేల నుంచి లక్షల నాగరికతలు ఈ విశాల విశ్వంలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. అన్ని నాగరికతలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. మన టెలిస్కోపులకు కనిపించేంత విశ్వంలోనే రెండులక్షల కోట్ల పాలపుంతలు ఉన్నాయని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో ఏదో ఒక మూల బుద్ధిజీవుల సంచారం ఉండితీరాలని అంటున్నదీ డ్రేక్ సిద్ధాంతం. సౌర కుటుంబానికి ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్స్ అంటారు. వాటిలో ఎక్కడో ఓ చోట జీవం ఉండొచ్చని డ్రేక్ అంచనా!
చంద్రుడి మీదకు మనిషి వెళ్లనన్ని రోజులూ… అక్కడ కూడా నాగరికత ఉండేదని నమ్మేవారు. దాని మీద కనిపించే మచ్చలు సముద్రాలనీ, గీతలు గోడలనీ సూత్రీకరించేవారు. కానీ జాబిలి మీద మనిషి కాలు మోపాక అవన్నీ కట్టుకథలయ్యాయి. ఇక ఇప్పుడు కుజుడి వంతు. కుజుడిపై ఒకరోజు ప్రమాణం కూడా 24 గంటలే. దాని మీద కూడా ధృవాలు, రుతువులు ఉన్నాయని తేలింది. అక్కడ కూడా నీరు, జీవానికి అవసరమయ్యే ఖనిజాలు ఉన్నాయని తేలింది. కుజుడి మీద వాతావరణంలో మీథేన్ వాయువూ కనిపించింది. జీవరాశి ఉన్నచోట మీథేన్ ఉనికి ఉంటుందని అంటారు. వీటికితోడు దుర్భిణితో చూస్తే, కుజుడి మీద పిరమిడ్స్ లాంటి కట్టడాలు కనిపిస్తున్నాయి అని చెప్పేవారు. వైకింగ్ లాంటి వ్యోమనౌకలు కుజుడి మీదకు వెళ్లి అక్కడి వాతావరణాన్ని ఫొటోలు తీసి, మట్టిని సేకరించి తెచ్చాక… జీవం, నాగరికత ఉండే అవకాశం లేదని తేల్చేశారు. ఇక కుజుడి మీద కూడా జీవం లేనట్టే అని అంతా నిట్టూర్చే సమయంలో… అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ మాజీ ఉద్యోగి మెక్ మోనెగల్ మరో బాంబు పేల్చారు. అక్కడ ఉండే పిరమిడ్స్ లాంటి నిర్మాణాల్లో బుద్ధిజీవులు ఉన్నాయనీ, ఈ విషయం సీఐకి, నాసాకి తెలిసినా బయటికి రానివ్వడం లేదని అన్నారు. ఆ అగ్నికి ఆజ్యం పోస్తూ ఎలన్ మస్క్ కూడా రాబోయే రోజుల్లోకి కుజగ్రహం మీదకు వెళ్దామనీ, అక్కడ ఉన్న శిథిలాల మీదే కొత్త నిర్మాణాలు చేద్దామనీ ఊరిస్తున్నారు.
