త్రిపురాంతకుడి వైశిష్ట్యం
తెలంగాణ ప్రబంధ పరిమళానికి చెందిన పద్యాలు, అర్థం ఇస్తున్నాం. వీటిని మహబూబ్‌నగర్ జిల్లా మానాజీపేటకు చెందిన తూము రామచంద్ర అవనీ పాలుడు రచించారు. ఇవి ఆయన రచించిన ‘అలమేలుమంగా పరిణయం’ అనే పద్య కావ్యంలోనివి.
సీ. అలికదృగ్భవలసద్కవ్య వాహన
విదగ్ధాంబుజాతాస్త్ర! జోహారు నీకు!
కమలరిడ్ద్విట్స్ఫురద్రమణీయ భవ్య
కోటీరసంకలిత! జోహారు నీకు!
పవనభుక్పరివృఢ ప్రత్యగ్ర లావణ్య
హారకేయూర! జోహారు నీకు!
హిమ కుభృద్వృత్త భిత్సుమహితక
న్యామహాసతీ భర్త జోహారు! నీకు!
తే.గీ. సింధురాణ్మేఖలాహార్య శేఖరాగ
మాబ్జ భవ సాగరానంత హైమ
చేల రథసముత్తుంగ కోదండ రథ్య
నిచయ సారధీషుధిజ్యేషు! జోహారు నీకు !!
ఈ పద్యం తూము రామచంద్ర అవనీ పాలుడు రచించిన ‘అలమేలుమంగా పరిణయం’ అనే పద్య కావ్యం లోనిది. ఇతడు మహబూబ్‌నగర్ జిల్లా మానాజిపేట రాజులలోమేటి. గొప్ప పండిత కవీంద్రుడు. అసఫ్ జాహీల వద్ద అగ్రహారం పొందినవారు. ప్రౌఢంగా కనిపించే ఈ పద్యం శంకరస్తుతి.
అలిక దృక్ భవ లసత్ కవ్య వాహనుడు అంటే నుదుటిపై గల కన్ను నుంచి పుట్టిన అగ్ని (కవ్య వాహనుడు)తో పద్మాస్త్రుడైన మన్మథుని దహించిన వాడా నీకు జోహారు. కమల రిట్ ద్విట్ స్ఫురత్ రమణీయ అంటే కమలానికి శత్రువైన (రిట్) రమణీయమైన ప్రకాశం గలచంద్రుని కిరీటంగా ధరించిన వాడా నీకు జోహారు. గాలిని ఆహారంగా తీసుకునే వాటికి (పవన భుక్) ప్రభువైన (పరివృఢ) నూతనమైన సొగసులు గల నాగరాజును హారంగా ధరించిన వాడా నీకు జోహారు! మంచు పర్వతం గుండ్రని శిఖరాలలో ఆడుతున్న పర్వత పుత్రికయైన పార్వతీ దేవి మహాసతియైన వాడా జోహారు నీకు.
ఇక తేటగీతి పద్యంలోకి వద్దాం.. సముద్రం మొలనూలుగా గల్గిన భూదేవిని రథంగా, వేదాల శిఖరాలైన ఉపనిషత్తులను (శేఖరాగమ) ధనుస్సుగా గలవాడా, బ్రహ్మ (అబ్జభవ)యే సారథిగా గలవాడా, అనంతమైన సాగరమే (సాగరానంత) అమ్ములపొది (ఉధీషు)గా గలవాడా, విష్ణుమూర్తి (హైమచేల)యే బాణం (ఇషు)గా గలవాడా, రథ, సముత్తుంగ, కోదండ, రథ్య సమూహం (పై పాదాలతో అన్వయం) కలవాడా జోహారు నీకు! అని భావం. అంటే త్రిపురాసురులను సంహరించే సమయంలో… సముద్రాలు మొలనూలుగా గల భూమండలాన్ని రథంగా, మేరు పర్వతాన్ని ధనుస్సుగా, వేదాలను గుర్రాలుగా, బ్రహ్మదేవుడిని సారథిగా, సముద్రాన్ని అమ్ములపొదిగా, విష్ణుమూర్తిని బాణంగా మలచుకొని సకల విశ్వాన్ని తన విజయ సాధనంగా చేసుకున్న ఓ పరమశివా! నీకు శతకోటి వందనాలు అని కవి పరమశివుణ్ని స్తుతించారు.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

