గంగమ్మ తోబుట్టువు ఉప్పొంగుతున్నది. సమవర్తి సోదరికి సారె పెట్టేవేళ వచ్చేసింది. కన్నయ్య కౌగిట చిక్కి… నలుపెక్కిన యమునా నది వెన్నపూసలా కరిగిపోతున్నది. తనను నమ్ముకొని ముమ్మారు మునకేస్తే.. పాపాలు కడిగేస్తానంటున్నది. పాండవుల కాలం నుంచి పాదుషాల ఏలిక దాకా ఎన్నో విశేషాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిందీ జీవ తరంగిణి. బృందావనిలో నల్లనయ్య కోసం వేయి కనులతో ఎదురు చూసిన రాధను ఊరడించింది యమున.కాళీయుడి పడగలపై నాట్యమాడిన ఆ బాలగోపాలుణ్ని వలచింది. ఆనక కాళిందిగా మారి కిట్టయ్యను వరించింది. అంతేనా, ఈ సూర్యదేవర గారాలపట్టి తండ్రిలాగే ప్రత్యక్ష దైవం. తాను పారిన నేలంతా బంగారం ఈనేలా కరుణిస్తున్నది. తన ప్రవాహంతో ఉదయించిన విద్యుల్లతలు.. రేయింబవళ్లూ కాంతులు విరజిమ్ముతూనే ఉన్నాయి. నాగరికతకు, ఆధ్యాత్మికతకు, ఆధునికతకు ఆలవాలమైన నదీమతల్లి యమున.. పుష్కర వైభవంతో పరవళ్లు తొక్కుతున్నది. ఈ సందర్భంగా యమునా తీరంలో కాసేపు విహరిద్దాం..

నదుల మూలాన్ని, రుషుల మూలాన్ని వెతక్కూడదు అంటారు. ఆ మాటకు కారణాలు చాలానే ఉండి ఉండవచ్చు. ఒక్కటి మాత్రం నిజం. ఏ నది అయినా ఓ సన్నటి ధారగా మొదలవుతుంది. ఒక్కో యోజనం దాటుతున్న కొద్దీ పాయలా మారుతుంది. మైళ్లు సాగేకొద్దీ ఉధృతంగా సాగుతుంది. మైదానాలను మింగేస్తూ, కొండలను చీల్చేస్తూ ప్రళయ ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహమూ ఏదో ఏటవాలు జారుడు కాదు.. వస్తూ వస్తూ విలువైన ఖనిజాలను తీసుకువస్తుంది. లక్షల ఎకరాల సాగుకు కావాల్సిన నీటినీ, సారాన్నీ అందిస్తుంది. మనుషులు, పక్షులు, జంతువులు, చెట్లు.. తన దారి పొడవునా జీవం కళకళలాడేలా చేస్తుంది. ఇంత జరిగినా ఎక్కడా తొణకదు. పల్లం వైపుగా, లంకల చుట్టూ, గట్ల మధ్య గంభీరంగా సాగిపోతుంది. అందుకే ధారగా, సామాన్యంగా కనిపించే నదీమూలాన్ని కాకుండా.. దాని ప్రయాణాన్ని, సాయాన్నీ చూడమంటారు పెద్దలు.

తల్లి జన్మనివ్వచ్చుగాక, కానీ నదులే మనకు నాగరికతను, బతికి బట్టకట్టే మెతుకును ఇచ్చాయి. అందుకే నదీమతల్లిగా వాటిని పిల్చుకుంటాం. ఇంటిలో స్నానం చేసినా సరే.. ‘గంగేచ యమునేచైవ’ అంటూ భారతీయతకు అండగా నిలిచిన ముఖ్య నదులను తలుచుకుంటారు. వాటిలో ఒకటైన యమునా నది పుష్కరాలు జూన్ 2న మొదలు కానున్నాయి. ఇది మన రాష్ట్రంలో ఆ మాటకు వస్తే దక్షిణాదిన ప్రవహించదు. కానీ, భారతీయులకు ఇష్టమైన నదిగా ప్రసిద్ధి. యమున తీరాన ఉన్న బృందావనం, ఢిల్లీ, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలు మనకు కొత్తేమీ కాదు. పుష్కరాల సమయంలో అక్కడికి వెళ్లి పుణ్యస్నానాలు చేసే తెలుగువారి సంఖ్యా తక్కువేమీ కాదు.