అది 1961, సెప్టెంబర్ 19. అమెరికా. బార్నీ, బెంటీ అనే కొత్తగా పెళ్లయిన జంట కెనడాలో విహారయాత్ర చేసి తిరిగి వస్తున్నారు. వాళ్లు న్యూహాంప్‌షైర్ దగ్గరికి వచ్చేసరికి ఏదో వింత వాహనం వాళ్ల కారును అనుసరిస్తున్నట్టు గమనించారు. కాసేపటికి అది వాళ్లను ఆపింది. అందులోంచి ఐదడుగుల ఎత్తు, పెద్ద తలకాయ, బూడిదరంగు శరీరం ఉన్న కొన్ని వింతజీవులు వాళ్లను కాసేపు కిడ్నాప్ చేశాయని ఆ దంపతులు ఆరోపించారు. ఆ సమయంలో వారికి స్పృహ లేదు కానీ తమ పునరుత్పత్తి అవయవాలను పరిశీలించారనీ, చర్మాన్ని సేకరించారనీ చెప్పుకొచ్చారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా వాళ్లకు వింత అనుభవాలు కలిగాయి. ఇంట్లో గడియారాలు పనిచేయకపోవడం, భయానక కలలు రావడం లాంటివి జరిగాయి. కొన్నాళ్లకు ఆ దంపతులను హిప్నటైజ్ చేసినప్పుడు కూడా ఆ మగతలో వారు తమ వివరాల్లో మార్పు లేకుండా చెప్పడం ఆశ్చర్యం. సహజంగానే ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దీనిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు, పుస్తకాలు, ఆఖరికి సినిమాలు కూడా వచ్చాయి. కానీ హేతువాదులు మాత్రం ఇందుకు భిన్నమైన కారణాలు చెప్పుకొచ్చారు. ఈ దంపతులు చాలా రోజుల నుంచి గ్రహాంతరవాసుల పట్ల విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారనీ, ఓ దశలో వీధిదీపాన్ని చూసి కూడా గ్రహాంతర వ్యోమనౌకగా భ్రమపడ్డారనీ… తమ ఊహలనే నిజంగా నమ్ముతూ ఇలాంటి కథను అల్లారనీ వీరి విశ్లేషణ. అయితే ఇది కేవలం ఓ ఒంటరి సందర్భం మాత్రమే కాదు. గ్రహాంతరవాసులు కిడ్నాప్ చేసి వదిలిపెట్టారంటూ వందల కేసులు నమోదయ్యాయి. వీరందరి ఆరోపణల్లోనూ కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఏలియన్స్ వీరిని పట్టుకోవడం, ఆ తర్వాత స్పృహ కోల్పోవడం, మెలకువ వచ్చాక తమ శరీరాన్ని పరీక్షించిన ఆనవాళ్లు, ఏంతసేపు గడిచిందో తెలియకపోవడం, కొన్నాళ్లపాటు ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఉత్తేజంగా తోచడం… ఇంచుమించుగా ఇవే లక్షణాలు కనిపించేవి.
ఏదన్నా జరిగినప్పుడు… దాని వెనుక ఓ అనూహ్యమైన కారణాన్ని వెతకడం సహజం. అలాంటి వింత కారణాలు ఉద్వేగం రగిలిస్తాయి. ఇలాంటి సందర్భంలో గ్రహాంతరవాసులదే అగ్రతాంబూలం. లోకంలో ఏం జరిగినా సరే, దాన్ని ఏలియన్స్‌కి ముడిపెట్టేస్తూ ఉంటారు. చైనా వాల్‌ను గ్రహాంతరవాసులే నిర్మించారనీ, గిజా పిరమిడ్‌కి వారి సాయమే కీలకమనీ కొందరి వాదన. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడు జాన్ కెనడీ చనిపోయినప్పుడు, అది ఏలియన్స్ పనే అని నమ్మినవారున్నారు. ఎక్కడన్నా పశువులు హఠాత్తుగా చనిపోతే, అది ఏలియన్ల పనే అని శాపనార్థాలు పెడుతుంటారు. 2005లో ‘ప్రాజెక్ట్ సెర్పో’ అనే పుకారు బయల్దేరింది. కొంతమంది ఏలియన్లు ఇక్కడికి వచ్చి, తమ బదులుగా కొందరు మనుషుల్ని తమ గ్రహాల మీదకు పంపే మార్పిడి కార్యక్రమం ఒకటి ఉందనే వార్తే ఈ ప్రాజెక్ట్ సెర్పో. మెన్ ఇన్ బ్లాక్, ఇండిపెండెన్స్ డే లాంటి సినిమాలు వచ్చాక ఇలాంటి ప్రచారాలకు తిరుగులేకుండా పోయింది. ఈ సందట్లో… నకిలీ ఫొటోలు, వీడియోలు కూడా చేరితే ఇక చెప్పేదేముంది. ఉదాహరణకు 1995లో గ్రహాంతరవాసులను పోస్ట్‌మార్టం చేస్తున్నట్టు ఏకంగా ఓ వీడియోనే బయటకు వచ్చింది. అది నకిలీదే!
గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్న ప్రశ్నను దాటేసి కొంతమంది ఇంకా దూరం వెళ్లిపోయారు. అసలు ఏలియన్స్ మన మధ్యనే తిరుగుతున్నారనీ, మనుషుల రూపంలోనే ఉన్నారనీ వీరి నమ్మకం. టామ్ క్రూజ్, మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్… లాంటివాళ్లంతా కూడా మానవ రూపంలో ఉన్న గ్రహాంతరవాసులని వీరు కుండబద్దలు కొట్టేస్తారు. ఈమధ్యే ఇలాంటి నమ్మకాల మీద హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధన పత్రం కూడా వెలువడింది. దీని ప్రకారం మన మధ్యే ఉండే ఏలియన్స్‌కి సంబంధించి నాలుగు రకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాచీన నాగరికతకు చెందిన మనుషులు… తిరిగి భూమ్మీదకు వస్తూపోతూ ఉన్నారన్నది తొలి సిద్ధాంతం. డైనోసార్లు లేదా కోతుల నుంచి మనుషులకంటే గొప్ప మేధస్సు ఉన్న జాతులు మన మధ్యే సంచరిస్తున్నాయన్నది రెండో సిద్ధాంతం. చంద్రుడిలాంటి చోట్ల దాక్కుని వస్తూపోతూ ఉండే గ్రహాంతరవాసులు మనలాగే కనిపిస్తారన్నది మూడో సిద్ధాంతం. మాయామంత్రాల సాయంతో కొందరు మనుషుల్లాగే ఉంటున్నారన్నది నాలుగో సిద్ధాంతం. వీటికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేనప్పటికీ నమ్మకాలు మాత్రం చాలా బలంగానే ఉన్నాయి. అసలు మన భూమి మధ్యభాగంలోనో, లేదా శంబాలా లాంటి రహస్యమైన ప్రదేశాల్లోనో ఏలియన్స్ ఉనికి ఉందన్నది సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న మాట. జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్, ద టైం మెషిన్ లాంటి సైన్స్ ఫిక్షన్ నవలలు కూడా ఇలాంటి ఊహలకు ఆజ్యం పోశాయి.
1950ల తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణాలు మొదలయ్యాయి. దాంతో ఆస్ట్రోబయాలజీ అనే పదం కొత్తగా వచ్చిచేరింది. లోకంలో ఎక్కడెక్కడ ‘బయో సిగ్నేచర్స్’… అంటే జీవానికి అనుగుణమైన వాతావరణం ఉందో గమనించడమే ఈ శాస్త్రం. అంతేకాదు! ఎడారులు, సముద్రగర్భాలతో పాటుగా అతి కఠినమైన పరిస్థితుల్లో జీవం ఎలా మనగలుగుతుంది అని కూడా పరిశోధిస్తుంటారు. దీనివల్ల జీవం ఉండటానికి అంతా సౌకర్యవంతమైన వాతావరణమే ఉండాల్సిన పనిలేదు అని నిరూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ లాంటి ప్రతికూలతల మధ్య ఎలా జీవించాలో తెలుస్తుంది.
