ఇల్లు బాగుందా… అని ఎవరన్నా అడిగితే… బాగాలేకేం బంగారంలా ఉంది అంటుంటాం. బాగున్నదేన్నైనా బంగారంతో పోల్చడం మనకు అలవాటు. మరి ఆ సింగారాన్ని స్వీట్హోమ్కి జోడీ చేస్తే మరింత సొబగుగా ఉంటుంది అనుకున్నారేమో డిజైనర్లు… వాల్ పేపర్లను పసిడి వర్ణాల్లో తీర్చిదిద్దుతున్నారు. ఇంటీరియర్ ఏదైనా ఇట్టే సెట్ అయిపోతూ వావ్ అనిపించే లుక్ తేవడం ఈ వన్నెకే సాధ్యం మరి!
ఎండదీ వెన్నెలదీ బంగారు వన్నే… ఓ మసక వేళ. మబ్బులదీ, కెరటాలదీ కూడా ఒకానొక సంధ్యన పసిడి ప్రియరాగమే. గుండెల్లో గుడి కట్టిన వాళ్ల మనసుకంటే బంగారం మరోటి కనిపించదు చాలాసార్లు. అలాంటి వాళ్లతో కలిసుండే ముచ్చటైన పొదరింట్లో బంగారం రంగారుతుంటే ఎంత అందంగా ఉంటుంది. తొలిమలి సంధ్యలన్నీ మనవే అనిపిస్తాయి! కంటికీ మనసుకూ ‘సిరి’సంగా ఉంటుంది కదా?! అందుకే ఇంటీరియర్‌లో ఇప్పుడు స్వర్ణవర్ణపు సందడి పెరిగింది. గోల్డెన్ యాక్సెంట్ వాల్ పేపర్లు ఇంటీరియర్‌లో నయా ట్రెండ్ అయ్యాయి.
బంగారమే కాదు బంగారపు రంగు కూడా రిచ్ లుక్‌ని ఇస్తుంది. హోటల్, రెస్టారెంట్లలోనూ ఆంబియన్స్ రిచ్‌గా కనిపించిందంటే అక్కడ పసిడి ఛాయలున్నట్టే. ఇక, ఇంటి విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. మనం ఏదైనా గదికి రిచ్‌లుక్ తీసుకురావాలనుకుంటే ఆ గది ఇంటీరియర్ అక్కడి వస్తువుల్లో బంగారు రంగు జొప్పిస్తే సరి! వాల్పేపర్లు ఇందుకు సరైన ఎంపిక. గోల్డెన్ షేడ్‌లో మెరిసే రకరకాల ఆకులు, తీగలు, చెట్ల ఆకృతులు ఉన్న చోటికి కొత్త ఆకర్షణను తీసుకొస్తాయి.
రస్టిక్లుక్ కోసం వాడే ఇటుకలు, రాళ్లలాంటి వాల్ పేపర్లనూ బంగారు వన్నెల్లో రూపొందిస్తున్నారు. చమ్కీలా మెరిసే గోల్డెన్ కలర్ వాల్ పేపర్లతో పాటు, సాదా పసిడి రంగు మీద చిన్నచిన్న డిజైన్లు వచ్చేవీ ఉంటున్నాయి. ఇవి కాక, పున్నమి నాటి పసిడి వెన్నెల కాంతులను ఆవిష్కరించేవీ ఈ రకంలో దొరుకుతున్నాయి. హాలు, బెడ్రూం, లివింగ్ రూం… ఇలా మనకు నచ్చిన చోట వీటిని అతికించుకోవచ్చు. పసిడి వన్నెలు చిమ్మే వీటిని చూసిన ఎవరైనా… మీ గోడ బంగారం కానూ… అనాల్సిందే ఇక!