హైందవంలో ప్రతి నదికీ, కొండకీ, చెట్టుకీ ఓ గాథ కనిపిస్తుంది. అది కల్పితమా, కథా, నమ్మకమా అన్నది పక్కన పెడితే.. వాటిని దేవతారూపంలో కొలవడం వల్ల, వాటిపట్ల కృతజ్ఞత వినిపిస్తుంది. యమునా నదికి కూడా ఓ అద్భుతమైన చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం యమున, సూర్యుడి భార్య అయిన సంజ్ఞాదేవి బిడ్డ. సంజ్ఞకు ఇద్దరు పిల్లలు. ఒకరు నరక పాలకుడు అయిన యముడైతే, రెండోది యమున. ఒకరు నరకంలో మనుషుల పాపాలకు తగిన పరిహారాన్ని కల్పిస్తే, మరొకరు నేల మీద తన నీటితో మన పాపాలను శుద్ధి చేస్తారు. అందుకే యమునలో స్నానం ఆచరించినవారు పాపవిముక్తులు అవుతారని నమ్మకం.
యమున పాత్ర కేవలం ఓ నదిగానే మిగిలిపోలేదు. దేవకీమాత అష్టమగర్భంలో తన మృత్యువే జన్మించ బోతున్నదని తెలిసిన కంసుడు.. ఒక్కో బిడ్డనూ చిదిమేస్తాడు. ఎనిమిదో సంతానాన్ని ఆ రాక్షసుని బారి నుంచి కాపాడేందుకు సమాయత్తం అవుతాడు వసుదేవుడు. ముద్దులొలికే బాలకృష్ణుణ్ని తట్టలో పెట్టుకొని.. మథుర నుంచి గోకులానికి ప్రయాణమవుతాడు. కటిక చీకటి, పెను తుఫానుల మధ్య సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న యమునా నది.. వసుదేవుని చూడగానే రెండుగా విడిపోతుంది. అలా మొదలైన యమునా కృష్ణుల అనుబంధం బలపడుతూనే వచ్చింది. కృష్ణుడు కాళీయుడిపై నాట్యమాడింది యమునలోనే, రాధాకృష్ణులు మధుర ప్రేమలో మునిగితేలిందీ బృందావనంలోని యమునాతీరానే, పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థం ఉన్నదీ యమున ఒడ్డునే.
యమునకు కాళింది అనే పేరు కూడా ఉంది. ఈ పేరు వెనుక ఆసక్తికరమైన నేపథ్యాలు కనిపిస్తాయి. కాళుడి (యముడు) చెల్లి కాబట్టి కాళింది అని ఒకరు, కాళీయమర్దనం జరిగాక యమున నీరు నల్లగా మారాయి కాబట్టి ఆ పేరు వచ్చిందని మరో చోట, సతీదేవి మరణం తర్వాత ఆ బాధను తట్టుకోలేని శివుడు యమునలో మునిగి సేదతీరాడనీ.. పరమేశ్వరుడి బాధకి యమునా నది రంగు మారిందని ఇంకొందరు భావిస్తారు. కృష్ణుణ్ని చూడగానే ప్రేమలో పడి, తననే భర్తగా పొందాలని తపించి తన అష్టభార్యలలో ఒకరిగా మారుతుంది ఈ కాళింది.
గడ్వాల్ హిమాలయాల్లో దాదాపు పదిహేను వేల అడుగుల ఎత్తున ఉన్న హిమనది నుంచి యమున ప్రయాణం మొదలవుతుంది. అసాధ్యమైన ఆ దారిని చేరుకోవడం కష్టం కాబట్టి, కాస్త దిగువన యమునోత్రి అని గుడి కట్టి పూజించుకుంటున్నారు. తాబేలు మీద నీటి కడవ పట్టుకుని ఉన్న యమునాదేవి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. హిమాలయాల మీదుగా జారుతూ వచ్చిన యమునమ్మ, దారిలో ఉన్న శివాలిక్ పర్వతాలను చీల్చుకుంటూ హిమాచల్ ప్రదేశ్ మైదానాల్లోకి అడుగుపెడుతుంది. అక్కడ టోన్స్, గిరి ఉపనదులను తనలో లయం చేసుకుని ఉధృతంగా మారుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే చంబల్, బెట్వా, కైన్ నదులూ యమునలో కలుస్తాయి.
హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ గుండా ప్రవహించే యమున.. ప్రయాగరాజ్ (అలహాబాద్) దగ్గర గంగను కలవడంతో యాత్ర సమాప్తి అవుతుంది. చాలా నదులలాగా సంద్రంలో కాకుండా మరో నదిలో కలవడం యమున విశేషం. అక్కడి నుంచి గంగా ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి.. యమునను గంగకు ఉపనదిగా కూడా భావిస్తారు.
ప్రయాగ అంటే నదుల కలయిక అని ఓ అర్థం. గంగా యమునలు కలిసే ఈ చోటును మొదటి నుంచీ గొప్ప పుణ్యక్షేత్రంగా భావించేవారు. రుగ్వేదం నుంచి మహాభారతం వరకూ లెక్కలేనన్ని పురాణేతిహాసాలలో దీని ప్రస్తావన కనిపిస్తుంది. జైనుల తొలి తీర్థంకరుడైన రిషభదేవుడు సైతం ఇక్కడే కైవల్యం పొందినట్టు చెబుతారు. బౌద్ధుల ప్రముఖ ఆరామాలూ ఉండేవి. ఆ సంగమం దగ్గరకు వచ్చిన ఎవరైనా సరే ముగ్ధులైపోవాల్సిందే. అక్బర్ సైతం అలా ముచ్చటపడి ఓ కోటను కట్టించి, దానికి ‘ఇలహబాస్’ (దేవుడు ఉండే చోటు) అని పేరు పెట్టాడు. అదే క్రమంగా అలహాబాదుగా మారింది. ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చుకుంది. గుప్తులు, నవాబులు, మొగలులు, చివరికి బ్రిటిషర్లకు సైతం అలహాబాదు ముఖ్యకేంద్రంగా ఉండేది. అందుకే నాటి కాంగ్రెస్ నాయకులకైనా, చంద్రశేఖర్ ఆజాద్ వంటి క్రాంతికారులైనా స్వతంత్ర పోరాటం కోసం అలహాబాదునే కర్మభూమిగా భావించారు.
యమున ఓ పవిత్రనది మాత్రమే కాదు. దేశ నాగరికతను నిలబెడుతున్న ప్రాణధార. దాదాపు ఆరుకోట్ల మంది నేరుగా ఈ నది మీద ఆధారపడుతున్నారని అంచనా. యమున లేనిదే ఉత్తరాదిలో వ్యవసాయాన్ని ఊహించలేం. అక్కడ దాదాపు కోటికి పైగా హెక్టార్ల పంటకు నీరందిస్తున్నదీ నది. వెస్టర్న్ యమున, ఈస్టర్న్ యమున, ఆగ్రా కెనాల్, సట్లెజ్-యమున కెనాల్ లాంటి వందలాది పంట కాలువలు ఈ నదీజలాలతో పొలాలకు నీరు పెడుతున్నాయి. ఇక తాగునీటి సంగతైతే చెప్పనక్కర్లేదు. దేశ రాజధాని ఢిల్లీకి 70 శాతం తాగునీరు అందించేది యమునే. ఈ నది మీద నిర్మించిన హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కూడా వందలకొద్దీ మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. Lakhwar dam వంటి మరిన్ని ప్రాజెక్టులు పూర్తయితే మరిన్ని లక్షల హెక్టార్లకు నీరు, వందల మెగావాట్లు సిద్ధం!

Yamuna River
పెళ్లిళ్లు: పుష్కరాల వేళ ఆ నదీ తీరంలోని ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలు చేసుకోరు. ఇది ఎంత దూరం వరకు, ఎన్ని రోజుల వరకూ అన్నది స్థానిక సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. బంధువులంతా యాత్రలలో ఉంటారనో, పితృకార్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలనో, పురోహితులు దొరకరనో.. ఇలా రకరకాల కారణాలతో ఈ నిర్ణయం జరిగి ఉండవచ్చు. యమున మనకు దగ్గరలో లేదు కాబట్టి.. ఈ పుష్కర నియమం మనకు వర్తించదు.
