సినారె పుట్టింది అచ్చ తెలంగాణ పల్లెలో. బడి కోసం ఊరు దాటి తొలుత అడుగు పెట్టింది ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడలో, కార్మిక క్షేత్రం సిరిసిల్ల టౌన్లలో. అటు తరువాత జిల్లా కేంద్రం కరీంనగర్ మీదుగా ఆ నడక ఆనాటి నిజాం రాజ్య రాజధాని హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కళాశాల దాకా సాగింది. నూనూగు మీసాల ప్రాయంలో భాగ్యనగరిలో అడుగుపెట్టిన ఆయన తుదిశ్వాస వరకు పట్నంలోనే నివసించారు. హైదరాబాద్‌తో ఆయనది దాదాపు ఆరున్నర దశాబ్దాల అనుబంధం. తన జన్మభూమి పల్లె హనుమాజీపేట, అమ్మమ్మ ఊరు లింగంపల్లిలను ‘ఋతుచక్రం’ కావ్యంలో ఎలా కవిత్వం చేశారో, ఆ కోవలోనే అనేక కవితల్లో, గేయాల్లో హైదరాబాద్‌ను చిత్రించారు సినారె.
హైదరాబాద్ మీద పాటంటే సినారె రాయాల్సిందే! ‘రింజిం రింజిం హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్’ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే! ఇదేకాక నాంపల్లి, గోల్కొండ లాంటి అనేక ప్రాంతాలను, వాటి వైవిధ్యాలను కూడా ఆయన పలు సినీగీతాల్లో ప్రస్తావించారు. ఒక్క హైదరాబాదే కాదు వరంగల్ మొదలు విజయవాడ వరకు, అనేక తెలంగాణ పల్లెలు, పట్టణాలు, వ్యక్తులు, ప్రాంతాల గురించి ఆయన పాటల్లో వినొచ్చు. ఈ కోవకే చెందుతుంది 1997లో వచ్చిన “అహో బ్రహ్మ ఒహో శిష్యా” కోసం రాసిన హైదరాబాద్ పాట. దీనిని శశిప్రీతమ్ స్వరకల్పన చేయగా, గాయకుడు గంగాధర్ ఆలపించారు. ఈ గీత పల్లవే హైదరాబాద్ ఆత్మను ఆవిష్కరిస్తుంది.
పల్లవి
ఇది హైదరాబాదు ఇది హైదరాబాదు ॥2॥
వివిధ సంస్కృతులు రెమ్మలు సాచి
వికసించిన పాదు ॥హైదరాబాదు॥
మరో భారత దేశంగా విభిన్న సంస్కృతులతో విలసిల్లుతున్న మహా నగరం హైదరాబాద్. మన రాజధానికి సొంతమైన ‘గంగా జమున తహజీబ్’నే కాదు, ప్రేమరూపమైన నగరాన్ని, తొలి చరిత్రను, నిన్నటి ఖ్యాతిని తెలిపే గీతం. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా తన నగరాన్ని స్థిరపరుస్తూ హైదరాబాద్ ‘చేపలతో నిండిన చెరువు’లా కావాలని దువా చేశారు. ఇవ్వాళ ఈ నగరం అలానే విలసిల్లింది, వికసించింది కూడా. దానిని తొలి చరణంలో గుర్తుచేస్తారు, తర్వాత చరిత్రను శ్లాఘిస్తారు సినారె.
