సత్యభామ నరకసంహారం.. బలి చక్రవర్తి దానశీలం.. మహావీరుని నిర్యాణం.. బందీ ఛోడ్ పర్వం
ప్రతి జ్యోతిలోనూ ఒక ప్రత్యేకమైన దైవీయత దర్శనమిస్తుంది. అనేకరూపాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని తనలో ఇముడ్చుకున్న పర్వదినం దీపావళి. ఆరోజు రాత్రి కోట్లాది ప్రమిదలు ఒకేసారి వెలిగినప్పుడు ఆ వెలుగు కేవలం ఇండ్లకే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతిలో తరతరాలుగా ప్రవహిస్తున్న దైవారాధనా పరంపరను కండ్లముందు నిలుపుతుంది.
దైవానికి.. దీపం ఆభరణం!
అనంతమైన ఆకాశం.. అంధకారాన్ని ఆభరణంగా ధరించిన అమావాస్య రాత్రి.. నక్షత్రాల నిశ్శబ్ద వీక్షణం.. ఆ నిశీధిలో భూమిపై ఒక్కసారిగా వెల్లివిరిసే దీపకాంతుల సౌందర్యం. అది కేవలం దీపం కాదు. యుగయుగాలుగా భారతీయ ఆరాధనా సంప్రదాయాన్ని వెలిగిస్తున్న అగ్నితత్వానికి ప్రతిరూపం. యజ్ఞవేదికపై హవ్యాన్ని స్వీకరించిన అగ్ని నుంచి దేవాలయ గర్భగుడిలో నిత్యం వెలిగే అఖండజ్యోతి వరకు, అరుణాచల శిఖరంపై ఆకాశాన్ని తాకే మహాదీపం నుంచి ఇంటి గడపపై నిర్మలంగా వెలిగే మట్టి ప్రమిద వరకు.. ప్రతి జ్యోతిలోనూ ఒక ప్రత్యేకమైన దైవీయత దర్శనమిస్తుంది. ఇలా అనేక రూపాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని తనలో ఇముడ్చుకున్న పర్వదినం దీపావళి. ఆరోజు రాత్రి కోట్లాది ప్రమిదలు ఒకేసారి వెలిగినప్పుడు ఆ వెలుగు కేవలం ఇండ్లకే పరిమితం కాకుండా భారతీయ సంస్కృతిలో తరతరాలుగా ప్రవహిస్తున్న దైవారాధనా పరంపరను కండ్లముందు నిలుపుతుంది.
దీపం జ్యోతి పరం బ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే..!
అంటూ ప్రతీ సందర్భంలోనూ దీపాన్ని స్తుతిస్తాం. పండుగలు, వ్రతాలు, నోములు, సభలూ సమావేశాలు, చావుపుట్టుకల సమయంలో దీపానికి ప్రత్యేక స్థానముంది. భారతీయ సనాతన సంప్రదాయంలో దీపానికి ఉన్న స్థానం మరే ఇతర వస్తువుకూ లేదంటే అతిశయోక్తి కాదు. దీపం కేవలం వెలుగు ఇచ్చే సాధనం కాదు.. దైవ సాన్నిధ్యాన్ని ఆహ్వానించే మంగళచిహ్నం.
‘శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన సంపదః
శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే.. !
ఈ ప్రార్థనలో దీపాన్ని కేవలం వస్తువుగానే చూడకుండా శుభం, కల్యాణం, జ్ఞానం, దైవానుగ్రహానికి ప్రతీకగా భావించమని చెబుతుంది.
దీపావళి వచ్చిందంటే ఇండ్లన్నీ ప్రమిదలతో అలంకృతమై దీపాల వెలుగుల్లో కాంతులీనుతుంటాయి. ధన త్రయోదశి నుంచి యమ ద్వితీయ వరకు ఐదు రోజులపాటు జరిగే దీపావళి సంబురాలు అంబరాన్ని తాకుతాయి. అయోధ్యలో పట్టాభిషేక ఆనందం.. శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ చేసిన నరకసంహారంతో చెరవీడిన స్త్రీల సంతోషం.. బలిచక్రవర్తి దానశీలతను గుర్తుచేసుకునే సందర్భం.. పావాపురిలో మహావీరుని నిర్యాణం.. అమృత్సర్లో బందీ ఛోడ్ పర్వం.. ఇన్ని యుగాలు, ఇన్ని కథలు, ఇన్ని విశ్వాసాలు ఒకే పండుగ వెలుగుల్లో కలుసుకోవడం దీపావళి ప్రత్యేకం. చీకటిపై విజయం సాధించి దీపాల వరుసతో వెలుగులు ప్రసరింపజేసే ప్రసిద్ధ పర్వదినం దీపావళి.