దానాలు: పుష్కరాలలో దానాలను కూడా ప్రోత్సహిస్తుంటారు. ప్రతిరోజు ఏ వస్తువు దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్పారు. మొదటి రోజు వెండి, బంగారం, రెండో రోజు వస్ర్తాలు, గోవులు.. ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. బీదసాదలంతా కలిసేచోటు కాబట్టి ఈ దానాలను సూచించి ఉండవచ్చు, పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు అక్కడి తీర్థంలో ఉంటారనే నమ్మకమూ కావచ్చు! కానీ దానం చేసి తీరాలనే పట్టు లేదు.
స్నానాలు: పుష్కర స్నానం అంటే ఇంట్లో చేసే అభ్యంగనం కాదు. శుభ్రమైన దుస్తులతో వేసే మునక. నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి మూడు మునకలు వేస్తారు. బతకనిస్తున్న నదికి, జీవశక్తినిచ్చే సూర్యునికి, దారిచూపించే సప్తర్షులకు, త్రిమూర్తులకు, గురు స్థానంలో ఉన్న బృహస్పతికి, మన పూర్వికులకు కృతజ్ఞతగా నీరు (అర్ఘ్యం) వదులుతారు. తీరంలో ఉన్న ఆలయాన్ని దర్శించడంతో స్నానం సంపూర్ణం అవుతుంది.
పితృకర్మలు: పుష్కరాలు నదులనే కాదు పెద్దలను కూడా తల్చుకునే సందర్భం. గతించిన పెద్దవాళ్లకు పుష్కర నదీతీరంలో పిండ ప్రదానం చేస్తారు. అంత స్తోమత, ఆసక్తి లేనివారు నువ్వులు, నీళ్లతో తర్పణాలు విడుస్తారు. ఇక్కడ తల్చుకోవడమే ముఖ్యం.
గంగానదిలాగా యమునకి అడుగడుగునా ఓ గుడి ఉండకపోవచ్చు. కానీ ఆ తీరం వెంబడి వెలసిన క్షేత్రాలు అసమానమైనవి.
యమునోత్రి: యమున జన్మస్థలానికి దగ్గరలో ఉన్న ఈ గుడిని దర్శించడం చార్ధామ్ యాత్రలో భాగం. ఇక్కడికి కాస్త దగ్గరలోని జానకీఛట్టీలో ఉన్న వేడినీటి బుగ్గలు పర్వతారోహణం చేసి వచ్చిన యాత్రికులని సేదతీర్చడంతోపాటు చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తాయని నమ్ముతారు.
మథుర: మన దేశంలో ఉన్న సప్త మోక్ష నగరాలలో శ్రీకృష్ణ జన్మస్థానమైన మథుర ఒకటి. ఇక్కడి యమునా తీరంలో పుణ్యస్నానాలకు చాలా ఘాట్లు ఉన్నాయి. ఇక ఆలయాలకైతే లెక్కలేదు. శ్రీకృష్ణజన్మస్థాన్, ద్వారకాధీశ్, గీతా మందిర్.. ఇలా వందల ఆలయాలు నాటి భారతాన్ని కళ్లకు కడతాయి.
బృందావనం: మథురకు అతి సమీపంలోనే కృష్ణుడి బాల్యం, యవ్వనం గడిచిన బృందావనం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఘాట్కీ ఒకో కథ ఉంది. ఉదాహరణకు కేశి ఘాట్ అనే చోట కేశి అనే రాక్షసి సంహారం జరిగిందని చెబుతారు. కన్నయ్య తన నోట్లో ముల్లోకాలనూ చూపించిన చోటు బ్రహ్మాండ ఘాట్! ఇక ఇక్కడి ఆలయాలను లెక్కపెట్టడం మొదలుపెడితే వేల సంఖ్యలో ఉంటాయని చెబుతారు. బన్ కె బిహారి, నిధివన్, ప్రేమ్ మందిర్ వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
బటేశ్వర్: ఆగ్రా జిల్లాలో యమున తీరాన ఉన్న ఓ అద్భుతం తాజ్‌మహల్ అయితే, మరొకటి బటేశ్వరాలయం. వటవృక్షం కింద ఉన్నాడు కాబట్టి ఇక్కడి దైవం బటేశ్వరుడు అయ్యాడు. జైనుల 22వ తీర్థంకరుడి జన్మస్థలం కాబట్టి, వారికి కూడా ఇది దర్శనీయమే. మహాభారత కాలం నుంచే బటేశ్వర్ ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది.
