టాలీవుడ్లో పోటీని తట్టుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తెలుగు భామ కోమలి ప్రసాద్. సినిమా, థియేటర్, ఓటీటీ.. ప్లాట్‌ఫామ్ ఏదైనా నటనకు ఎప్పుడూ ముందుంటుంది. తనకు సరిపోయే పాత్రలను ఎంచుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. 2016లోనే నటిగా కెరీర్ ప్రారంభించిన కోమలి ‘టచ్ మీ నాట్’ వెబ్ సిరీస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘హిట్ 3’ సినిమాతో మరో హిట్‌ని
ఖాతాలో వేసుకుంది. పెద్దపెద్ద విజయాలు కూడా చిన్న ప్రయత్నంతోనే మొదలవుతాయంటున్న కోమలి పంచుకున్న కబుర్లు…
2016లో ‘నేను సీతాదేవి‘ సినిమాతో నా సినిమా ప్రస్థానం మొదలైంది. అది చిన్నపాత్ర అయినా నటనలో మంచి అనుభవాన్ని ఇచ్చింది. ‘టచ్ మీ నాట్’ సిరీస్‌లో మేఘ పాత్రలో నటించాను. ఇది క్రైమ్ థ్రిల్లర్. నా పాత్ర కథలో కీలకం. సవాలుగా తీసుకొని చేశాను. బాగా చేశావని చాలామంది మెచ్చుకున్నారు.
నా బాల్యం చాలా సరదాగా గడిచింది. నేను విశాఖపట్నంలో పుట్టినా కర్ణాటకలోని బళ్లారిలో పెరిగాను. నేనేం చేసినా ఇంట్లో వాళ్లు మద్దతు ఇచ్చేవాళ్లు. చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. డ్యాన్స్ విపరీతంగా చేసేదాన్ని.
చిన్నప్పుడు డెంటిస్ట్ కావాలని అనుకునేదాన్ని. అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి బీడీఎస్ పూర్తిచేశాను. డెంటల్ సర్జన్‌గా కొంతకాలం పనిచేశాను కూడా. కానీ, నటనపై
నాకున్న ఆసక్తి సినిమాలవైపు తీసుకొచ్చింది.
నటిగా నన్ను నేను నిరూపించుకోవడమే నా లక్ష్యం. సినిమాలైనా, సిరీస్‌లైనా కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. సినిమాలకంటే వెబ్ సిరీస్‌లు ఎక్కువ సమయం తీసుకుంటాయి, కానీ లోతైన కథాంశాలను అందిస్తాయి. వెబ్ సిరీస్‌లలో పాత్రలను లోతుగా అన్వేషించే అవకాశం ఉంటుంది.
నాకు థ్రిల్లర్, డ్రామా జానర్లు ఇష్టం. ప్రేక్షకులను ఆలోచింపజేసే, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే కథలు ఇష్టం. చిన్నప్పుడు ఖో-ఖో, బ్యాడ్మింటన్ ఆటలు బాగా ఆడేదాన్ని. అమ్మమ్మ చెప్పే కథలు వినడం గొప్ప అనుభూతి. పుస్తకాలు బాగా చదువుతాను. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయంలో క్లాసికల్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను.
పులిహోర, రొయ్యల కూర చాలా ఇష్టం. స్వీట్స్‌లో బెంగాలీ రసగుల్లా అంటే పిచ్చి. రోజూ యోగా, కొన్ని కార్డియో వర్కవుట్స్ చేస్తాను. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవుతాను, కానీ ఒక్కోసారి చీట్ డే కూడా ఉంటుంది! ఆ రోజు నియమాలన్నీ బ్రేక్ చేసి నచ్చింది తినేస్తా!!
ఎమోషనల్, లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించాలని ఉంది. హిస్టారికల్ డ్రామా చేయాలనుంది. పెద్ద విజయాలు కూడా చిన్న ప్రయత్నాలతోనే మొదలవుతాయి, నమ్మకంతో కష్టపడితే కచ్చితంగా దానికి తగిన ఫలితం ఒకరోజు దక్కుతుంది అని నమ్ముతాను.
సంప్రదాయ, మోడ్రన్ ఫ్యాషన్ రెండూ ఇష్టమే. సందర్భాన్ని బట్టి సారీస్, వెస్ట్రన్ డ్రెసెస్ ఎంచుకుంటాను. కుటుంబం నా బలం. డాక్టర్‌గా కెరీర్ వదిలేసి సినిమాల్లోకి వస్తానంటే వాళ్లు ప్రోత్సహించారు. ‘రంగస్థలం’ సినిమా నా ఫేవరెట్. సాయిపల్లవి యాక్టింగ్ అంటే ఇష్టం.