Gods
ఐదు రోజుల సంబురం..!
దీపావళి అంటే ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తిక శుద్ద విదియ వరకు దీపావళి వేడుకలు జరుగుతాయి.
మొదటి రోజు ధన త్రయోదశి. దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈనాడే. ఆమెను సంపదకు అధిదేవతగా భావించి దీపావళికి లక్ష్మీపూజలు చేస్తారు. ధనత్రయోదశి రోజున కొద్దిగా బంగారం అయినా కొనుగోలు చేయాలని, అలా తీసుకుంటే అంతా కలిసొస్తుందని విశ్వాసం.
రెండోరోజు నరక చతుర్దశి. వరాహ మూర్తి, భూదేవిల సంతానం నరకుడు. ప్రాగ్ జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉంటాడు. తల్లి చేతిలో తప్ప ఎవరి వల్ల మరణం లేకుండా వరం పొందుతాడు. తన వర బలంతో విర్రవీగుతూ సామాన్య ప్రజలను హింసిస్తూ 16వేల మంది మహిళలను చెరబడతాడు. ఆ స్త్రీలకు విముక్తి కలిగించడానికి భూదేవి.. ద్వాపర యుగంలో సత్యభామగా అవతరించి శ్రీకృష్ణుడితో కలిసి నరకుడిని సంహరిస్తుంది.
మూడో రోజు.. చతుర్దశి నాడు నరకుడు అంతమైన సందర్భంగా ఆ మర్నాడు దీపావళి జరుపుకోవడం మొదలైంది. దీపాలు వరుసగా పెట్టి తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని భావిస్తూ టపాసులు కాల్చడం ప్రారంభమైంది. ఇదే రోజు లక్ష్మీపూజలు కూడా చేస్తారు.
నాలుగో రోజు బలిపాడ్యమి. దీనినే పడ్వా అని కూడా పిలుస్తారు. ప్రహ్లాదుని మనుమడైన బలి చక్రవర్తి ఇంద్ర పదవిని పొందాలని భావిస్తాడు. అందుకోసం మహా క్రతువులు నిర్వహిస్తుంటాడు. విష్ణువు వామనుడిగా వచ్చి బలిని మూడడుగులు దానం కోరుతాడు. వామనుడే త్రివిక్రముడై ఒక అడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. మూడో అడుగుతో బలిని పాతాళానికి తొక్కేస్తాడు. బలి దానగుణానికి మెచ్చి కార్తిక శుక్ల పాడ్యమి రోజున భూలోకానికి రావచ్చనే వరం ఇస్తాడు. ఈ రోజున భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు కానుకలిచ్చుకుని ప్రేమను ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంద్రుడి ఆగ్రహం నుంచి తన ప్రజలను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది కూడా ఈ రోజే. చాలా మంది ఈ ఘటనను వివరించడానికి మట్టి, ఆవుపేడతో బొమ్మలను తయారుచేస్తారు.
ఐదోరోజు యమద్వితీయ. యమధర్మరాజు అతని సోదరి యమి మధ్య ఉన్న సోదరబంధం నుంచి ప్రేరణ పొంది, తోబుట్టువులు తమ సంబంధాలను గౌరవించుకోవడానికి, బలపరుచుకోవడానికి ఈ పండుగను జరుపుకొంటారు. భగినీ హస్త భోజనంగా విదియ రోజున అన్నాచెల్లెళ్ల పండుగ చేసుకుంటారు. సోదరులు తమ సోదరిల ఇండ్లకు వెళ్లి, కానుకలు ఇచ్చి.. ఆమె చేతి వంట తినడం సంప్రదాయం. తోబుట్టువు క్షేమ సమాచారాలు తెలుసుకోవడమే ఈ పండుగ అంతరార్థం.
