సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలు రాణించలేరనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం తెలుగమ్మాయిలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి గౌరీ ప్రియ. ‘మ్యాడ్’ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ హైదరాబాదీ భామ ఇటీవల ‘చెన్నై లవ్‌స్టోరీ’ అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించింది. నటనే కాకుండా పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం కూడా తన అభిరుచులు అంటూ గౌరీ ప్రియ పంచుకున్న కబుర్లు..
నేను హైదరాబాద్‌లో పుట్టాను. నా బాల్యం కాకినాడ, హైదరాబాద్ నగరాల్లో గడిచింది. చిన్నప్పటి నుంచి చాలా ఆనందంగా, స్వేచ్ఛగా పెరిగాను. మా అమ్మానాన్న ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండేవారు. కాకినాడలోని శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజ్‌లో ఇంటర్, హైదరాబాద్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజ్‌లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తిచేశాను.
చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజ్ ఈవెంట్స్‌లో నాటకాలు, డ్యాన్స్‌లలో పాల్గొనేదాన్ని. అలా నాకు నటనపై ఆసక్తి పెరిగింది.‘బోల్ బేబీ బోల్’ సీజన్ 2లో రన్నరప్‌గా, సీజన్ 3లో విన్నర్‌గా నిలిచాను. ఆ ప్రోగ్రామ్ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.
సంగీతం నా జీవితంలో ఒక భాగం. ఒత్తిడిగా అనిపించినా, సంతోషంగా ఉన్నా సంగీతంతోనే సాంత్వన పొందుతాను. అలా సరదాగా పాడటం మొదలుపెట్టిన నేను సాక్షి ఎరీనా యూత్ సింగింగ్ కాంపిటిషన్లో విజేతగా నిలిచా.
మిస్ హైదరాబాద్ టైటిల్ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ‘మెయిల్’ వెబ్ సిరీస్ నా మొదటి పెద్ద బ్రేక్. ‘మ్యాడ్’ సినిమాలో అవకాశం రావడం నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. యూత్‌ఫుల్ ఎనర్జీ, హాస్యం కలగలిపిన పాత్ర అది. చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను.
హైదరాబాదీ బిర్యానీ, ఇటాలియన్ పాస్తా ఇష్టం. స్వీట్స్‌లో గులాబ్ జామూన్ అంటే పిచ్చి! రోజూ యోగా, జిమ్‌లో వర్కవుట్ చేస్తాను. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం నా రొటీన్లో భాగం. సింపుల్, ఎలిగెంట్ ఫ్యాషన్ అంటే ఇష్టం. సందర్భాన్ని బట్టి సంప్రదాయ, మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకుంటా.
కెరీర్ తొలినాళ్లలో జెమినీ టీవీలో యాంకర్‌గా పనిచేశా. యాంకరింగ్ చేయడం చాలా సరదాగా ఉండేది. కెమెరా ముందు బెరుకులేకుండా మాట్లాడటం, ప్రేక్షకులతో కనెక్ట్ అవడం అప్పటినుంచే అలవాటైంది. తర్వాత మోడలింగ్ కూడా చేశా. 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్నా.
నాకు కామెడీ, రొమాంటిక్ డ్రామాలు ఇష్టం. ప్రేక్షకులను నవ్వించడం, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడం అంత సులువైన పనేం కాదు. డ్యాన్స్, సంగీతం, ట్రావెలింగ్, బుక్స్ చదవడం చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడు కొత్త ప్రదేశాలు సందర్శిస్తా. కేరళ, హిమాచల్‌ప్రదేశ్ చాలా ఇష్టం. ప్రకృతి అందాలను గంటల తరబడి ఆస్వాదిస్తా.