‘సేను బాయె.. సెలక బాయె..పండుగ పబ్బాలు బాయె.. ఊట బాయె.. మోట బాయె.. కొలువు బాయె.. బతుకు బాయె.. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజన ఓ రాజన.. తెలంగాణ ఆగమాయె రాజన ఓ రాజన’ అంటూ పాడుకుంట ఏడ్వని పల్లె లేదు పాతికేండ్లకు ముందు. వలసపోయిన బిడ్డల కోసం పొక్కిలైన వాకిళ్లలో కాటికి కాళ్లుజాపుకొని ఎదురుచూస్తున్న తల్లులకు ‘ఎట్లున్నవే నా పల్లె’ అనే పలుకరింపు పాట వినబడ్డది.
‘పాడుదాం తెలంగాణ పాట పాడుదాం.. ప్రజల కొరకు గజ్జె కట్టి ఆటలాడుదాం’ అంటూ కైగట్టి పాడేటి పాటగాళ్లని, ఆడేటోళ్లని బిడ్డ లెక్క సాదుకుంది తెలంగాణ పల్లె తల్లి. ‘మా ఆకలి కేకలే తెలంగాణ పిలుపులై.. రాష్ట్రమొచ్చె దాక ఇక ఆగవు పొలికేకలే’ అంటున్న పాటకు బువ్వ పెట్టి హారతి పట్టింది. ‘అసోయ్ దూల హారతి కాళ్ల గజ్జెల గమ్మతి.. తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి’ అనుకుంట సాగిన పోరాటం పల్లెపల్లెనా కండ్లవడ్డది. కేసీఆర్ రాక.. తెలంగాణ కాక.. ఇగ పాట ఊపందుకుంది.
‘ఎనకముందు జూసుడేంది రాజన ఓ రాజన.. ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన’ అంటూ పాట ధిక్కారమై ప్రతిధ్వనించింది. ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా’ అంటూ నిలదీసి అడిగింది. ‘వెయ్ రా తెలంగాణ దరువెయ్రా’ అంటూ దండుకట్టనీకి దండోరా వేసింది.
‘వీరులారా వందనం’, ‘పుడితొక్కటి, చస్తె రెండు.. రాజన ఓ రాజన’ ఇలా ఒకటి రెండు కాదు.. వందలు వేల పాటలు.. తెలంగాణ వచ్చేదాక పోరాటంతో జత కట్టినయి! తెలంగాణ కోసమే పుట్టిన పార్టీకి పాతికేండ్లయిన సందర్భంగా ఆనాటి పాటని, ఆటనీ మల్లా తల్సుకుందాం!
పాటలతో మమేకమై బతికిన నేల తెలంగాణ. వందల సంవత్సరాల క్రితమే తెలంగాణలో తుమ్మెద పదాలు, వలలో, ఉయ్యాల, ఎన్నీయల్లో, సందమామయ్యలు అని జనం పదాలు కైగట్టుకొని పాడుకున్నరు. దుఃఖమో, సంబురమో, సావో, పుట్టుకో, పండుగో, పబ్బమో.. అది ఏదన్న గాని పాట ఉండాలె. ప్రపంచ పోరాటాల చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్న తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బాంచెన్ బతుకుల్ని పాట పోరాటంలోకి నడిపించింది.
ఆనాటి వెట్టికి వ్యతిరేకంగా సుద్దాల హనుమంతు..“పల్లెటూరి పిల్లగాడా” పాటగట్టిండు. బండి యాదగిరి “బండెనుక బండిగట్టి”తో ‘బాంచెన్ దొర’ అంటూ బతికే జనాన్ని ఎర్రదండులోకి నడిపించిండు. చివరికి నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. సైనిక, పౌర ప్రభుత్వాల ఏర్పాటు అనంతరం ఫజల్ అలీ కమిషన్ నివేదికను లెక్కచేయకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణని సీమాంధ్రతో కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. నవంబర్ 1 చరిత్రలో తెలంగాణ విద్రోహ దినంగా మిగిలిపోయింది. తొలి తెలంగాణ ఉద్యమానికి ఏడాది ముందే “తెలంగాణ పల్లె పాటలు” అనే సంకలనం వచ్చింది. ఆ తర్వాత నీలగిరి పాటలు, సాయుధ పోరాట పాటలు, చెరబండరాజు పాటలు ఊరూరా ప్రతిధ్వనించినయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలన్నీ సీమాంధ్రకు తరలిపోతుంటే తెలంగాణలో ఆధిపత్యంపై ధిక్కార అలలు ఎగిసిపడుతున్నయి. సమస్త రంగాల్లో సీమాంధ్రుల ఆధిపత్యం నడుస్తున్న కాలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకటరామారావు రాసిన ‘కదనాన శత్రువుల కుత్తుకలనవలీల” పాట తెలంగాణ ఆత్మగౌరవాన్ని పతాక స్థాయిలో నిలబెట్టింది. ఇదే కోవలో డా॥ఎస్వీ సత్యనారాయణ “ఇది నా తెలంగాణ సంజీవ దీవిరా / ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా” అంటూ ఈ నేల స్వభావాన్ని వైభవోపేతంగా మలిచిండు. ఈ ఆత్మగౌరవం, తెగువ తెలంగాణ యువతలో నూతనోత్తేజాన్ని రగిలించాయి.