అంతరిక్షంలోనూ కొన్ని సంకేతాలు ఉంటాయి. తారలు వెలువరించే రేడియో సిగ్నల్స్, గ్రహగతుల నుంచి వచ్చే శబ్దాలు, గెలాక్సీల నుంచి వెలువడే కాంతి… ఇవన్నీ కూడ ఎంతో సమాచారాన్ని ఇస్తాయి. ఈ తరంగాలను విశ్లేషిస్తే గ్రహాంతరవాసులు ఉనికి తెలుస్తుంది కదా అని శాస్త్రవేత్తల ఆశ. దీన్నే SETI (Search for Extraterrestrial Intelligence) అంటారు. 1960ల నుంచే ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. 1977లో ఓహియోలోని బిగ్ ఇయర్ అనే టెలిస్కోప్ ఇలాంటి పనిలోనే ఉండగా… దానికి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి. దాదాపు 72 సెకన్ల పాటు ఉన్న ఆ శబ్దాలు చాలా భిన్నంగా ఉన్నాయని గ్రహించారు ఖగోళ శాస్త్రవేత్తలు. ధనుస్సురాశి వైపు నుంచి వచ్చిన ఈ శబ్దం… గ్రహాంతరవాసులు మనకు పంపిన సందేశం అని చాలామంది నమ్మారు. అందుకే దీనికి ‘WOW Signal’ అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత రోజుల్లో ఆ శబ్దం వెనకాల ఉన్న అర్థాన్ని కానీ, మరిన్ని శబ్దాలను కానీ తెలుసుకోలేకపోయారు. దాంతో 2015లో Breakthrough Listen పేరుతో 800 కోట్ల రూపాయల ఖర్చుతో ఇలాంటి శబ్దాలను వినేందుకు ఓ భారీ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పటివరకైతే ఈ ప్రాజెక్టు నుంచి ఆశాజనకమైన ఫలితాలు ఏవీ రాలేదు.
ఒకవేళ మనలో కొందరికి వింత ప్రాణులు లేదా వాహనాలు కనిపిస్తే అవి నిజంగానే గ్రహాంతరవాసులా లేక ఇంకేదన్నా కారణం ఉందా అన్న ప్రశ్నకు కూడా కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు వినిపిస్తున్నాయి.
గ్రహాంతరవాసులు అనగానే ఎగిరే పళ్లాలు (ఫ్లయింగ్ సాసర్స్) గుర్తుకొచ్చి తీరాతాయి. అవి వారి వాహనాలు కదా! ఆకాశంలో వింత ఆకారం ఏది కనిపించినా దాన్ని యూఎఫ్ఓ (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) గా పేర్కొంటారు. వీటిలో భాగమే ఫ్లయింగ్ సాసర్స్. అడపాదడపా
పేపర్లలో, సోషల్ మీడియాలో కనిపించి దడపుట్టించే ఈ యూఎఫ్ఓల వెనుక కారణం ఏమిటి. అవి ఏలియన్స్ వాహనాలు అన్నది ఓ నమ్మకం మాత్రమే. హేతువాదుల ప్రకారం అవి…
మీథేన్లాంటి వాయువుల మంటలు. ఇవే కాకుండా నిద్ర సరిగా లేకపోవడం, మాస్ హిస్టీరియా, గట్టిగా నమ్మింది కళ్ల ముందు మెదిలే భ్రాంతి… లాంటి మానసికమైన కారణాల వల్ల కూడా మనకు ఆకాశంలో వింత ఆకారాలు కనిపించవచ్చని కొట్టిపడేస్తున్నారు. ఇవేవీ కాదు, అవి ఏలియన్స్ వాహనాలే అని బలంగా నమ్మేవారూ ఉన్నారు. అమెరికా ప్రభుత్వం సైతం 2021లో ‘కచ్చితంగా గుర్తించలేని కొన్ని వింత వస్తువులు ఆకాశంలో ఎగరడాన్ని గమనించాం’ అని ఒప్పుకొంది.
ఏలియన్స్ ఉన్నారా లేరా అనే చర్చ మనిషి ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటుంది! ఒకవేళ వాళ్లు ఉంటే ఎందుకలా చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారనే అనుమానమూ కలుగుతుంది. దానికి కూడా సిద్ధాంతాలు వెలువరించేశారు. ఏలియన్స్ కనుక మనుషులకు దగ్గరైతే… వారిని నాశనం చేసేస్తామనో, బానిసలుగా మార్చుకుంటామనో భయంతో వారు మనకు దూరం దూరంగా ఉంటున్నారట. మొత్తానికి మనుషులంటే ఏలియన్స్ కూడా భయపడుతున్నారన్నమాట. కాబట్టి ఈసారి అవి మనకు కనిపిస్తే కాస్త మచ్చిక చేసుకునే ప్రయత్నం చేద్దాం.
– కె.సహస్ర