దీపావళి ఐదురోజుల పండుగే అయినా తెలుగునాట దీపావళి వేడుకలు నరక చతుర్దశి నుంచి ప్రారంభమవుతాయి. నరక చతుర్దశి రోజు మంగళ హారతులు, తలంటు స్నానాలు, కొత్త దుస్తులు ధరించి, పిండివంటలు చేసుకుంటారు. సాయంత్రం ఇంటికి దక్షిణ దిక్కులో యమదీపం వెలిగిస్తారు. మరుసటి రోజు దీపావళి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకొంటారు. సాయంత్రం ఇంటి ముంగిట, ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం టపాకాయలు కాల్చి బంధుమిత్రులకు మిఠాయిలు పంచుతారు. పాడ్యమి రోజున కేదారగౌరీ వ్రతం, గౌరమ్మ పూజ, గోపూజ చేస్తారు. ప్రధానంగా కేదారీశ్వర వ్రతం తెలుగునాట ప్రసిద్ధి.
దీపావళి వేళ ఇలా..
యమధర్మరాజు సూర్యుడికి, ఛాయాదేవికి జన్మించినవాడు. చతుర్దశి, అమావాస్య, పాడ్యమి రోజులు యముడికి, పితృదేవతలకు ఇష్టమైన రోజులు. అందుకే నరక చతుర్దశి రోజున ప్రత్యేక దీపాలు పెడతారు. ‘చతుర్దశ్యాంతుయే దీపాన్ నరకాయార్పయంతిచ.. తేషాం పితృగణాస్సర్వే నరకాలత్సర్వగమాప్నుయుః’ అంటే చతుర్దశి రోజున యముడి ప్రీత్యర్థం దీపాలు పెట్టి పూజించే వారి పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి పోతారని అర్థం. ఈ దీపానికే యమ దీపమని పేరు. ఆ తర్వాత భ్రాతృ విదియ వస్తుంది. వివాహం అయిన స్త్రీలు తమ సోదరులను పిలిచి భోజనం పెడతారు. సూర్యుడి కుమార్తె అయిన యమున, తన సోదరుడైన యముణ్ని పిలిచి అతనికి విందు చేసి సత్కరించింది ఈనాడే!
‘తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిథౌ వశేత్, అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే..’ అని శ్లోకం చెప్తూ దీపావళి రోజున తెల్లవారుజామున స్నానం చేయాలి. సాధారణంగా నూనెలో లక్ష్మీదేవి ఉండదు. కానీ దీపావళి ఒక్కరోజే నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఒంటికి, తలమీద నువ్వుల నూనె రాసి స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అలక్ష్మీ పోతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో కాశీ వెళ్లకుండా గంగాస్నానం సంకల్ప సహితంగా చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క తిథి దీపావళి అమావాస్య మాత్రమే.

Husband Wife Diwali
అగ్నితత్వమే దీపారాధన..
‘త్వమగ్నే యజ్ఞానాం హోతా, విశ్వేషాం హితః దేవేభిర్మానుషే జనే..’ భగవంతుడిని ఓ జ్యోతిస్వరూపమైన పరమాత్మా.. నువ్వు కర్మఫలదాతవు, సర్వహితుడవు, సుప్రసిద్ధుడవంటూ దీపమూర్తిగా వేదం కీర్తించింది. భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థలో అగ్ని ఉపాసన అత్యంత ప్రాచీనమైనది. ‘అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్..’ అగ్ని కేవలం యజ్ఞంలో వెలిగించే జ్వాల కాదు. వైదిక సంప్రదాయంలో దైవానికి, మనిషికి మధ్య పవిత్రమైన అనుసంధానంగా భావిస్తారు. అదే అగ్ని తత్వం గృహంలో దీపారాధన రూపంలోనూ కొనసాగింది. సృష్టి ప్రారంభంలో ఈ భూగోళమంతా ఓ మహాదీపంలా దేదీప్యమానంలా వెలిగేదని చెబుతుంది నారదీయ సూక్తం. సూర్యుడు మొదలు చిరుదీపం వరకూ సమస్త కాంతులకు సృష్టికర్తే ఆధారమంటుంది ఉపనిషత్తు. ‘అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా..’ అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. ఈ ప్రార్థనలో అంధకారం నుంచి జ్యోతివైపు నడిపించమంటూ చేసే విన్నపం ఉంది.