కదనాన శత్రువుల కుత్తుకల నవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి
ధీరులకు మొగసాలరా!
తెలగాణ వీరులకు కాణాచిరా!
పాట: కదనాన శత్రువుల
రచన: రావెళ్ల వెంకట రామారావు
ఆ ఉత్తేజం ఉద్యమమై స్వరాష్ట్ర సాధన కదనంలో కదం తొక్కింది. మేర మల్లేశం, అనుముల శ్రీహరి మొదలైన వాళ్లెందరో ఆనాటి ఉద్యమానికి పాటలు, కవిత్వాన్ని ఆయుధాలుగా అందించే ప్రయత్నాలు చేసిండ్రు. “ఇందిరమ్మ ఎందుకు? / ఇల్లలికేటందుకు!” వంటి నినాదాలతో తీవ్ర నిరసనల హోరెత్తించిండ్రు. పల్లెల్ని పాటలు ప్రభావితం చేసినయి. ఏదో ఓ రూపంలో ప్రభుత్వాల మీద తిరగబడేటట్టు చేసినయి. ఉద్యమం రక్తసిక్తమైంది. ఎందరో బిడ్డలు తెలంగాణ తల్లి విముక్తి కోసం నెత్తురు ధారపోసినా రాజకీయ నేతల ద్రోహంతో చల్లారిపోయింది.
తెలంగాణ ఉద్యమం నిద్రాణస్థితిలోకి జారిపోయింది. రాజకీయ పార్టీలు తెలంగాణ నినాదాన్ని వదిలేసినా, ఉద్యమం ఆగిపోయినా కవులు, గాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూనే వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నీరుగార్చిన చెన్నారెడ్డికి నిరసనగా ముచ్చర్ల సత్యనారాయణ ఎన్నో వ్యంగ్య పదాలను కుప్పబోసిండు. “రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి / ఇగనైన రావేమి వెర్రి చెన్నారెడ్డి” అంటూ ఉద్యమం నీరు గార్చిన తీరు చెప్పుకొచ్చి తెలంగాణ ఆకాంక్షను కాపాడే ప్రయత్నం చేసిండు.
తెలంగాణ భాష, యాస, బతుకు, మెతుకు మీద సీమాంధ్ర ప్రాంత పాలకుల తీరు మారింది. వివక్ష పెరిగింది. ‘తెలంగాణ’ పదమే నిషేధమైంది. కరువు, నిరుద్యోగం, దోపిడీ తెలంగాణ యువతను నక్సలిజం వైపు నడిపించినయి. నిత్య నిర్బంధాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో తెలంగాణ అల్లకల్లోలమైంది. అట్లున్న తెలంగాణలో.. 90వ దశకంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నయి. సాహిత్యంలో మార్పులొచ్చినయి. ప్రపంచీకరణలో కార్పొరేట్ దోపిడీలో వాటాలు కుదిరిన సీమాంధ్ర పెత్తందారులకు తెలంగాణ పెద్ద వనరు అయింది. నీళ్లు, నిధులు దోచుకున్న సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి విలువైన భూమి కూడా పోసాగింది. ప్రాజెక్టులు కట్టక, భూములు పండక ఊర్లకు ఊర్లు వలసబాట పట్టినయి.
వలస బతుకు వెతల్ని మిత్ర రాసిన “పల్లే పల్లెన పల్లేర్లు మొలిసే / పాలమూరులోన మన తెలంగాణలోన / పాతగోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి / ఇండ్లు దుమ్ము రేగినాయి” అంటూ మొత్తం తెలంగాణ వలస దుఃఖాన్ని వలపోసిన తీరు ఎంత చెప్పినా తక్కువే. వలస దుఃఖాన్నే కాదు కొట్లాడి ఆ వెతల నుంచి విముక్తిని వెతుక్కున్నడు కోదారి శ్రీనివాస్. కేసీఆర్ ప్రసంగాల్లో ‘మన బతుకు అయితే బొగ్గుబాయి.. లేకుంటే బొంబాయి’ ఆవేదనతోని చెబుతుండే. కోదారి శ్రీనివాస్ రాసిన పాటల్లో కేసీఆర్ ప్రసంగాల్లోని పలుకుబడులు వినిపిస్తయి. “ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మా / ఇల్లు పైలం జూడు తల్లి మాయమ్మ/ బతుకు దెరువు లేక అమ్మ మాయమ్మా/ బొంబాయి బోతున్న తల్లి మాయమ్మా”లో కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటమని పాట ముగించిండు. ఈ పాట తెలంగాణ ధూంధాం వేదికల మీద ఓ దృశ్యకావ్యం!