పవోంటా సాబ్: ఓసారి సిక్కుల గురువైన గురుగోవింద్ సింగ్ ప్రయాణిస్తున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఓ నదీతీరాన తన గుర్రం కదలకుండా ఆగిపోయింది. దాన్ని దైవ నిర్ణయంగా భావించి ఆయన కూడా కొన్నాళ్లు ఉందామనుకున్నాడు. నాలుగున్నరేళ్లు అక్కడే గడిపి ఎన్నో గ్రంథాలు రాశాడు. పాదాలు ఆగిపోయాయి కాబట్టి ఆ చోటుకు ‘పావ్ టికా’ అనే పేరు వచ్చి అదే క్రమంగా పవోంటా అయ్యింది.
కేవలం ప్రాచీన పుణ్యస్థలాలే కాదు.. ఈమధ్య కట్టిన అక్షరధామ్ మందిరం, ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్‌మహల్, ఢిల్లీని పాలించేందుకు షాజహాన్ కోరి కట్టించుకున్న ఎర్ర కోట, మహాత్మా గాంధీ సేదతీరుతున్న రాజ్ ఘాట్ అన్నీ యమునాతీరానే ఉన్నాయి. నది అంటే కట్టడాలు మాత్రమే కాదు కదా. ప్రతి నదీ తల్లిలా లక్షలాది జీవరాశులకు బతుకునిస్తుంది. యమున ఒడ్డున ఉన్న అసాన్ బర్డ్ సాంక్చురీ, కాలేసర్ జాతీయ వనం లాంటి పర్యావరణ కేంద్రాలే ఇందుకు సాక్ష్యం!
జూన్ రెండు నుంచి 13 వరకు జరగబోతున్న యమునానది పుష్కరాలు ఉత్తరాదికి అందునా కృష్ణుడు నడయాడిన వ్రజభూమికి వెళ్లాలనుకునే భక్తులకు మంచి తరుణం. ఒకవేళ యమునా నది ఉన్న క్షేత్రాలకు వెళ్లలేకపోయినా, ఈ సందర్భంలో ఆ నదీమతల్లిని తలుచుకుని, భారతీయులు జీవనంలో తన ప్రత్యేకతను గుర్తుచేసుకుని తీరాల్సిన సందర్భం.

ఓసారి యమునకు తన అన్నను చూడాలనిపించింది. ఒకసారి వచ్చి వెళ్లమంటూ గంగాదేవితో యముడికి కబురు పంపింది. తన గురించి చెల్లి బెంగ పెట్టుకుందని తెలిసిన యముడు పరుగుపరుగున ఆమె ఇంటికి వెళ్లాడు. అన్నను చూసిన చెల్లి కడుపు నిండింది. మృష్టాన్న భోజనంతో అతని కడుపు కూడా నింపింది. యమున ప్రేమకు కరిగిపోయిన యముడు ఏదన్నా వరం కోరుకొమ్మని అడిగితే ‘ఏడాదికి ఒక్కసారి ఇలా వచ్చిపోతే చాలు. అంతకు మించిన వరం ఏముంటుంది’ అన్నదట యమున. దానికి సరే అనడమే కాదు.. ఆ రోజున ఎవరైతే వారి సోదరి ఇంట భోజనం చేస్తారో వాళ్లకు అకాలమృత్యువు ఉండదనీ, వారికి ఆతిథ్యం ఇచ్చిన సోదరికి వైధవ్యం కలగదనీ వరమిచ్చాడట యముడు. అప్పటి నుంచి దీపావళి నుంచి రెండో రోజున వచ్చే ఈ భ్రాతృవిదియను అంతా పాటిస్తున్నారు. పెళ్లయిన తర్వాత క్రమంగా దూరమయ్యే సోదరిని గమనించుకుని, బంధాన్ని నిలిపి ఉంచుకునే పండుగగా భావిస్తుంటారు. శ్రీకృష్ణుడు సైతం ఈ రోజున తన చెల్లి సుభద్ర ఇంటికి వెళ్లాడని చెబుతారు.

