ఫీల్డులో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. అడుగుపెడితే కిందపడతామని భయపడొద్దు. కొత్తదారిలో అడుగులు వేస్తే కచ్చితంగా గెలిచి వస్తాం అంటున్నాడు డాక్టర్ సుహాస్ బి శెట్టి. వేల బ్రాండ్లు ఉన్న ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీలో అవగాహనే లేకుండా అడుగుపెట్టాడు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌లను పరిచయం చేసి పెద్ద కంపెనీల కంటే పెద్ద క్రెడిట్ కొట్టేశాడు. ఒంటెపాలతో, గాడిద పాలతో ఐస్‌క్రీమ్ ప్రయోగాలు చేసి ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీ హిస్టరీలో నిలిచిపోయే ఆవిష్కరణలు చేశాడు. ఐస్ప్రెన్యూర్గా మారిన ఈ ఫార్మసిస్ట్ అవసరాలే అన్నీ నేర్పిస్తాయని చెబుతున్నాడు!
మాది వ్యాపార కుటుంబం. మాకు నెల్లూరులో వస్ర్తాల దుకాణం ఉంది. అన్నయ్య కూడా నాన్నతో కలిసి అదే బిజినెస్‌లోకి దిగాడు. నాకూ వ్యాపారం చేయాలని ఉన్నా.. ఏం చేయాలో క్లారిటీ లేదు. ఫార్మసీలో పీహెచ్డీ పూర్తయింది. వెంటనే బెంగళూరులో ఉద్యోగంలో చేరాను. ఆరు నెలలపాటు ఆ ఉద్యోగం చేశాను. ఏ కంపెనీలో చేరినా మూడు లక్షలకు తగ్గకుండా జీతం ఇస్తారు. కానీ, ఉద్యోగంలో సంతృప్తి లేదనిపించింది. వ్యాపారం చేయాలన్నది నా కోరిక.
ఉద్యోగం మానేస్తానని చెబితే.. ఇంట్లో వద్దనలేదు. బిజినెస్ చేయమని ప్రోత్సహించారు. అయితే, అనుభవం ఉన్న వస్త్ర వ్యాపారంలోకి రమ్మన్నారు. కానీ, నాకు ఫార్మసీలో అనుభవం ఉంది. అందులో బిజినెస్ ప్లాన్ చేద్దామంటే అంతగా ఆర్థిక వసతి లేదు. వేరే వ్యాపారాల మీద అవగాహన లేదు. అప్పుడు మా ఏరియాలో నడిచే వ్యాపారాల మీద ఓ కన్నేశాను. అప్పుడు ఐస్‌క్రీమ్ పార్లర్ ఆలోచన తట్టింది. ఫుడ్ బిజినెస్‌కు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఐస్‌క్రీమ్ వ్యాపారంలో వృథా తక్కువ. కాబట్టి నష్టాలూ తక్కువే. ఇందులో నా అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నాను. ఐస్‌క్రీమ్ వ్యాపారం చేస్తానంటే.. తెలియని రంగంలో పెట్టుబడి వద్దంటూ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. నా పోరు భరించలేక చివరికి మా నాన్న ‘ఈ మూడు లక్షల రూపాయలు పోయాయనుకుంటున్న’ అంటూ నా చేతిలో డబ్బులు పెట్టాడు.
