ఖాళీ సమయం కుదిరితే.. ఇన్‌స్టాలో ఆమె! ఎఫ్బీలో అతను! ఆఫీస్ వేళలో.. ఎవరి బిజీ వారిది! వీకెండ్స్‌లో.. ఎవరి ఎంగేజ్మెంట్లు వారివి!! ఒకరినొకరు దెప్పి పొడుచుకోవడానికి తప్ప.. కలిసేదెప్పుడు? మనస్ఫూర్తిగా మాట్లాడుకునేదెన్నడు? టీవీ చానెల్స్ హోరులో సగమై, సామాజిక మాధ్యమాల దాడిలో కొట్టుకుపోతున్న ఆలూమగలకు.. సమయం అస్సలు అందుబాటులో ఉండటం లేదు! కాపురాన్ని చక్కదిద్దుకోవడానికీ టైమ్ చిక్కట్లేదు!! పతనమవుతున్న విలువలు.. సంసారాన్ని భారంగా మారుస్తుంటే.. విడిపోవడానికి సాకులు, సాక్ష్యాలు పోగు చేసుకుంటున్నారు. కానీ, కలిసి ఉండటానికి కారణాలు వెతుక్కోవడం లేదు. కాలాన్ని నిందిస్తున్నారే కానీ, కలకాలం కలిసి ఉంటామన్న పెళ్లినాటి ప్రమాణాన్ని విస్మరిస్తున్నారు. ఈనాటి జంటల ఒంటెత్తు పోకడకు విరుగుడు మంత్రం ఉపదేశిస్తున్నది ఈ ముదిమి జంట. సమయం చేసుకొని చదవండి.. సంయమనం అలవడుతుంది. మనసుతో అర్థం చేసుకోండి.. సంసారం సాగరం కాదన్న సత్యం తెలిసొస్తుంది.

రంగనాయకమ్మగారు నుదుట వెడల్పాటి కుంకుమతో, వెండి తీగల్లామెరిసే నెరసిన జుట్టుతో ముడివేసుకొని, తలనిండా పూలు తురుముకొని అమ్మవారులా ఉంది. ఎర్రటి తొమ్మిది గజాలచీర గోసి పోసీ కట్టుకుని, ఊయల బల్లమీద కూర్చుని, ఎదురుగా కూర్చున్న భర్త నర్సింహారావుకు తాంబూలం చుడుతున్నది. తమలపాకులో సున్నం రాసి, కాచుపొడి చల్లి… లవంగం చెక్కి, పుదీనా-వక్క పలుకులు వేసి తాంబూలం అందిస్తూ టీవీ చూస్తూ… ఏదో చానెల్ లో వార్తలు చూసి నివ్వెర పోతూ… భర్తతో ‘అటు చూడండి! ఎంత అఘాయిత్యమో? అయ్యో రామా ! ఇలా తయారయ్యారేమిటీ?’ అని ఆమె అంటుంటే.. ‘ఏం జరిగిందేమిటీ?’ అన్నారు నర్సింహా రావు.
టీవీలో ఒక వార్త మళ్లీ మళ్లీ చూపిస్తున్నారు. వివాహం చేసుకున్న జంట హానీమూన్‌కు వెళ్లిన మూడో రోజునే ఆ నూతన వధువు భర్తను చంపేసింది. అనేది సారాంశం…. మరో చానెల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ప్రోగ్రాం వస్తున్నది. అందులో భాగంగా యాంకర్ ఒక అమ్మాయికి కొంతమంది అబ్బాయిలను ఒక్కొక్కరినీ చూపిస్తూ ఎవరని ఆ అమ్మాయిని అడగడం, ఆ అమ్మాయి అతను తన భర్తే అని ఎనిమిది మందిని ఒప్పుకొని, వారినుంచి భరణం కోరుతుంటే… యాంకర్ ‘ఈయనెవరు?’ అని మరో వ్యక్తిని చూపించింది. ‘అతను నా ప్రియుడ’ని చెప్పి, ‘భర్త నుంచి భరణం రూపంలో డబ్బు వసూలు చేసి ప్రియుడికి సుఖంగా బతకడానికి ఇస్తాన’ని అంటున్నది. ఇది వింటే దిమ్మతిరిగిపోయింది రంగనాయకమ్మ దంపతులకు. అసలే వృద్ధులు, ఇలాంటివి జీర్ణించూకోలేని వారిద్దరి మనసు అతలాకుతలమైంది. ‘మన సమాజం ఎటు పోతోంది?’ అందామె. ‘ఔను!’ అని…బాధతో అన్నారాయన!