పారేటి నీల్లల్ల పానాదులల్ల
పూసేటి పూవుల పూనాసలల్లా
కొంగు సాపిన నేల నా తెలంగాణ…
పాలుతాపిన తల్లి నా తెలంగాణ ..
పాట: నాగేటి సాల్లల్ల నా తెలంగాణ
రచన: నందిని సిధారెడ్డి
విప్లవ పార్టీలపై నిర్బంధం పెరిగింది. ఉద్యమం మైదాన గ్రామాలను విడిచిపెట్టింది. ఆ రాజకీయ చైతన్యంతో ఉన్న కవులు, గాయకులు దగాపడ్డ తెలంగాణకు గుండెనిచ్చిండ్రు. తెలంగాణ దుఃఖాన్ని గొంతెత్తిపాడిండ్రు. “దగాపడ్డ నా తెలంగాణము గుండెచప్పుడినుడో” అంటూ గద్దర్ పాటతో తెలంగాణ బిడ్డలు చిన్నగ గొంతెత్తిండ్రు. “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” అంటూ తెలంగాణ పాటందుకున్నడు. “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమై” సాగిపోయిండు. “తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో / తడిగొంతులారిపాయె తుమ్మెదాలో” అంటూ బెల్లి లలిత పాడిన పాట నాటి సీమాంధ్ర ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. మరోసారి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన వలసాంధ్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడింది.
పాట మీద తుపాకులు ఎక్కుపెట్టింది. తూటాలు పేల్చింది. పాటను ఖండ ఖండాలు చేసింది. అయినా ప్రజాకవులు మొక్కవోని ధైర్యంతో నిలబడ్డరు. పాటై ఉవ్వెత్తున ఎగిసిపడ్డరు. త్యాగాల తెలంగాణను భుజానికెత్తుకుండ్రు. ‘ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రాణాలైనా అర్పిద్దాం’ అని కవిగాయకులు యుద్ధానికి సిద్ధమై కదం తొక్కిండ్రు. విప్లవోద్యమం నుంచి తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలోకి పాటై ప్రవహించిన జయరాజు “బతుకమ్మను బతుకలేనమ్మను / తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను” అంటూ తెలంగాణ దుఃఖాన్ని అక్షరీకరించిన తీరు నాటి దుస్థితికి అద్దం పట్టింది. “నెత్తురువారందెన్నడో నా తెలంగాణ పల్లెలో/ నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో” అంటూ సమైక్యవాద కుట్రల్ని తేల్చి పారేసిండు.
తెలంగాణ సంపదను సర్వం దోచుకపోయినంక “ఇంకేమి మిగిలిందిరా? / తెలంగాణ.. జిల్లేడు మొలిసిందిరా!” అంటూ దోపిడీ తీవ్రతను, కరువుగోసకు ముడిపెట్టి చెప్పిండు. విప్లవోద్యమ గీతాలకు ప్రాణమైన యోచన తెలంగాణ ఉద్యమంలో “రాలేదు స్వాతంత్య్రము / తెలంగాణది అర్ధ స్వాతంత్య్రము” అంటూ ఉద్యమ పదాలను పదునెక్కిస్తడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి రాసిన పాట యోచనకు ఎంతో పేరు తెచ్చింది. ఇంకా దరువు అంజన్న, బుర్ర సతీష్, మానుకోట ప్రసాద్, జలజ తదితర రచయితలు, గాయకులు ఇంకా ఎందరో… తెలంగాణ ఉద్యమంలో శక్తివంచన లేకుండా పనిచేసిన సందర్భాన్ని మరువలేం. “గోదారి గోదారి ఓహో పారేటి గోదారి / సుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి’ అంటూ నీళ్ల దోపిడీని అరుణోదయ యశ్పాల్ చెప్పుకొన్నడు. అప్పటిదాంక విప్లవోద్యమ నేపథ్యం ఉన్న కవి గాయకులు గూడ అంజయ్య, మిత్ర, దయా నర్సింగ్ వంటి కవులెందరో తెలం‘గానం’ ఎత్తుకున్నరు.