అలా పదేండ్ల కిందట నెల్లూరులో ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్ ప్లార్లర్ ప్రారంభించాను. మాకంటూ ఏ ప్రత్యేకతా లేదు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నడిచే చిన్న పార్లర్ అది. సేల్స్ తప్ప తయారీ లేదు. ఐస్‌క్రీమ్‌లు బయట కొనుక్కొచ్చేవాళ్లం. ఏడాది తిరిగే సరికి నెల్లూరులో అలాంటిదే రెండో స్టోర్ ప్రారంభించాం. రెండేళ్ల తర్వాత… కొంతమంది ఫ్రాంచైజీ కావాలని వచ్చారు. ఫ్రాంచైజీ విధానం గురించి నాకప్పటికి అవగాహన లేదు. అదేంటో కనుక్కునే ప్రయత్నంలో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఈ క్రమంలో గుజరాత్ వెళ్లి అక్కడ ఐస్‌క్రీమ్ పరిశ్రమ నిర్వహణను దగ్గరగా పరిశీలించాను. ఆ అనుభవంతో ఐస్‌క్రీమ్ తయారీలోకి అడుగుపెట్టాను. అలాగే ‘ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్’ ట్రేడ్ మార్క్ తెచ్చుకున్నాను.
మూడు రకాల ఫ్లేవర్లతో తయారీ మొదలుపెట్టాను. ఈ బిజినెస్‌లో ప్రతిరోజూ ఆటుపోట్లే.. రావాల్సిన డబ్బులు రావు. ఇవ్వాల్సిన వాళ్లకు సమయానికి ఇవ్వలేం. కావాల్సిన సరుకులు సమయానికి దొరకవు. అర్ధరాత్రి దాకా ఇంటికి వెళ్లకుండా ఎన్నో రోజులు పనిచేశాను. నాలుగైదేండ్లు పోరాడాను. ఇప్పుడు మా ఫ్రాంచైజీ కోసం చుట్టుపక్కల వాళ్లే కాకుండా వేరే రాష్ర్టాల నుంచీ వస్తున్నారు. అలా ఓ పదిహేను స్టోర్లు అయ్యాయి. బిజినెస్ పెరిగింది. డబ్బులు సంపాదిస్తున్నాం. వ్యాపారంలో సంపాదించిన డబ్బును మళ్లీ వ్యాపారంలోనే పెట్టాను. అప్పులు చేసి ఆడంబరాలకు పోలేదు. ఏది చేసినా పెద్దగా చేయాలని అనుకోలేదు. చిన్నగా మొదలుపెడతాను. అందువల్ల ఎప్పుడూ నష్టపోలేదు. ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ పాపులర్ అయింది.
మార్కెట్లో ఐస్‌బర్గ్‌ని గుర్తుపట్టాలి. నా బ్రాండ్‌కు ప్రత్యేకత ఉండాలి. దానికోసం ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాను. ఆ సమయంలోనే గాడిదపాలు, ఒంటెపాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేయాలనే ఆలోచన తట్టింది. ఓసారి దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడ ఒంటెపాలతో తయారుచేసిన ఐస్‌క్రీమ్, చాక్లెట్లు తిన్నాను. అప్పటికే మేం మేకపాలతో ఐస్‌క్రీమ్ తయారుచేస్తున్నాం. గాడిదపాలు, ఒంటెపాలతో ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నాం. వెంటనే ఒంటెపాలతో ఐస్‌క్రీమ్ తయారీ మొదలుపెట్టాం. ఆ తర్వాత గాడిదపాలతో ఐస్‌క్రీమ్ తయారు చేశాం. రెండిటికీ మంచి ఆదరణ వచ్చింది. అయిదేండ్ల కిందట ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌ల తయారీలోకి అడుగుపెట్టాం. ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌లకు మంచి ఆదరణ ఉంది. మేం వాడే అన్ని రకాల ముడి పదార్థాలను పండించేవాళ్లు, తయారీదారులతో మాట్లాడి, అన్నిటినీ తనిఖీ చేసి తీసుకుంటాం. సొంతంగా ల్యాబొరేటరీ టెస్టులు చేసి తయారుచేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో మా ఐస్‌క్రీమ్ వ్యాపారం విస్తరించింది. దీనిని దేశమంతా విస్తరిస్తాం. భారత్‌లో టాప్‌టెన్ ఐస్‌క్రీమ్ బ్రాండ్స్‌లో మాది ఒకటిగా నిలవాలన్నది మా లక్ష్యం.
– నాగవర్ధన్ రాయల