సాంకేతికత రోజురోజుకూ కొత్తరూపు దాలుస్తున్నది. నెల తిరగకముందే.. నయా మాడల్ తెరపైకి వస్తున్నది. అలాంటిది, ఏడాది క్యాలెండర్ మారినప్పుడు..టెక్నాలజీలో మరెంత మార్పు కనిపిస్తుందో కదా! టెక్ ప్రియుల ఎదురుచూపులకు తెర దించుతూ.. 2026లోనూ టెక్నాలజీ తన టెక్కు చూపించేందుకు రెడీగా ఉన్నది. అద్భుతమైన ఆవిష్కరణలతో మనల్ని అబ్బురపరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. ఈ ఏడాది సాంకేతికరంగంలో మనం చూడబోయే అద్భుతాలు ఏమిటో ఓ లుక్కేద్దాం.
వినోద రంగంలో అతిముఖ్యమైన టీవీలు కూడా.. ఆధునిక సాంకేతికతను అద్దుకోనున్నాయి. మరింత పెద్దగా, ప్రకాశవంతంగా మారబోతున్నాయి. మైక్రో ఎల్ఈడీ మోడళ్ల రాకతో.. 100 అంగుళాల తెరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. సోనీ, సామ్సంగ్ వంటి సంస్థలు.. ఇప్పటికే ఈ తరహా మోడల్స్‌ను రూపొందించే పనిలో పడ్డాయి. ఇక ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పంచే హై క్వాలిటీ ప్రొజెక్టర్లు కూడా మరింతగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రతి ఒక్కరికీ చేరువయ్యే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. స్మార్ట్‌ఫోన్. ఈ ఏడాది మరింత స్మార్ట్‌గా మారబోతున్నది. అయితే, ఈ రంగంలో అందరి దృష్టి ‘ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్’ పైనే ఉన్నది. చిన్నాచితకా సంస్థలు కూడా మడతపెట్టి మరీ సరికొత్త మాడల్స్‌ను తీసుకొస్తుంటే.. దిగ్గజ సంస్థ ఆపిల్ చాలా వెనకబడి పోయింది. ఆ లోటును పూడుస్తూ, ప్రస్తుత ఫోల్డబుల్ ఫోన్లలోని లోపాలను సవరిస్తూ.. ఆపిల్ మడత ఫోన్‌కు రూపకల్పన చేస్తున్నదట. 2025లో ఆపిల్ విడుదల చేసిన అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్.. ఫోల్డబుల్ ఫోన్‌వైపు ముందడుగని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే.. రెండు తెరల ఆపిల్ ఫోన్‌ను 2026లోనే చేతిలోకి తీసుకునే అవకాశం ఉన్నది.

రాబోయే రోజుల్లో మనుషులు మరింత బిజీగా మారనున్నారు. వారి జీవన విధానాన్ని సులభతరం చేసేలా.. స్వయంప్రతిపత్తి కలిగిన రోబోటిక్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఇంటి పనులు చక్కబెట్టడమే కాదు.. రాత్రిపూట ఇంటికి కాపలా కూడా కాస్తాయి. ఈ తరహా రోబోలు ఇప్పటికే సీఈఎస్-2025లో ప్రదర్శితమయ్యాయి కూడా. ఈ ఏడాది పూర్తిస్థాయిలో విధుల్లోకి వచ్చే అవకాశం ఉన్నది.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లపైకి వచ్చి చాలాకాలమే అయ్యింది. కానీ, ఎన్నో లోపాలు, లోటుపాట్లు ఈ రంగాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. అందుకే.. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ.. డ్రైవర్ అవసరం ఏమాత్రం లేని స్మార్ట్ కార్ల తయారీపై దృష్టిపెట్టాయి వాహన సంస్థలు. సెమీ అటానమస్, స్మార్ట్ ఫీచర్లతో వీటిని తీసుకురానున్నాయి. సెల్ఫ్ పార్కింగ్, హ్యాండ్స్-ఫ్రీ, కొలిషన్-అవాయిడెన్స్, డ్రైవర్ ఫెటీగ్ డిటెక్షన్, ఇన్-కార్ ఏఐ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లు.. ఈ కార్లలో ఉండబోతున్నాయి.

ఇప్పటివరకూ ‘స్మార్ట్ హోమ్’ను చూశాం. ఇక అంతకుమించిన టెక్నాలజీని అనుభవించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ హోమ్ పరికరాలకు సొంత ఆలోచన ఉన్నా.. నిర్ణయాలు మాత్రం తీసుకోలేవు. ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, వంటగది ఉపకరణాలు.. వీటిని మనమే ఇంటర్నెట్ ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది. అయితే, ఆధునిక ‘ఇంటెలిజెంట్ హోమ్’.. సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఇంట్లోని స్మార్ట్ ఉపకరణాలు, ఎంటర్టైన్మెంట్, భద్రతా పరికరాల కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. వర్చువల్ హౌస్‌కీపర్లుగా వ్యవహరిస్తుందన్నమాట!