విప్లవ పథంలో పయనించిన విమలక్క తెలంగాణ ప్రతక్ష్య ఉద్యమంలోకి తనదైన లక్ష్యంతో అడుగేసింది. “ఆడుదాం డప్పుల్లా దరువెయ్రా/ పల్లె తెలంగాణ పాటబాడరా” అంటూ మిత్ర రాసిన పాటను భుజానేసుకొని తానే ఓ తెలంగాణ ఉద్యమశక్తిగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో గిద్దె రామనర్సయ్య, దరువు ఎల్లన్న, సాయిచంద్ వంటి విప్లవ పథంలోని కవులెందరో తెలంగాణ పాటల బాటపట్టిండ్రు. “యాడున్నరో వీరులు / ఎర్రెర్రదారుల్లో”అంటూ విప్లవోద్యమ భావజాలంతో మొదలైన కొమిరె వెంకన్న “అమ్మా సూడమ్మ బైలెల్లినాదో గోదారమ్మ / గంగమ్మ తల్లయ్ బైలెల్లినాదో గోదారమ్మ” అంటూ గోదావరి నదీజలాల పాటైండు. “పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా” అంటూ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండు. “ప్రజల కొరకు పాటుపడే కళాకారులం/ పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం” అంటూ విప్లవ బాటలో మొదలై “ఉన్నాది మా ఊరు పేరుకు/ ఆడ బతుకుదెరువు లేదు పల్లెకూ” అంటూ దుఃఖగీతమై తెలంగాణ ఉద్యమ దారిలో అడుగుపెట్టిండు.
ఓరుగల్లుకు పేరు పెట్టినరా?
వేయి స్తంభాల గుడి మీరు గట్టినరా?
మెదక్ చర్చి మీరు గట్టినరా?
మక్కా మసీదు పునాది తీసినరా?
పాట: అయ్యోనివా నీవు అవ్వోనివా
రచన: గూడ అంజన్న
బందారం రైతుబిడ్డ నందిని సిధారెడ్డి. “నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ / నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ” అంటూ తెలంగాణ జీవన సౌందర్యాన్ని, సాంస్కృతిక జీవనాన్ని వర్ణించిన తీరు ఎందరినో కదిలించింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటే పాటలకు ఈ పాట ఓ ప్రేరణ! “పచ్చని మా పల్లెటూరు పాడిపంటల సెలయేరు” ఈ పాట కన్నీరు బెట్టిస్తది. రచయిత ఎవరో కూడా తెలియని ఎన్నో పాటలు ఉద్యమానికి ఊపిరిపోసినయి. గోరటి వెంకన్న పాటకు రేలపూతల సొగసుంటది. రెల్లుగడ్డి ఊగినట్టుంటది. దుందుభి నది ఎగిరి దునికినట్టుంటది. “సంచారమె ఎంతో బాగున్నది దీనంత ఆనందమేదున్నది” అనుకున్న గోరటి వెంకన్న తెలంగాణ ఉద్యమమై ప్రవహించిండు.
కన్నీరుబెడుతున్న పల్లెని చూసి కుమిలిపోయిండు. చెట్టుకు, పుట్టకు చెప్పుకొని దుఃఖ గీతమైండు. ఎండిన వాగును జూశి “ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా” అంటూ తెలంగాణ యుద్ధానికి తెరదీసిండు. “గానమా నా ప్రాణమా తెలంగాణమ జనగానమా” అంటూ తెలంగాణ అంతా కలెదిరిగిండు. మాదరబోయిన సత్తయ్య రాసిన “తెలంగాణ తెలంగాణ ఎల్లన్నారో మల్లన్నారో / తెలంగాణకు జరిగే మోసం జూడు ఎల్లన్నారో” అంటూ తెలంగాణను జాగృతం చేసిండు. గోదావరి గొంతుక మల్లావఝల సదాశివుడు రాసిన “తలాపునా పారుతుంది గోదారి నీ చేను నీ చెలకా ఎడారి” అంటూ నీళ్ల దోపిడి ఎట్ల సాగిందో, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో చెప్పుకొచ్చిండు. కరువుకు కారణాలు చూపిచ్చిండు.
“కొమ్మలల్ల కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది” అంటూ తెలంగాణ ఉద్యమంలోకి పశుపక్ష్యాదులు సైతం వాలిపోయినయనే సందేశంతో గిద్దె రామనర్సయ్య అద్భుతమైన పదాలు అల్లిండు. ఎన్నో జానపద, సామాజిక పాటలు రాసిన నేర్నాల కిషోర్ తెలంగాణ ఉద్యమం కోసం అలుపు లేకుండా పోరాడిండు. “పొడిసేటి పొద్దోలె ఎలమంద/ పోరుదారెంట బోతండె ఎలమంద” అంటూ తెలంగాణ జెండబట్టి పల్లెపల్లె ప్రజాగానమైనడు. ఉద్యమానికి ఊపిరైనడు. కరువులు, వలసలతో అల్లాడిపోతున్న పల్లెను చూసి “ఎట్లున్నవే నా పల్లే నువ్వు ఎట్లున్నవే నా తల్లీ” అంటూ తనకు దూరమైన పల్లెతల్లి కోసం దేవులాడిండు. పల్లెలోని ప్రతి గడపను పలకరించిండు.
