ధరల దరువు..ముందుచూపు కరువు
ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాయకత్వ సామర్థ్యం మరింత బయటపడుతుంది. ఎల్ నినో ఇంకా పూర్తి స్థాయిలో తన సామర్ధ్యం చూపకముందే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంత వేగంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో నాయకత్వ సామర్థ్యం మరింత బయటపడుతుంది. ఎల్ నినో ఇంకా పూర్తి స్థాయిలో తన సామర్ధ్యం చూపకముందే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంత వేగంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సన్నబియ్యం కిలో రూ.90 దాటింది. ఒకటి రెండు వారాల్లో రూ.వంద కూడా దాటొచ్చు. ఆరు నెలల క్రితం రూ.50కి కిలో ఉన్న బియ్యం ధరలు ఇప్పుడు రూ.90 దాటి వందకు చేరువ కావడానికి పరుగులు తీస్తున్నాయి. పంట మీద ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎల్ నినో కంటే ముందే పండించిన బియ్యం ధరలే ఇలా ఉంటే, ఎల్ నినో తర్వాత బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు.
ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేకపోవచ్చు కానీ తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం పాలకుల కనీస ధర్మం. ఏడేండ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది. చిన్నపిల్లలు సైతం పిట్టల్లా రాలిపోతున్న రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన వయసును సైతం లెక్క చేయకుండా దవాఖానలకు వెళ్లి బాధితులను పరామర్శించి, తన మాటలతో ధైర్యం చెప్పేవారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్ నినోపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సైతం హాజరుకాలేనంత బిజీగా ఉన్నారు.
సీఎం దవాఖానలకు వెళ్లి కరోనా బాధితులను పలకరించడమంటే అక్కడున్న కొద్దిమందికి ధైర్యం చెప్పడం కాదు. ఆ దృశ్యాలను టీవీల్లో చూసిన కోట్లాది మంది ప్రజలకు ధైర్యం వచ్చింది. దేశమంతా లాక్ డౌన్ అంటే ఎలాంటి కార్యకలాపాలు జరుగవు. దేశమే పూర్తిగా స్తంభించినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. అలాంటి సంక్లిష్ట పరిస్థితిల్లో సైతం ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సగం జీతం చెల్లించారు. రేషన్ కార్డు ఉన్న ఒక్కో కుటుంబానికి 12 కిలోల బియ్యం, రూ.1,500 నగదు సహాయం అందించారు. వలస కూలీల ప్రాధాన్యతను గుర్తించి వారికి కూడా బియ్యం, నగదు సహాయం అందించారు. తెలంగాణ అభివృద్ధిలో వలస కూలీలు భాగస్వామ్యమేనని తలచి వారికీ ఈ సహాయం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఇక తెలంగాణలో ఎల్ నినో విషయానికి వస్తే అఖిలపక్ష సమావేశానికి సైతం ముఖ్యమంత్రి హాజరుకాలేదు. టీవీలో జరిగిన చర్చలో అఖిలపక్ష సమావేశానికి సీఎం హాజరుకాకపోవడాన్ని ప్రస్తావిస్తూ సీఎంకు అనేక ముఖ్యమైన పనులు ఉంటాయని కాంగ్రెస్ ప్రతినిధి సమర్ధించారు. ఏ ప్రాజెక్ట్ ఏ పరీవాహక ప్రాంతానికి చెందినదో ముఖ్యమంత్రికి సరిగా తెలియదు. సీఎంకు మద్దతుగా మాట్లాడాలని ప్రయత్నించిన నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఒకరు భద్రాచలం వద్ద శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ ఉన్నదని మీడియా ముందు జ్ఞాన ప్రదర్శన చేశారు. ఇలాంటి నాయకత్వం అఖిలపక్ష సమావేశాల్లో పాల్గొన్న ఏమి మాట్లాడతారు, ఏమి నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వానికి విషయ పరిజ్ఞానం లేనపుడు అధికారులు ఏం చేస్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు ఇస్తే ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయని 2004 ఎన్నికల్లో చంద్రబాబు చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం కాగానే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్తుపైనే. బట్టలు ఆరేసుకోవలసి వస్తుందని నమ్మిన అధికారులే అప్పుడు నాయకత్వం మారగానే ఉచిత విద్యుత్తు అమలును చేసి చూపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించారు.
రాష్ట్ర నేతలు వ్యవస్థకు నాయకత్వం వహిస్తారు. వ్యవస్థతో పనిచేయిస్తారు. అది నాయకత్వ ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బూతులు తిట్టడమే తమ ప్రతిభగా భావిస్తున్నది. సమర్థులైన ఐఏఎస్ అధికారులు అసమర్థ నాయకత్వంలో పనిచేయలేక వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు తెలంగాణ వస్తే ఐటీ రంగం ఏమవుతుందో అనే భయాలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీ మంత్రిగా కేటీఆర్, ఐఏఎస్ అధికారిగా జయేష్ రంజన్ నాయకత్వంలో ఐటీ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో కన్నా వేగంగా అభివృద్ధి చెందింది. అలాంటి సమర్ధుడైన అధికారి కూడా పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది.
ఎల్ నినో ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే ‘వరి వేయం, ఏం జరిగినా బాధ్యత మాదే’ అని రైతుల నుంచి అధికారులు అఫిడవిట్ తీసుకుంటున్నారు. అఫిడవిట్ ఇస్తేనే ఎరువులు, విత్తనాలు ఇస్తారట. కాళేశ్వరం మరమ్మతులు చేయడానికి మూడేండ్ల క్రితం ప్రాజెక్టు నిర్మించిన కంపెనీ ముందుకు వస్తే, ప్రాజెక్ట్ వల్ల రైతులకు కలిగే మేలు కన్నా మరమ్మతులు చేయకుండా అలాగే ఉంచడం వల్ల తమకు కలిగే రాజకీయ ప్రయోజనం ముఖ్యమని ప్రస్తుత పాలకులు భావించారు. మూడేండ్ల క్రితమే మరమ్మతులు పూర్తయి ఉంటే ఎల్ నినోను తెలంగాణ విజయవంతంగా ఎదుర్కొని ఉండేది.
తెలంగాణ అంటే ఒకప్పుడు కరువుకు శాశ్వత చిరునామా అన్నట్టు ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వరి పంటలో దేశంలోనే అత్యధికంగా పండించి రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు పాలకులు తమ అసమర్ధ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు మరోసారి కరువును చూపిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో 231 కరువు మండలాలను ప్రకటించింది అప్పటి కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు మళ్లీ కరువు మండలాల జోరు పెరిగింది. తాజాగా 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని కేంద్రం ఏప్రిల్‌లోనే హెచ్చరించింది.
అయినా ప్రభుత్వం మేల్కొనలేదు. కరువు వచ్చినా తెలంగాణపై ప్రభావం పడకూడదనే లక్ష్యంతో గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నది. ఎన్నికల ముందు కాళేశ్వరం పిల్లర్ కూలడం కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగింది. కానీ మూడేండ్లయినా మరమ్మతు చేయకపోవడంతో కరువు దాపురించడంతో అన్నివర్గాల ప్రజలు కాంగ్రెస్‌పై మండిపడుతున్నారు. ఇల్లు కట్టినప్పుడు పర్రెలు పడితే మరమ్మతు చేసుకోమా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మరమ్మతు చేయరని సామాన్య రైతు సైతం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. రైతులు ప్రశ్నిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎల్ నినో తెలంగాణ ప్రజలపై విశ్వరూపం చూపిస్తే, రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు విశ్వరూపం చూపిస్తారు.
-బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

