దక్షిణాదిన వరుస సినిమాలతో రాణిస్తున్న తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్. ఓవైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. డీగ్లామర్ రోల్స్‌తో మంచి నటిగా పేరు తెచ్చుకుంటూనే గ్లామర్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ భామ ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ అంటూ మరోసారి టాలీవుడ్ అభిమానులను పలకరిస్తున్నది. హీరోయిన్‌గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఐశ్వర్య రాజేశ్ పంచుకున్న కబుర్లు ఇవి..
ఒకే తరహా పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎంచుకునే పాత్ర నాకేదైనా కొత్తది నేర్పించాలని ఆశిస్తాను. ఆ మేరకే నా పాత్రల ఎంపిక ఉంటుంది. గ్లామర్ రోల్స్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందం కన్నా నటన ముఖ్యమని నమ్ముతాను. కథ బాగుండాలి. కొత్త సందేశం ఇవ్వాలి. నేను ధరించే పాత్రకు తగిన ప్రాధాన్యం ఉండాలి. పాత్ర నిడివి తక్కువైనా ఫర్వాలేదు.. నటనకు స్కోప్ ఉండాలి.
నేను హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. చదువు పూర్తయ్యాక పెండ్లి చేసుకొని కుటుంబంతో హాయిగా సెటిల్ కావాలని భావించేదాన్ని. కానీ, జీవితంలో ఎదురైన అనుభవాలు నన్ను నటిగా మార్చాయి.
చిన్నప్పటి నుంచీ ఎవరైనా ‘నువ్వు చేయలేవని’ అంటే అది చేసి చూపించడం నా నైజం. అలాగే ఒకసారి ‘నువ్వు హీరోయిన్ అవడం ఏంటి?’ అని ఎవరో అన్నారు. దీంతో నేను హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నా.
ముగ్గురు అన్నయ్యల తర్వాత నేను పుట్టాను. నాన్న నన్ను చాలా గారాబం చేసేవారు. నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు ఆయన కన్నుమూశారు. నాన్నకు నేనంటే ప్రాణం. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన పేరుని నా పేరుతో కలిపి పెట్టుకున్నా.
మేంఉండేది చెన్నైలో అయినా నేను పక్కా తెలుగమ్మాయినే. ఇంట్లో అచ్చ తెలుగులో మాట్లాడుకుంటాం. మా ఆహారపు అలవాట్లు, కట్టూబొట్టూ వ్యవహారం అన్నిటా తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇప్పుడిప్పుడే తెలుగమ్మాయినని నమ్ముతున్నారు. తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి.
‘రాంబంటు’ సినిమాలో బాలనటిగా నా కెరీర్ ప్రారంభమైంది. నేను అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిన ప్రతి పాత్రని చాలెంజ్‌గా తీసుకుంటా. కెరీర్ ఆరంభంలోనే తల్లి పాత్రల్లో చేసేందుకు వెనకాడలేదు. కథ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతా.
సమాజంపై సినిమా ప్రభావం ఎంతగానో ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు ఏదో ఒక పాయింట్‌కు బలంగా కనెక్ట్ అవుతారు. అలాంటి బలమైన సినిమా మాధ్యమం నుంచి సమాజానికి అవసరమైన విషయాన్ని వివరించడం సులభం అవుతుంది. అది ఎంతో ప్రయోజనకరం కూడా!