చరణం
కులీ భాగమతి ప్రేమరూపమై
వెలసిన భాగ్యనగరం
రాణకెక్కిన తెలుగుజాతికి
రాజధానీ నగరం ॥హైదరాబాదు॥
చరిత్రలో శిరసెత్తి నిలిచె- ఈ
చార్మినారు నిర్మాణం- అది
సాలార్జంగ్ మ్యూజియం
అద్భుత కళానికేతనం
పరమాద్భుత కళానికేతనం ॥హైదరాబాదు॥
నిజానికి నా చిన్నప్పుడు హైదరాబాద్ ఆనగానే తొలుత గుర్తుకువచ్చేది చార్మినార్, గోల్కొండ కోటలు. పదిహేనేళ్ల వయసులో ఈ రెండిటినీ చూడాలని ఎర్రబస్సెక్కి గోల్కొండ చౌరస్తాకు వెళ్లిన అమాయకత్వం నాది. అంతగా నిలిచిపోయింది చార్మినార్ మన అందరి హృదయాల్లో. చరిత్రకు సాక్ష్యంగా తలెత్తుకుని నిలబడి తన నాలుగు చేతులతో ఇప్పటికీ లక్షల మందికి స్వాగతం పలుకుతున్న చార్మినార్ గురించి, ప్రపంచదేశాలకు ఇప్పటికీ ఆశ్చర్యంగా నిలిచిన సాలార్జంగ్ వస్తు ప్రదర్శనశాల గురించి తర్వాత చెబుతారు. ఇక గోల్కొండ ప్రస్తావన చేస్తూ… స్వతంత్ర మనస్తత్వం కలిగిన హైదరాబాద్‌ను చెప్పినతీరు ఈ గీతానికి మకుటమేకాదు, తెలంగాణ పౌరుషాన్ని కూడా చూపుతుంది. ఒకరికి తలవంచక తల ఎత్తుకు నిలిచిన తెలంగాణ పౌరుషాన్ని ‘మొగల్ ప్రభువుల కంటిమంట’గా అని చెప్పడం కింది చరణంలో చూడవచ్చు.
చరణం
మొఘల్ ప్రభువులకు కంటి మంటగా
రగిలిన గోలకొండ!
పటు శౌర్యానికి మతసహనానికి
రెపరెపలాడిన జెండా ॥హైదరాబాదు॥
తొలి నుంచి గోల్కొండ స్వతంత్రంగానే వర్ధిల్లింది. అందుకే ఢిల్లీ పాలకులకు కంటి మంట అయ్యింది. ఇంతకు మించి హైదరాబాద్ పాలకుల ఆత్మగౌరవం గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకు కారణాన్ని కూడా ‘పటు శౌర్యానికి’ ఆలవాలం అంటారు కవి. పైన పేర్కొన్నట్టు మత సహనానికి ‘అలాయి బలాయ్’గా నిలిచిన తీరు నుంచి నిన్నటి స్వరాష్ర్ట సాధన దాకా సాగిన క్రమానికి ఇంతకు మించిన తార్కాణం లేదు. హైదరాబాద్ కేవలం పౌరుషాలు, మొన్నటి చారిత్రక కట్టడాలకే కాదు నయన మనోహరంగా వెలుగుతున్న ‘నౌబత్ పహాడ్’ అదే బిర్లా మందిర్ అందాలకు నెలవుగా చెబుతారు కవి. ‘పాలరాళ్లపై ధవళకాంతి జలపాతం బిర్లా మందిర్’ అనడం సినారె కవితాత్మకతను చూడవచ్చు. ఒకవైపు మహా జలరాశి కాగా, మరోవైపు ఇది ధవళకాంతి జలపాతమట. భళే సినారె!
ప్రపంచంలోనే మానవ నిర్మిత మహా జలసాగరాల్లో హుస్సేన్ సాగర్ ఒకటి. కాకతీయులకు కొనసాగింపుగా తెలంగాణ నేల మీద ఆవిష్కృతమైన మహాద్భుతాల్లో ఇదీ ఒకటి. ట్యాంక్‌బండ్‌పై నిలిపిన విగ్రహాలపైన రెండు వరుసల పరిచయాన్ని రాసింది సినారె గారే! హైదరాబాద్ కవి మగ్దూం మొహియుద్దీన్ గురించి రాసిన పంక్తులు చూడండి… “ఆధునిక ఉర్దూ మహాకవి/ అభ్యుదయ భావ సముజ్జ్వల రవి”. చివరగా ఈ గీతంలో ప్రపంచంలోని ఏకశిలా విగ్రహాల్లో ఒకటిగా జీబ్రాల్టర్ రాక్‌పై నిలిచిన బుద్ధుడి గురించి, తన మిత్రుడు, హితుడు అయిన ఎన్టీయార్‌ను చెబుతూ ఈ గీతాన్ని ముగిస్తారు. ఆ మూర్తులకే శిరోభూషణం అల్లదిగో బుద్ద విగ్రహం అది నందమూరి తారకరాముని హృదయం చేసిన సంతకం ఈ పాటను సినారె సినిమా కోసం రాసినా… ఇది నిఖార్సైన హైదరాబాద్ మనసు గీతం.. ఆత్మ సంతకం.