మంత్ర బీజాక్షరాలు లేకుండా దీపమే సాధకుడిని ధ్యానస్థితికి తీసుకువెళ్తుంది. దీపధ్యానమనీ, త్రాటక ధ్యానమనీ అంటారు. చీకటి గదిలో ఎదురుగా కనిపిస్తున్న దీపాన్ని కన్నార్పకుండా చూస్తూ క్రమంగా ఆ కాంతి గదినిండా, మది నిండా విస్తరిస్తున్న అనుభూతిని పొందుతారు. దీపాన్ని వివిధ రకాలుగా తయారుచేస్తే పలురకాల ఫలితాలు వస్తాయని నమ్మకం. నిమ్మకాయలో దీపం వెలిగిస్తే అమ్మవారు సంతుష్టురాలు అవుతుంది. కార్తిక మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగిస్తారు. వేంకటేశ్వరస్వామికి పిండిదీపాలు ప్రీతికరం. కొబ్బరికాయలో, గుమ్మడికాయలో, సగం నీరు, సగం నూనెతో వెలిగించే జలదీపం, సముద్రతీరాల్లోనూ వెలిగించేది తీర దీపం.. ఇలా చాలా రకాల దీపాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దీపావళికి దీపదానాలు చేయడం సంప్రదాయం. దీనివల్ల సకల శుభాలు కలుగుతాయని, సర్వగ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు. దీపావళిని నారదపురాణం దీపదాన మహోత్సవం అంటుంది. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మహాలక్ష్మికి దేవకాంతలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని పద్మపురాణం చెబుతుంది.
ఒకప్పుడు యజ్ఞ వేదికలపై మంత్రఘోషల మధ్య వెలిగిన అగ్ని.. కాలక్రమంలో దేవాలయాల్లో దీపారాధనగా, గృహాల్లో నిత్యపూజగా, కార్తిక మాసంలో దీపోత్సవంగా, దీపావళిలో మహావెలుగుల పండుగగా విస్తరించింది. కాల గమనంలో దీపోత్సవ రూపాలు మారాయి. ఆరాధనా పద్ధతులు రకరకాలుగా ఉన్నాయి. కానీ, దీపానికి భారతీయ సంస్కృతి ఇచ్చిన పవిత్రస్థానం మాత్రం యుగ యుగాలుగా కొనసాగుతూనే ఉంది. అనంతమైన విశ్వంలో ఒక చిన్నజ్యోతి.. ఆ జ్యోతిలో విశ్వవ్యాప్తమైన దైవత్వం.. అదే దీపారాధనలోని అద్భుతం.. దీపావళి అంతరార్థం. అమావాస్య చీకటిలో ఆవిర్భవించే ఆ ఒక్కజ్యోతి మట్టి ప్రమిదలో ప్రతిష్ఠితమైన అనంత తేజస్సు.. అదే మన దీపావళి. జ్యోతిర్మయమైన భారతీయ సంస్కృతికి నిత్యనూతనమైన దీప్తి.
దీపావళికి నూతన సంవత్సరాది..!
గుజరాత్లో దీపావళిని ఐదురోజుల పండుగగా జరుపుకొంటారు. ఇదే సమయంలో గుజరాతీలు, మార్వాడీలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అదేరోజు వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభించే చోపడా పూజ నిర్వహిస్తారు. దీపావళి రోజున గుజరాతీ మహిళలు కాజల్ అంటే కాటుకను తయారు చేస్తారు. దీపావళినాటి రాత్రి ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ రాత్రంతా దీపం వెలుగుతూ ఉండేలా జాగ్రత్త పడతారు. మరుసటిరోజు ఉదయం ఆ దీపం నుంచి వచ్చిన మసిని సేకరించి కాటుకగా తయారుచేసి ఏడాది పొడవునా కళ్లకు పెట్టుకుంటారు. దీపావళి సందర్భంగా గార్భా, దాండియా రాత్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మోతీచూర్ లడ్డూ, శంకర్పాలి వంటి ప్రత్యేకమైన పిండివంటలు దీపావళికి గుజరాత్లో ప్రత్యేకం. శ్రీకృష్ణసత్యభామల విజయానికి సంకేతంగా గోవాలో నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఊరంతా దిష్టిబొమ్మను ఊరేగించి ఓ ప్రదేశంలో దహనం కానీ, శిరస్సు ఖండనం కానీ చేస్తారు. ఈ తతంగం మొత్తం దీపావళి రోజు సూర్యోదయానికి ముందే జరుగుతుంది.