“ఊరు తెలంగాణ/ నా పేరు తెలంగాణ” అంటూ అందెశ్రీ తెలంగాణ తిరిగిండు. “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అనే జాతి గీతమైండు. కామారెడ్డి ధూంధాం మొదలు రాష్ర్టం సిద్ధించేదాక శబ్దమై సుట్టుకొచ్చిండు. జనజాతరలో తన గీతాన్ని జయకేతనంగా ఎగరేసిండు. “నా చిట్టీచేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో” అన్న చింతల యాదగిరి ఒక రకంగా తాను అనుభవించిన జీవితాన్ని కైగట్టిండు. తెలంగాణ ఉద్యమంలో “వలసెల్లిపోయింది ఊరు/ నేడు వల్లకాడయ్యింది సూడు” అని అంటూ మన గోసను అక్షరీకరించిండు. నాటి సమైక్యపాలనలో ఆగమైన తెలంగాణ జన జీవితాన్ని చింతల యాదగిరి తన పదాలతో కండ్లకు కట్టిండు.
గుండమల్ల శ్రీనివాస్ రాసిన “గూడు నిడిసినం మా గుడిసెనిడిసినం/ పల్లేనిడిసినం కన్నతల్లీనిడిసినం” అంటూ శోకాన్ని ఆలపించిండు. చెమ్మగిల్లిన కండ్లతో “అమ్మా ఓ తెలంగాణమా కన్నీరేలనమ్మా” అన్నడు. సుందిళ్ల రాజన్నది ఒక ప్రత్యేకమైన శైలి. హిందీ, ఉర్దూ పదాలు కలెగలిసిన పాటలు చానా ఉన్నయి. ఆయన రాసిన “తెలంగాణ అచ్చేదాక తెగించి కొట్లాడుడే/ జమాంచి జంగుకురుకుడే/ లగాంచి లడాయ్జేసుడే” అనే పాట పద్మావతి గొంతులో ప్రాణం పోసుకుంది. ఆ పాట ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది. రాజకీయ, సామాజిక చైతన్య గేయాలు రాసిన పొలిశెట్టి లింగన్న “కాసెలుబోసి కత్తులు దూసిన తెలంగాణము” అంటూ తెలంగాణ ఉద్యమ గీతం అందుకున్నడు. “ఎన్నాళ్లింక ఆరని కన్నీళ్లు ఓ చెల్లెమ్మా” అనే పాటతో మహిళాశక్తిని తట్టిలేపిండు.
“లొల్లీ లొల్లీ లొల్లీ బుట్టే/ తెలంగాణ లొల్లీ బుట్టే/ ఊరువాడ లొల్లీబుట్టే/ పట్నములా లొల్లీ బుట్టే” అంటూ ముక్క కరుణాకర్ రాసిన పాట ఉద్యమం తొలినాళ్లలో ఒక ఊపు తెచ్చింది. నిర్బంధ కాలంలో నడిసొచ్చిన కేసీఆర్‌తో తెలంగాణ ఉద్యమానికే కాదు ఇలాంటి పాటలకూ కలిసొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. కేసీఆర్ సారథ్యంలోని ఉద్యమపార్టీ గాయకుల వేదికైంది. పాటను స్వేచ్ఛగా, నిర్భయంగా పాడుకునే అవకాశమొచ్చింది. అప్పటి దాంక ప్రజా సంఘాలతోని నడిచిన తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ రాకతోని కాకందుకున్నది.
రాజకీయ పార్టీ సారథ్యం తెలంగాణ పోరాటానికి ఊపుతెచ్చింది. ఆ ఊపులో తెలంగాణ పాట మారింది. “తెగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా” అంటూ ఇగ తెలంగాణకు ఆంధ్రకు పొత్తు కలవదనే కోణంలో వరంగల్ శ్రీనివాస్ రాసిన పాటలోని అక్షరాలు తెలంగాణ ఆకాంక్షకు అద్దం పట్టినయి. ఈ పార్టీ సభలు, ప్రజాసంఘాల సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తుంటే సీమాంధ్ర ప్రభుత్వం ఒకడుగు వెనక్కి తగ్గక తప్పలే. అప్పటిసంది పత్రికల్లో పాటలు పతాక శీర్షికలయినయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సభలను పాటలు ఉర్రూతలూగించినయి. అప్పటిదాంక తెలంగాణ బతుకు గోసనే పాడుకున్న తెలంగాణ పాట కేసీఆర్ రాకతో ‘అందుకోర గుతుపందుకో ఈ దొంగల తరిమేటందుకై’ అంటూ గర్జించింది.
