ఎవరైనా ‘ఈల’ వేసి పిలిస్తే.. పోకిరీలనో, పోరంబోకులనో తిట్టుకుంటారు. ‘పేరుతో పిలవచ్చుగా!’ అని అంటారు. కానీ, మేఘాలయలోని ఓ పల్లెలో మాత్రం.. ‘ఈల’తో పిలిస్తేనే గ్రామస్తులు పలుకుతారు. అలా పలకరిస్తేనే.. తమపై ప్రేమ, అభిమానం ఉన్నదని భావిస్తారు. ఈ సంప్రదాయమే ఈ పల్లె ప్రత్యేకత. ‘యునెస్కో’ అత్యుత్తమ పర్యాటక పల్లెల్లో ఒకటిగా నిలిపింది.
ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా.. వ్యక్తులను వారి పేరుతోనో, వరసతోనో పిలుస్తారు. కానీ, ‘కొంగ్‌థాంగ్’ వాసులు మాత్రం అందుకు భిన్నంగా పలకరించుకుంటారు. ఎందుకంటే, ఇక్కడివాళ్లంతా తరతరాలుగా వస్తున్న ఓ విభిన్న సంప్రదాయాన్ని పాటిస్తారు. వ్యక్తులను వారి సాధారణ పేర్లతో కాకుండా.. వారికే ప్రత్యేకమైన విలక్షణమైన ‘ఈల’తోనే పిలుస్తారు. ఇక్కడి ప్రతి గ్రామస్తుడికీ ‘ఈల’ రూపంలో ఓ విభిన్నమైన ట్యూన్ ఉంటుంది.

ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డకూ తన తల్లే స్వయంగా ఈ ‘ప్రత్యేకమైన ఈల’ను పేరుగా పెడుతుంది. దీనిని స్థానిక భాషలో ‘జింగర్వై యావ్బీ’ అని పిలుస్తారు. అంటే.. ‘తల్లి మొదటి పాట’ అని అర్థం. అందరిలాగే ఇక్కడివారికీ సాధారణ పేర్లు ఉన్నప్పటికీ.. గ్రామస్తులు ఒకరినొకరు పిలుచుకోవడానికి ఈ ఈలనే ఉపయోగిస్తారు. ఈ కారణంగానే కొంగ్‌థాంగ్ గ్రామం ‘యునెస్కో’ అత్యుత్తమ పర్యాటక గ్రామాల జాబితాలోనూ చోటు దక్కించుకున్నది.

మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్‌లో ‘కొంగ్‌థాంగ్’ గ్రామం కొలువుదీరింది. తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా ‘విజిల్ విలేజ్’గా పేరు తెచ్చుకున్నది. ఇక్కడంతా దట్టమైన కొండ ప్రాంతం కావడంతో, సాధారణ పేర్లతో కమ్యూనికేట్ చేయడం కష్టంగా ఉంటుంది. దాంతో, గాలిలో సులభంగా ప్రయాణించే ‘ఈల’ శబ్దాన్ని తమ సంభాషణల కోసం ఎంచుకున్నారు. దూరంగా ఉన్న వ్యక్తులను పిలవడానికి, వారితో మాట్లాడటానికి ఈలనే ఉపయోగిస్తారు. కొండల మధ్య పని చేసుకునేటప్పుడు, వేట సమయంలో ఒకరినొకరు సంప్రదించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

ఖాసీ తెగకు చెందిన ‘కొంగ్‌థాంగ్’ గ్రామంలో ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థే ఉన్నది. అందుకే.. తల్లే ఈ రాగాలను సృష్టిస్తుంది. గ్రామంలో బిడ్డ పుట్టినప్పుడు.. తనతోపాటే కొత్త పాట కూడా పుడుతుంది. ఇక ఎవరైనా చనిపోతే.. ఆ వ్యక్తికి కేటాయించిన రాగం కూడా వారితోపాటే అంతరించిపోతుంది. ఆ పాట, రాగాన్ని మళ్లీ ఎప్పటికీ ఉపయోగించరు. ఈ పద్ధతి తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్నది. ఇది ఎప్పుడు మొదలైందో, ఎవరు మొదలు పెట్టారో తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ, తామందరం ఈ పద్ధతిని నేటికీ పాటిస్తున్నామని అంటారు. గ్రామంలో సుమారు 700 మంది ఉంటారు. కాబట్టి, ఈలల్లో 700 రకాల రాగాలు వినొచ్చన్నమాట!

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ‘కొంగ్‌థాంగ్’ గ్రామం.. భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నది. ఈల పిలుపులతోనే కాదు.. ప్రకృతి సౌందర్యానికీ కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణం.. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శిస్తుంది. ఇక వెదురుతో చేసిన స్థానికుల ఇళ్లు మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే, ఈ గ్రామాన్ని సందర్శించడానికి ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు కూడా!