Diwali New Year
పౌరాణిక చారిత్రక ప్రాధాన్యం..
పురాణేతిహాసాల్లో, చరిత్రలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా రాముడు అయోధ్యకు వచ్చింది దీపావళి రోజునేనని చెబుతారు. అందుకోసమే దీపావళి పర్వదినం చాలా ముఖ్యమైనదిగా భావించి, రామరాజ్యం ప్రారంభమైన రోజున ప్రజలు దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి ఆనందాలు పంచుకుంటారు. నేటికీ అయోధ్యలో దీపావళి అంగరంగ వైభవంగా సాగుతుంటుంది. సరయూ తటిపై లక్షలాదిగా దీపాలు వెలిగించి రామచంద్రుడికి ప్రణతులు సమర్పిస్తారు.
మహాభారతంలో జూదంలో ఓడి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తి చేసుకుని పాండవులు తిరిగి హస్తినాపురానికి వచ్చింది కూడా దీపావళి రోజునేనట. విక్రమార్క మహారాజు గొప్ప సాహసికుడు. మానవాతీతమైన గొప్ప శక్తులను పొందిన మహారాజు. ఉజ్జయినిని ముఖ్యపట్టణంగా చేసుకుని పాలించాడు. శకులను సంహరించి విజయాన్ని సాధించి షట్చక్రవర్తుల్లో ఒకరైన విక్రమాదిత్యుడి పట్టాభిషేకం జరిగింది, విక్రమార్క శకం ప్రారంభమైంది కూడా ఇదే రోజున అని చరిత్ర చెబుతున్నది. తొలి తెలుగు రాజైన శాలివాహనుడు విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా దీపావళి రోజునే అని చరిత్రకారులు చెబుతారు.
దీపావళి కేవలం మౌఖిక కథల్లోనే కాదు, ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. ఏడో శతాబ్దానికి చెందిన హర్షవర్ధనుడి నాగానందం నాటకంలో దీపోత్సవ సంప్రదాయానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. మధ్యయుగ సాహిత్యంలో దీపమాలిక వంటి పేర్లతో దీపాల ఉత్సవాలు కనిపిస్తాయి.

Pouranikam
ఎక్కడచూసినా దీపజ్యోతులే..!
బుద్ధుడు తన తండ్రి శుద్ధోదన మహారాజు పిలిపించిన క్రమంలో కొన్ని రోజుల తర్వాత తన జన్మస్థలానికి వస్తారు. ఆ సమయంలో బుద్ధుడి రాకను ఆహ్వానిస్తూ ప్రజలంతా దీపాల వరుసలతో స్వాగతిస్తారు. అప్పటి నుంచి బౌద్ధులు కూడా దీపాల వరుసలతో బుద్ధుడిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తున్నది. దీపావళి జరిగిన నెలరోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో వేడుకలు జరుపుకొంటారు. దీనిని బుద్ధి దీపావళి అంటారు. రాముడు అయోధ్యకు వచ్చిన నెల తర్వాత వీళ్లకు సమాచారం తెలిసిందట. అందుకే ఇక్కడి ప్రజలు నెల రోజుల తర్వాత దీపావళి జరుపుకొంటారని కథనం.