“అమ్మోనివా.. నువ్వు అయ్యోనివా/ తెలంగాణోనికి తోటి పాలోనివా” గూడ అంజన్న సమైక్యవాదుల్ని ప్రశ్నించిండు. “పుడితొక్కటి సత్తెరెండు రాజన ఓ రాజన / ఎత్తుకొ తెలంగాణ జెండా రాజన ఓ రాజనా”, “గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో రాజన్నా” అంటూ రసమయి జనం గొంతులో రాగమైండు. తెలంగాణ ప్రజా ఉద్యమానికి ప్రాణమైండు. “ఎందక జూద్దామురో ఎల్లన్నోరి మల్లన్నా/ ఇగ ఎగబడదామురో ఎల్లన్నోరి మల్లన్నా” అంటూ
ఉద్యమాన్ని ఉధృతం జేసిండు. “తరగనీ సంపదున్నా నా తెలంగాణ/ నిరుపేద నీవైతివో నా తెలంగాణ/ వలసవాదుల చేతిలో నా తెలంగాణ/ అరిగోస బడుతున్నవో నా తెలంగాణ” అంటూ మాట్ల తిరుపతి రాసిన పాట ఎందరినో కదిలించింది. “తెలంగాణ ముద్దుబిడ్డల్లార తేరుకోరేందిరో/ తల్లి తెలంగాణ భంగపడుతుంటే బాధ లేదేందిరో” అంటూ గుడిపల్లి రవి ఆర్తితో, ఆక్రోశంతో గానం చేసిండు. తెలంగాణ చైతన్యాన్ని, అమాయకత్వాన్ని, త్యాగాన్ని గానం చేసిన భిక్షపతి పాట “తెలంగాణ పల్లేలల్ల లొల్లి లేసెరా/ వలసవాదులకు ఒళ్లు జల్లుమనేరా” అంటూ ఉద్యమ వాస్తవికతను ఎలుగెత్తి చాటిండు. తానో పాటై, అసహాయుల ఆయుధమైండు.
“అన్నా చెల్లెలి అనుబంధం/ జన్మజన్మలా సంబంధం” వంటి హిట్ పాటలతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉన్న కవి అభినయ శ్రీనివాస్. పాటల్లోనే కాదు ఆచరణలోనూ అనుబంధాలను వదులుకోని కవి తెలంగాణ తమ్ముళ్ల త్యాగాలకు చలించి ఉద్యమ పాటల్లిండు. “ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా/ వీర తెలంగాణమా/ వీర తెలంగాణమా నాలుగుకోట్ల ప్రాణమా” అంటూ పది జిల్లాలకు తెలంగాణ ఉద్యమ ఊపందించిండు. తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసిండు. భావానికి తగ్గ బాణీని ఎన్నుకొని తనదైన శైలిలో పాట రాయడం మిట్టపల్లి సురేందర్ ప్రత్యేకత. ఈయన రాసిన “రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా/ రక్త బంధం విలువ నీకు తెలియదురా” పాట గుండెల్ని పిండేసింది. మిట్టపల్లికి నంది అవార్డు తెచ్చి పెట్టిన ఈ పాట సాయిచంద్‌ను అద్భుతమైన గాయకుడిగా నిలబెట్టింది. “ఓ యుద్ధం బుడితే ఓయు నిలువుటద్దం బట్టెరా” అంటూ యుద్ధభూమిని తలపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉద్యమ పదాలతో అల్లుకున్నడు.
“వీరుల్లారా వీర వనితల్లారా/ అమ్మ రుణముకై రణములొరిగినారా” అంటూ తెలంగాణ ధూంధాం వేదికల జోలపాడి ఉయ్యాలలూపిండ్రు. విద్యార్థుల బలిదానాలను చూసిన విమలక్క “ఎందుకు కాలిపోతవు/ నీవెందుకు రాలిపోతవు” తన ఆటపాటకు తానే అక్షరాలను పొదువుకున్నది. ఆశువుగా కైగట్టి ఆర్ద్రంగా ఆలపించింది. తెలంగాణ రాష్ర్ట సాధనకు కారణమైన అంశాలేమిటో, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలేమిటో, తెలంగాణ ఆకాంక్షలేమిటో, ఆలోచనలేమిటో కేసీఆర్‌కు తెలిసినంతగా మరొకరికి తెలిసే అవకాశం లేదు. పద్నాలుగేండ్లు సుదీర్ఘ పోరాటంలో పాటే ఆయుధంగా అడుగేసిండు.
పాటలకు పదాలను అందించిండు. ఆఖరికి “గారడి జేస్తుండ్రు గడబిడ జేస్తండ్రు” అంటూ సీమాంధ్రుల నాయకత్వ పోకడలను వ్యంగ్యంగా ఎండగడుతూనే తన సాహిత్యాభిలాషను, పదాల తృష్ణను తీర్చుకున్నడు. మొత్తానికి అరవై సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో, కేసీఆర్ సారథ్యంలో సాగిన పదమూడేండ్ల సరికొత్త ఉద్యమదారుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఏకమై కదిలిండ్రు. అందుకే అరవై సంవత్సరాలు ఎవరికీ సాధ్యం కాని చిరకాల స్వప్నం ఆయన నేతృత్వంలో సాకారమయ్యింది.
2014 జూన్ 2న పది జిల్లాల తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించింది. ఆ ఉద్యమపాటను, అమరుల త్యాగాలను తెలంగాణ ఎన్నటికీ మరచిపోదు. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఈ రాష్ట్రం ఉన్నంత కాలం నందిని సిధారెడ్డి రాసిన “అమరులకు జోహార్ వీరులకు జోహార్” స్మృతిగీతం జాతి గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. అమర వీరులకు జోహార్లు. జై తెలంగాణ.