‘ఈ మధ్య కాలంలో వార్తా మాధ్యమాలను చూస్తున్నప్పుడు మనసును కలచివేసే సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. వివాహ బంధం పవిత్రతను మరచిపోయినట్లు అనిపించే కొన్ని ఘటనలు సామాజికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. నమ్మకంపై నిలబడాల్సిన సంబంధాలు అనుమానం, స్వార్థం, ఆకర్షణల వలయంలో చిక్కుకుని దారితప్పుతున్నాయ’ని ఆవేదన వ్యక్తం చేసింది రంగనాయకమ్మ.
‘ఇలా జరగడం.. ఇవి కేవలం వ్యక్తుల తప్పిదాలేనా? లేక మన సమాజంలో లోతుగా చోటుచేసుకుంటున్న విలువల సంక్షోభానికి సంకేతాలా?’ అనిపిస్తున్నదని పెదవి విరిచింది. ‘పెళ్లి అనేది రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు! అది విశ్వాసం, బాధ్యత, పరస్పర గౌరవం మీద నిలిచే ఒక వ్రతం లాంటిది. ఆధునిక జీవితపు వేగం, మాధ్యమాల ప్రభావం వల్ల విలువలు కునారిల్లిపోతున్నాయి. అవన్నీ అప్పటికప్పుడు ఏర్పడిన ఆకర్షణలుకాక పెళ్లికి ముందే ఏర్పడి ఉంటున్నాయి’ అంటూ భర్త వైపు చూసింది.
దానికి నర్సింహారావు బదులిస్తూ ‘ఔను! నీవన్నది నిజమే! మన కుటుంబ వ్యవస్థ చూసి ప్రపంచ దేశాలు మన భారత దేశం వైపు ఆశ్చర్యంగా చూస్తాయి. ఒకే భార్యతో భర్త మనలా 70 సంవత్సరాల కాపురాలు చేస్తారని వింతగా చెప్పుకుంటారు. విడిపోవడాలు తక్కువ… అలా ముందు ముందు కూడా చెప్పుకోవాలంటే, కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే మాత్రం పవిత్ర దాంపత్యం కుటుంబ సంస్కృతి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నద’న్నాడు. ఇంకా కొనసాగిస్తూ.. ‘ఎందుకంటే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు నాకు పదేపదే మనసులో కాలం మారిందా? విలువలు మారాయా? సోషల్ మీడియా ప్రభావంతోనో, సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో చూపిస్తున్నవే జీవన విధానాలా? తాత్కాలిక ఆకర్షణలు, శాశ్వత బంధాలతో పోటీ పడుతున్నాయా?’ అని అనిపిస్తున్నది.
‘అసలు దాంపత్యం అంటే ఏమిటి? (ఆధ్యాత్మిక దృష్టి)లో ఏడడుగులు అగ్నిహోత్రం చుట్టూ తిరిగి చేసిన బాసలు వాటి ఆంతర్యం ఏమిటనే తెలియడం లేదు, ముఖ్యంగా మనకు మొదటినుంచీ వస్తున్న వ్రతాల తాత్త్వికత అర్థంచేసుకోవడం లేదు, భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం లేదు, ఉపనిషత్తులు, పురాణాలలో దాంపత్య ఆదర్శాలు ఎలా ఉన్నాయో? తెలుసుకోరు (చదవరు). నైతిక విలువలు పిల్లలకు చెప్పరు. తల్లిదండ్రులకే తెలియని విలువలు పిల్లలకేం చేప్తారు? ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు సమాజంలో ఇతరులతో మాట్లాడే పద్ధతి నేర్పించరు. వాళ్లు పిల్లలతో ఆత్మీయ బంధం కొనసాగించరు. కథల ద్వారా విలువల బోధన చేయరు. అసలు కథలు చెప్పే తీరిక పెద్దలకు ఉండదు. వినే ఓపిక చిన్న వారికి ఉండదు. దాంతో అన్ని బంధాల మధ్య బీటలు వారుతున్నాయి. ముఖ్యంగా ఆలూమగలపై ఈ ప్రభావం ఎక్కువ పడుతున్నది’ అన్నారు నర్సింహారావు.

‘మరేం చేస్తే బంధాలు నిలుస్తాయంటారు?’ అని ప్రశ్నించింది రంగనాయకమ్మ. ‘ఏముందీ చక్కటి అవగాహనతో భార్యాభర్తలు ఎవరికివారే తమ సంసారాన్ని చక్కబెట్టుకునేందుకు మార్గాలు వెతుక్కోవాలి! శ్రుతి మించి రాగాన పడితే కుటుంబంలోని అటు పెద్దలు- ఇటు పెద్దలతో మాట్లాడి నచ్చజెప్పాలి. లేదా కుటుంబ సంక్షేమ శాఖ వారు దాంపత్య శిక్షణ శిబిరాలు నెలకొల్పి మానసిక విశ్లేషకులతో చెప్పించాలి! అలా వీలు లేకుంటే దేవాలయాల ద్వారా కుటుంబ సదస్సులు నిర్వహించాలి. స్త్రీ-పురుషుల బాధ్యతలు సమంగా నెరవేరుస్తున్నారా? లేదా? గమనించి మంచి మార్గం సూచించాలి. పరిధి దాటితే ఇలా కృత్రిమంగా అయినా సరే కాపురం సరిదిద్దాల్సిందే! కాలం మారిందని కాలాన్ని తిడుతూ కాదు, కాలంలోనే నిలబడి విలువలను కాపాడే మార్గం చూడాలి!’ అన్నారాయన.