పంజాబ్లో సిక్కు సమాజానికి దీపావళి సమయంలో బందీ ఛోడ్ దివస్ అంటూ ప్రత్యేకంగా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువైన గురు హర్గోబింద్ సాహిబ్ జైలు నుంచి విడుదలైన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటారు. అమృతసర్లో స్వర్ణదేవాలయాన్ని కట్టింది కూడా ఇదే రోజునని భావిస్తూ ప్రత్యేకంగా దీపాలతో అలంకరించి పండుగ చేసుకుంటారు. సిక్కుల చరిత్రలో స్వేచ్చ, న్యాయానికి సంబంధించిన ప్రత్యేకమైన సందర్భంగా దీపావళిని భావిస్తారు. జైన సంప్రదాయంలో దీపావళికి ప్రత్యేక ప్రాధాన్యముంది. 24వ తీర్థంకరుడైన మహావీరుడు దీపావళి రోజు నిర్యాణం చెందారు. అందుకే ఆ రోజున మహావీరుడి ఆధ్యాత్మిక విముక్తిని స్మరించుకుంటూ సంప్రదాయ వేడుకలు నిర్వహించుకుంటారు.

Deepajyothulu
పిల్లికి నైవేద్యం..
సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మేలుకలయిక అయిన ఈ దీపావళి వేడుకలు దేశ విదేశాల్లో విభిన్నరీతుల్లో జరుపుకుంటారు. ధన్వంతరీ ఆరాధన, కుబేర పూజ, లక్ష్మీ పూజ, దీపాలు, టపాసులు.. ఇవన్నీ అందరూ అనుసరించేవే! మిగిలిన సంప్రదాయాల్లో చిన్నచిన్న మార్పులుంటాయి. కర్ణాటకలో మొదటి మూడు రోజులు అంటే ధన త్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి అమావాస్య.. ఈ మూడు రోజులను దీపావళిగా జరుపుకొంటారు. కేరళంలో బలి చక్రవర్తి పాతాళం నుంచి ఏడాదికి ఒక్కసారి అంటే దీపావళి రోజున భూమి మీదకు వచ్చి తన ప్రజలను తనివితీరా చూసుకుంటారని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే దీపావళిని కేరళీయులు బలి అమావాస్యగా జరుపుకొంటారు. రాజస్థాన్లో దీపావళిని ధన్తేరాస్గా చేసుకుంటారు. పండుగ రోజున మహిళలంతా తమ నగలను నదిలో శుభ్రం చేసుకుంటారు. అనంతరం పిల్లిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తారు. పండుగ రోజున చేసిన అన్ని రకాల వంటలను పిల్లికి నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆచారం. ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్ ప్రజలు దీపావళి రోజున తమ ఇళ్లలో బురద ఇంటి ప్రతిమలు ఉంచుతారు. వీటిని ఘరోందాస్ అంటే దేవుడికి స్వాగతం పలకడంగా భావిస్తారు.

Pilliki Naivedyam
మహారాష్ట్రలో దీపావళి సందడి వారం ముందు నుంచే ప్రారంభమవుతుంది. చిన్నారులంతా మట్టితో కోటలు తయారుచేస్తారు. ఆ కోటల చుట్టూ పచ్చని మొక్కలు నాటుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి మడుగుల్లో వీటిని ఉంచుతారు. ఇక్కడ దీపావళి పండుగకు ఆకుపచ్చ కోటలు, వాటి చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళనాడులో దీపావళి పండుగ కన్నా నరక చతుర్దశికే ప్రాధాన్యం అధికం. ఇక్కడ దీపావళి పండుగను రాత్రి కాకుండా ఉదయమే చేసుకుంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి కుండల్లో నీటిని వేడిచేసి ఇల్లంతా శుభ్రం చేస్తారు. రంగురంగుల ముగ్గులతో ఇంటి ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత కుండలను అలంకరిస్తారు. ఆరోజు శీకాకాయతో తలంటు స్నానం చేయడం ఇక్కడ ప్రత్యేకం. జీర్ణ శక్తిని పెంచే ప్రత్యేక లేహ్యాన్ని దీపావళి వేళ తమిళులు తీసుకుంటారు. ఆ తర్వాత బాణసంచా కాల్చి పండుగ చేసుకుంటారు. పశ్చిమ్ బెంగాల్లో లక్ష్మీపూజకు బదులు కాళీపూజ చేస్తారు. కాళీమాత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల్లో, మంటపాల్లో పూజిస్తారు. కొన్ని బెంగాలీ కుటుంబాల్లో దీపావళికి ముందు వచ్చే భూత చతుర్దశి రోజున 14 దీపాలు వెలిగించే ఆచారం కూడాఉంది.
– రంగనాథ్ మిద్దెల, 9866573461

Diwali Clebrations
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