వీరుల్లారా వీర వనితల్లారా
అమ్మ రుణముకై రణముల ఒరిగినారా
తెలంగాణలోన కంటి చెమ్మల్లారా
నును వెచ్చని నెత్తురు చిమ్మినారా
పాట: వీరుల్లారా వీర వనితల్లారా
రచన: యశ్పాల్
Kcr Udamalu Pata
బడికిపోయే వయసులోనే పాటలు పాడుతున్న రసమయి బాలకిషన్ ఉత్తగనే మైక్ అందుకొని ఏ జంకు గొంకు లేకుండ “చంద్రశేఖరన్న వచ్చె ఎన్నెలో ఎన్నెలా” అంటూ తోచిన పదాలతో అల్లిన పాటను అలవోకగా పాడుతుంటె కేసీఆర్‌కి ముచ్చటనిపించింది. బాలకిషన్‌ని కేసీఆర్ తన వెంట తిప్పుకొన్నడు. అట్ల మొదలైన రసమయి బాలకిషన్ అనేకమంది ప్రజాకవుల పాటల్ని ‘తెలంగాణ ధూం ధాం’ వేదికల మీద గంటలకొద్ది పాడుతూ, ఎగురుతూ, దునుకుతూ మాటల మాంత్రికుడై, పాటల విలుకాడై సభలను అలరించిండు. ధూంధాం వేదికల మీద అంతడుపుల నాగరాజు బృందంతో కలిసి బాలకిషన్ తెలంగాణ ఉద్యమ పాటల్ని ఉర్రూతలూగించిన తీరు తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదు.
రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, విమలక్క పాటలు అంతడుపుల నాగరాజు బృందాల ప్రదర్శనలతో తెలంగాణ ఉద్యమం ‘ధూం ధాం’గా నడిచింది. “చలో ధూంధాం/ చలో ధూంధాం తెలంగాణ జాతరొచ్చెరా” అంటూ విమలక్క బృందం ఆటపాటలతోని తెలంగాణ ఉద్యమాన్ని జాతరని తలిపించేట్టు చేసింది. కోదారి శ్రీనివాస్ రాసిన “అస్సోయ్ దులా హారతి కాళ్ల గజ్జెల గమ్మతి/ తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి” రసమయి ఆటపాటతో జనాన్ని ఊర్రూతలూగించింది. ఈ పాట లేకుండా తెలంగాణ ధూంధాం సాగలేదంటే అతిశయోక్తి కాదేమో!
ప్రత్యేక రాష్ర్ట సాధనే లక్ష్యంగా ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చిన కవి అంబటి వెంకన్న. “తెలంగాణ ఆటపాట పల్లెలు దరువేసెనంట”, “గణ గణ గణ తెలంగాణ గర్జనలే జేద్దాము”, “రావాలె రావాలె ఓయమ్మా / తెలంగాణమ్మా నువ్వు కావాలె కావాలె మాయమ్మా”, “వందనాలు వందనాలు వందనాలమ్మో” అంటూ తెలంగాణ కోసం గొంతెత్తి గానం చేసిండు. పదాల అగ్గిరవ్వలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించిండు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో/ బంగారి గౌరమ్మ ఉయ్యాల/ ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో/ ఉయ్యాల ఊగంగ ఇయ్యాల” అనే బతుకమ్మ పాట “కన్నెపిల్లలారా వలలో/ సన్నజాజులారా వలలో/ పదంబాడ రారే వలలో/ పాట నేర్చుకోరే వలలో..” అంటూ తీగ రాగంతో సాగిపోయే సుదీర్ఘమైన “ఐదొద్దుల ఆనపాట”లు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి టీవీ చానెల్లో ఆయన పాటలు మార్మోగినయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్కు పాతికేళ్ల ఉత్సవాల సందర్భంగా ఉద్యమానికి ఊతమిచ్చి పాటను, పాటకు దారి చూపిన కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటూ ఆనాటి పదాల ముచ్చట్లు తెలంగాణతో ఇప్పుడిట్ల పంచుకున్నడు.