ఫలానా నదికి పుష్కరాలు అనగానే అందరి దృష్టీ అటువైపు మళ్లుతుంది. అసలు ఆ నది విశిష్టత ఏంటి, ఎలా పారుతున్నది, మనకు దగ్గరలో దాని తీరం ఉందా, ఆ తీరంలో ఉన్న గుడి ఏమిటి.. లాంటి వివరాలు వినిపిస్తాయి. అక్కడికి వెళ్లి నదిని తలుచుకుని మునకలు వేసి, పెద్దలను తల్చుకుంటూ నీళ్లు వదిలి, గుడి చూసుకుని తిరిగి వస్తారు. పుష్కరాలు జరిగే సమయంలో అక్కడి నదులను శుభ్రం చేస్తారు కాబట్టి 12 ఏళ్లకి ఓసారైనా అవి తేటపడతాయి. వేల కిలోమీటర్ల కొద్దీ ప్రవహించే నదీజలాలు మోసుకొచ్చే లవణాలు చాలా జబ్బులను, మరీ ముఖ్యంగా చర్మవ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది. గ్రహగతులకు అనుగుణమైన కాలంలో పుష్కర స్నానం చేయడం వల్ల, ఆ ప్రభావం మరింతగా ఉంటుందనే నమ్మకమూ ఉంది.
ఈ రోజున జనాభా పెరిగింది కాబట్టి రద్దీని కూడా గమనించుకోవాల్సి వస్తోంది కానీ, ఒకప్పుడు ఇదో ఆధ్యాత్మిక యాత్ర. దారి పొడవునా ఉన్న దర్శనీయ స్థలాలు చూసుకుంటూ గత చరిత్రను స్మరించుకుంటూ సాగే కల్చరల్/హెరిటేజ్ టూరిజం. ఇప్పటి తరానికి నదికీ నాగరికతకీ ఉన్న సంబంధం తెలియకపోవచ్చు. వాళ్లకు మరోసారి వాటి ప్రత్యేకతను గుర్తుచేసే సందర్భంగా పుష్కరాలు మారాలి.

ఈ ఏడాది పుష్కరాలు జరుపుకొంటున్న యమున.. గత సంవత్సరం కూడా స్నానాలతో కళకళలాడింది. గంగ, యమున, అంతర్వాహిని అయిన సరస్వతి కలిసే అలహాబాదులో జరిగిన మహా కుంభమేళాలో ఏకంగా 66 కోట్లమంది స్నానం ఆచరించినట్టు అంచనా. ఇది ఓ ప్రపంచ రికార్డు. అర్ధ కుంభమేళ (ఆరేళ్లు), పూర్ణ కుంభమేళ (12 ఏళ్లు), మహా కుంభమేళ (144 ఏళ్లు). విదేశీయుల దాడినీ, వలసపాలననీ దాటుకుని వందల ఏళ్లుగా ఈ ఆచారం సాగడం నిజంగా ఓ అద్భుతం!

ఓ గుడినే కాదు.. అది ఉన్న పుణ్యక్షేత్రాన్నే పూర్తిగా చుట్టివచ్చే సంప్రదాయం పరిక్రమ. తిరువణ్నామలై, సింహాచలం, యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలు మనకు తెలుసు. నర్మదా నదిని కూడా పరిక్రమ చేసే సంప్రదాయం ఉంది. యమున దగ్గర కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది.. కాకపోతే కాస్త భిన్నంగా. చాలామంది భక్తులు యమునా తటి మీద ఉన్న మథుర, బృందావనాల చుట్టూ తిరుగుతారు. దారిలో ఉన్న గుళ్లను దర్శించుకుంటూ, ఘాట్ల వద్ద సేదతీరుతారు. ఇదే యమునా పరిక్రమ.