‘ఎలాగండీ? నాకేమీ అర్థం కావడం లేదన్న’దామె! ‘ఐతే విను చెప్తాను’ అని సంసార సాగరాన్ని సులభంగా ఈదే మార్గాలు చెప్పసాగాడు నర్సింహారావు! ‘ఎక్కడో పుట్టిన అమ్మాయి, మరెక్కడో పెరిగిన అబ్బాయితో వివాహమై జీవిస్తున్నప్పుడు అభిప్రాయ భేదాలు సహజమే! కానీ, సహనం లేకపోతే చిన్న గొడవ ఇద్దరి మధ్యా అంతులేని అగాధాన్నే సృష్టిస్తుంది. ఆధునిక జీవనశైలిలో దాంపత్యం కలకాలం నిలవాలంటే ఆర్థిక వసతి కూడా సరిగ్గా చూసుకోవాలి. తమ ఆదాయమెంతో? తమకేం అత్యవసరాలో వాస్తవంగా ఆలోచించాలి. కాలం మారింది. మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత ఆర్థిక ఇబ్బందులు తగ్గినా కానీ, పురుషులు కూడా ఒత్తిడులతో జీవిస్తున్నారు. సాంకేతికత జీవితాలలో భాగమైంది. అందుకోసం అన్నీ అవసరమే అని భావిస్తున్నారు. ఇవి సమస్యలు కావు కొన్ని పరిష్కరించుకోవచ్చు!
సమస్య ఏమిటంటే.. జీవనంలో వేగం పెరిగింది, కానీ విలువల గురించి మాట్లాడుకోవడం తగ్గింది. భార్యాభర్తలు ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి (Intentional Time). మనం ఎన్నో విషయాలలో విదేశీ నాగరికతను అనుకరిస్తాం. మరి ఈ సమయం కేటాయించడంలో ఎందుకు అనుకరించమో? తెలియడంలేదు! ఆ..యా.. దేశాలలో ఫ్యామిలీ టైమ్ అని సాయంకాలాలు కొంతసేపు లివింగ్ రూంలో కూర్చుని మాట్లాడుకుంటారు. లేదా బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గరో, డిన్నర్ టైమ్‌లోనో.. సమయాన్ని కేటాయించుకుంటారు. ఆధునిక జీవనంలో పనులు ఎన్ని ఉన్నా… దాంపత్య సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి రోజులో కొంత సేపు కేటాయించుకుంటారు. ‘ఈ రోజు ఉదయం ఆఫీసుకు వెళ్లే తొందరలో ఏదో గట్టిగా మాట్లాడాను… నీ మనసు నొచ్చుకున్నదా?( కొందరైతే సారీ చెప్తారు). ఇప్పుడు ఎలా ఉన్నావు? లేదా ఇవాళ నీకు సంతోషం కలిగించిన విషయం ఏమిటి?’ ఇలా ఏదో ఒకటి మాట్లాడితే చిన్న సంభాషణ అయినా సరే చక్కగా సంబంధాన్ని బలపరుస్తాయి. అలా అని కృత్రిమంగా ఉండకూడదు! మనస్ఫూర్తిగా మాట్లాడాలి.
అలా మాట్లాడుతున్నప్పుడు చేతుల్లో మొబైల్ పట్టుకునో లేదా టీవీ చూస్తూనో ఉండొద్దు. వాటి దరిదాపుల్లో లేకుండా మాట్లాడుకోవాలి. ఆ మాటల్లో పారదర్శకత (Transparency) ఉండాలి. రహస్యాలుంటే బంధాన్ని దెబ్బతీస్తాయి. నిజమైన మాటలు బంధాన్ని నిలబెడతాయి. ఏదో మొక్కుబడిగా చెప్పే మాటలో, అబద్ధాలో చెబితే బంధాలు దారుణంగా దెబ్బతింటాయి. కుటుంబమంతా ఒకచోట చేరడానికి ఎందుకు సమయం కేటాయించడం అంటే ఈ సమయం సంబంధాలకు ఊపిరిలాంటిది. అయితే, పని ఒత్తిడులు, ఆర్థిక బాధ్యతలు, సామాజిక మాధ్యమాల ఆకర్షణలు మన దినచర్యను నింపేస్తున్నాయి. ఐతే ఈ వేగవంతమైన జీవితంలో దాంపత్యానికి ప్రత్యేకంగా సమయం కేటాయించ లేకపోతే బంధం యాంత్రికంగా మారుతుంది. భార్యాభర్తలు పక్కపక్కనే ఉన్నా మనసులు దూరమవుతాయి. అందుకే దాంపత్య జీవితానికి సమయం ఒక ఔషధం వంటిది. కానీ, ఖాళీ సమయాలలో మాట్లాడుకోవడం కాదు! ఆలూమగల మధ్య సంబంధం ముఖ్యమనుకొని తీసుకునే సమయం విలువైనది.