తెలంగాణ జానపద కళల మాగాణం. యక్షగానం, ఒగ్గుకథ, కోలాటం, బోనాలు, బతుకమ్మ వంటి కళారూపాలతో పాటు శారదకాండ్రు, పిచ్చుకగుంట్లు, బైరూపులు, విప్రవినోదులు, ఫకీర్లు, పెద్దమ్మలోళ్లు, బుడిగ జంగాలు, బుడుబుక్కలోళ్లు, దాసర్లు, బైండ్లవారు, చిందులు, వీరముష్టివారు, బాలసంతులు, పులివేషాలోళ్లు, డప్పులోళ్లు ఇంకా ఎందరో వృత్తిగాయకుల సంప్రదాయ కళలకు తెలంగాణ ఉద్యమ వేదిక మీద ప్రజాదరణ దక్కింది. ‘ధూంధాం’లకు జనాదరణ పెరిగింది. ఉద్యమాన్ని కొంతపుంతలు తొక్కించింది. కళాకారులు వివిధ కళారూపాలతో ఆనాటి సాంఘిక జీవనాన్ని కండ్లకు కట్టడంతో జనమంతా ‘ఇది కదా! మన తెలంగాణ’ అనుకున్నరు. మిద్దె రాములు ఒగ్గుకథ ఎందరినో అలరించింది. డప్పు, గుస్సాడి, కోలాటం ఒకటని కాదు. మొత్తానికి ‘మా తెలంగాణ మాగ్గావాలె’ ఆలోచనకు తెచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమ పాటది. కవులు కళాకారులది. అయితే వేదికలను సమకూర్చిన ఘనత మాత్రం బీఆర్ఎస్ పార్టీది.
కేసీఆర్‌కు పలుకుబడులు, సామెతలు కొట్టిన పిండి. పాటలో పవర్ తెలిసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ యాస, భాషల్లోని గాఢత కేసీఆర్‌కు బాగా తెలుసు. వలస పాలనలో తెలంగాణ బిడ్డలు అనుభవిస్తున్న దుఃఖం తెలుసు. బంధనాల నుంచి బయటపడే మార్గమూ తెలుసు. అందుకే ఆయన వెంట మొత్తం తెలంగాణ కదిలింది. ఉద్యమానికి ఊపిరి పోయడానికి ఎందరో కవుల్ని, గాయకుల్ని కేసీఆర్ చేరదీసిండు. ఆదరించిండు. ఏ సభ జరిగినా ప్రసంగాల కంటే పాటలకే ఎక్కువ సమయమిచ్చిండు.
కవులు, కళాకారులతో మమేకమైన కేసీఆర్ చాలా పాటల్లో తనదైన శైలిలో పదాలను అందించిన సందర్భం లేకపోలేదు. తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం టీఆర్ఎస్ పాటల క్యాసెట్లు రూపొందించింది. వాటిల్ల గోదావరి నదీ జలాల పాటలు, ఫ్లోరైడ్ పాటలు, తెలంగాణ కరవు, వలసపాలకుల కుట్రలు ఉన్నయి. ఈ పాటల క్యాసెట్లలో సుద్దాల అశోక్‌తేజ రాసిన “ఇది తెలంగాణ కోటి రతనాల వీణ” పాట ప్రజాగర్జన సభల్లో మార్మోగింది.
వరంగల్ శ్రీనివాస్, మిత్ర, కోదారి శ్రీనివాస్, ఏపూరి సోమన్న, నేర్నాల కిషోర్, పాటమ్మ భిక్షపతి, అంబటి వెంకన్న, అభినయ శ్రీనివాస్, నిసార్, మిట్టపల్లి సురేందర్, పైలం సంతోష్, పొలిశెట్టి లింగన్న, బోడ చంద్రప్రకాశ్ మొదలైన కవిగాయకులెందరో వందలాది పాటలు రాసి, వేలాది వేదికలపై పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఊరేగించిండ్రు. వీళ్లు లేకుండ, వీళ్ల ఆటాపాటా లేకుండ తెలంగాణ ఉద్యమం లేదు. వడ్లకొండ అనిల్, రమాదేవి, తేలు విజయ ఇంకా ఎందరో కవులు, కళాకారులు ఉప్పెనలా ఈ ఉద్యమంలోకి దుంకిండ్రు.
పసునూరి రవీందర్ రాసిన “ఊరు వాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో జైకొట్టి తెలంగాణ” తెలంగాణ పాట రింగ్‌టోనై మోతమోగింది. ఈ పాట తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొచ్చింది. కోదారి శ్రీనివాస్ బొంబాయి పాటను వేదికల మీద ప్రదర్శించిన పైలం సంతోష్ “ప్రజా తెలంగాణకై రండన మీరు రండనో” అంటూ ఉద్యమ గానం చేసిండు. ఇంత కొట్లాడుతున్నా, ఇన్ని ప్రాణాలు పోతున్నా ఈ సీమాంద్ర ప్రభుత్వానికి కనికరం లేదని స్వయంగా “పాలనా ఏం పాలనా ఇది ఫాసిస్టు పాలనా / పాలనా ఏం పాలనా కాంగిరేసు పాలనా” అంటూ దుమ్మెత్తిపోసిండు. ఎగిరి దునికి ఎత్తిపోతలైనడు. “అమ్మా సోనియమ్మ ఓ తల్లీ సోనియమ్మ / ఓ ఢిల్లీలున్న బొమ్మ తెలంగాణ ముచ్చటమ్మ” అంటూ ఢిల్లీ కాంగ్రేసు పీఠాన్ని కదిలించే ప్రయత్నం చేసిండు బోడ చంద్రప్రకాశ్.
– అంబటి వెంకన్న