పుష్కరుడు అన్న పేరును గుర్తుపడతాం. కానీ, అతని అసలు పేరు తుందిలుడు. ఒకసారి తన తీవ్రమైన తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకున్నాడు తుందిలుడు. తన భక్తికి మెచ్చి లోకంలోని నదులకు అధిపతిగా తుందిలుణ్ని నియమించాడు పరమేశ్వరుడు. సమస్తజీవులనీ పోషించేది నదీజలాలే కాబట్టి.. తనకు పుష్కరుడు (పోషించేవాడు) అన్న పేరు వచ్చింది. కథ అక్కడితో అయిపోలేదు. ఓసారి బ్రహ్మదేవునికి పుష్కరుని సాయం అవసరమైంది. అలా బ్రహ్మ దగ్గరకు వెళ్లినవాడు అక్కడే ఉండిపోయాడు. కొన్నాళ్లకు పుష్కరుని తనతో పంపమంటూ దేవగురువు బృహస్పతి బ్రహ్మను కోరాడు. కానీ పుష్కరుడికేమో బ్రహ్మలోకాన్ని వదిలివెళ్లడం ఇష్టం లేదయ్యే. ఇందుకు ఓ పరిష్కారాన్ని ఆలోచించిన బ్రహ్మ.. బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా 12 రోజుల పాటు ఒక్కో నదిలో ఉండమని పుష్కరుడికి సూచించాడు. మనకి ఉన్నది 12 రాశులు కాబట్టి, 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునకు పుష్కరాలు జరుగుతాయి.

అది 2024 నవంబర్. ఉత్తరాదిన జరిపే ఛట్ పూజలో భాగంగా కొందరు దిల్లీలో యమునా తీరాన స్నానం చేస్తున్నారు. వారి చుట్టూ దట్టమైన నురగ. అడుగు మందాన తీరం అంతా విస్తరించిన నురగ. తెల్లగా కనిపించే ఆ పదార్థం నదిలో ఉన్న కాలుష్యం అని గ్రహించిన జనం విస్తుపోయారు. దేవతా నదులుగా పిలుచుకుని కొలుచుకునే వనరులను ఎంతలా విషపూరితం చేస్తున్నాం అనేదానికి సాక్ష్యం ఈ ఘటన.
లోకంలోనే అత్యంత కాలుష్య భరితమైన నదులలో ఒకటిగా యమునను మార్చేశాం. అందుకు ముఖ్య కారణం వ్యర్థాలే. ఓ అంచనా ప్రకారం దిల్లీలోని 58 శాతం చెత్తను యమునలో పారేస్తున్నారు. 1,376 కిలోమీటర్లు సాగే యమున ప్రయాణంలో కేవలం 22 కిలోమీటర్లే దిల్లీగుండా ఉంటుంది. అంటే రెండు శాతం కూడా కాదు. కానీ, యమున కాలుష్యంలో 80 శాతానికి కారణం అవుతున్నది. మనం పడేసే చెత్తకు తోడు వ్యర్థజలాలను సరిగ్గా శుద్ధి చేయకుండానే నదిలో వదలడం, పరిశ్రమల రసాయనాలనూ అందులోకే పంపడం.. కొనసాగుతూనే ఉంది.
యమునను శుభ్రం చేసేందుకు జపాన్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో వందల కోట్లు వెచ్చించి ‘యమునా యాక్షన్ ప్లాన్’ ఒకటి రూపొందించారు. 1993లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇంకా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఢిల్లీలో ఉన్న యమునను conservation zoneగా ప్రకటించాలనీ, యమునను కూడా చట్టపరమైన వ్యక్తిగా (legal person) గుర్తించి తగిన హక్కులు కల్పించాలనీ కోర్టులు తీర్పు ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. అందుకే 2025లో జరిగిన ఢిల్లీ ఎన్నికలలో యమున ప్రక్షాళన కూడా ఓ నినాదంగా ఉన్నది. 2027 నాటికి యమునను శుభ్రం చేస్తామంటూ నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి.. ఈ ఒక్క ఏడాదిలో ఏం అద్భుతం జరుగుతుందో చూడాలి!
– కె.ఎల్.సూర్య