అంతేకాదు భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు పరస్పర గౌరవం చూపెట్టుకోవాలి. ఒకవేళ భర్త కన్నా భార్య పెద్ద ఉద్యోగం చేస్తున్నా, తనకు ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నా… అధికారం అనుకోవద్దు! భాగస్వామ్యం ముఖ్యం అనుకోవాలి భార్యాభర్తలో.. ఎవరూ ఎక్కువా కాదు, తక్కువ కాదని అనుకోవాలి. ఇద్దరూ చెరి సగం అని బలంగా అనుకోవాలి.
పూర్వకాలంలో ఆధ్యాత్మిక అనుసంధానంతో కలిసికట్టుగా జీవించేలా ఆచార- సంప్రదాయాలు ఉండేవి. వాటిని పాటించినా బంధాలు బలపడతాయి. వారంలో ఒక రోజు కలిసి పురాణ కాలక్షేపం? విలువైన సాహిత్య పఠనం? విలువలతో కూడిన సందేశాలు భార్యాభర్తలకు సంబంధించినవి ఉండేవి. లేదా ప్రార్థన లేదా కుటుంబమంతా కలసి ఉండాలనే ప్రబోధాలుండేవి. ధ్యానం చేసినా దాంపత్యానికి ఒక ఆత్మీయ బలం ఇస్తుంది. ఆ బలంతో అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆధారం ధైర్యాన్నిస్తుంది. మన ఇద్దరం కలసి ఈ ఆపదలు ఎదుర్కొంటామనే భావం ఏర్పడుతుంది.

ధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు కాదు ఓపిక, మన్నించడం, కృతజ్ఞత వంటి వాటిని ఆచరించడం. ఆధునిక జీవనశైలి మన చేతుల్లో ఉన్న సాధనం మాత్రమే. అది బంధాలను బలపరచడానికీ, బలహీనపరచడానికీ ఉపయోగపడవచ్చు. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఇలా పాటిస్తున్నారు. హాయిగా జీవిస్తున్నారు. వాటిని పాత చింతకాయ పచ్చడని కొట్టి పారేయనక్కరలేదు!
ఆధునికత మన జీవన శైలిని మార్చవచ్చు; కానీ నిబద్ధత, విశ్వాసం, గౌరవం వంటి మూల విలువలు కాలానుగుణంగా మారవు. అలా కాకపోతే.. పక్కపక్కనే నివసిస్తూ కూడా మనసులు దూరమవుతాయి. అందుకే దాంపత్యానికి సమయం ఒక ఔషధం లాంటిది. సమయం కేటాయించడం అనేది ఖాళీ సమయం దొరికితే కాదు; సంబంధం ముఖ్యమని భావించి తీసుకునే సమయం. దాంపత్య పవిత్రతను కాపాడుకోవడం అంటే కాలానికి వ్యతిరేకంగా నిలబడడం కాదు; కాలంతో పాటు నడుస్తూ విలువలను చైతన్యంగా కాపాడుకోవడమే!
కాలం మారుతున్నమాట నిజమే! కానీ విలువలు మన చేతుల్లోనే ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన ఇల్లు ఎప్పుడూ చెడిపోక కళకళలాడుతుంది. దాంపత్య పవిత్రతను కాపాడుకోవడం ఒక సిద్ధాంతం కాదు! ప్రతిరోజూ తీసుకునే చిన్నచిన్న నిర్ణయాల సమాహారం… ఆ నిర్ణయం ఈ క్షణం నుంచే మొదలు పెట్టవచ్చు!’ అని రంగనాయకమ్మ వంక లీలగా చూశాడు నర్సింహారావు. పతిదేవుడ్ని శెహబాష్ అన్నట్టుగా చూసింది రంగనాయకమ్మ. టీవీలో ‘పెళ్లి చేసుకొని.. ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్’ అన్న పాట వస్తున్నది. ఇద్దరూ వంటింట్లోకి దారితీశారు. తమ చక్కటి అనుబంధానికి గుర్తుగా చిక్కటి చాయ్ చేసుకొని.. మళ్లీ ముచ్చటిస్తూ, తేనీటిని పంచుకున్నారు!
– రంగరాజు పద్మజ, 99897 58144