దేవుడు మనుష్యులను చేసి ఉండకపోతే మనిషే దేవుణ్ని చేసి ఉంటాడని ఓ సామెత. మనిషికి ఆ అవసరం ఏముంది? అతనికి తెలుసు తనకు పరిమితులున్నాయని, చాలా విషయాలు తన అధీనంలో లేవనీ, అందువలన తనకంటె ఉన్నతమైన, స్థల కాల అవధులు లేని, ఆద్యంతాలు లేని, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు ఒకడున్నాడని, అతను తనకు సాయపడతాడని నమ్మడంలో చాలా సుఖం ఉందనీ! భీకరవర్షం, వరద, భూకంపం, ఉరుము, మెరుపు ఇలాటివి వచ్చినప్పుడు భయపడి దేవుణ్ని ప్రార్థించే కాలం నుంచి, అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకునేదాకా మానవుడు అభివృద్ధి చెందాడు.
అయినా ప్రకృతి ఉత్పాతాలను ఆపలేక కాపాడమని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాడు. ఉత్పాతాలు ఎప్పుడో వస్తాయి. చింతలనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిల్లోంచి బయటపడటానికి దేవుణ్ని ఆశ్రయించడం అనాదిగా వస్తున్నది. దానివలన ఫలితం ఉంటుందా? దేవుడు దిగివచ్చి మనిషి కోరికలన్నీ తీర్చేసి, వర్రీలన్నీ తుడిచేస్తాడా? అబ్బే, కృతయుగంలో కూడా అలా చేసిన దాఖలాలు లేవు. మన పార్టీ అధిష్ఠానాలలాగ సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటాం అంటూ తాత్సారం చేస్తాడు. మరి అలాటప్పుడు దేవుణ్ని తలచుకోవడం దేనికి? టైము దండగ కాకపోతే!
మానవుడికి స్వతస్సిద్ధంగా కొన్ని శక్తియుక్తులున్నాయి. ప్రయత్నం మీద అతను వాటిని అనేక రెట్లు పెంచుకున్నాడు. కానీ ఆ క్రమంలో చాలాసార్లు నిస్పృహకు గురవుతాడు. అప్పుడు అతనిలో ఆశ రగలాలి. తాను మంచివాణ్నని, సర్వసాక్షి ఐన దేవుడికి ఆ విషయం తెలుసని, తనకు తప్పక సాయపడతాడని అతను నమ్మాలి. అప్పుడే అతను మళ్లీ పుంజుకుని, తన మానవయత్నంతోనే అనుకున్నది సాధిస్తాడు. మళ్లీ విఫలమైనా కాలం కలిసిరాలేదని ఓదార్చుకుని ఇంకోసారి ప్రయత్నిస్తాడు. ఒక్కోప్పుడు ప్రయత్నానికి సరితూగే ఫలితం రాదు. అప్పుడు తనకు ఇంతే ప్రాప్తమని సరిపెట్టుకుని, ముందుకు సాగుతాడు.
– నన్ను చూసి ఏడవకురా.. ఎమ్బీయస్ ప్రసాద్ రచన నుంచి