మహాభారతంలో భీమసేనుడు, హిడింబ ఒక జంట. కండలు తిరిగిన భీముణ్ని..క్రీగంట చూసింది హిడింబ. తొలి చూపులోనే
ఆ యోధుణ్ని వలచింది. ఇక్కడో పాట కావాలన్నాడు దర్శకుడు. సినారె సిరా ఇలా విదిలించాడు.రాక్షస కన్య నోటి వెంట ఎలాంటి పదాలు పలకాలో..అవే చిలికాయి. పల్లవి విన్నవారు.. ఛాంగురే అన్నారు! చరణానికి వచ్చాక… పాట రాయడంలో సినారె ‘మేటిదొరవు అమ్మకచెల్లా’ అనిపించుకున్నారు. ఈ ఉపోద్ఘాతం చదివిన తర్వాత ఆ పాట ఏ పాటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా! 1966లో వచ్చిన ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమా కోసం మన సినారె రాసిన గీతాన్ని మనసారా ఆస్వాదించండి.
సినారె తన సినీగీతాలలో ఒంటరి గీతాలు, యుగళ గీతాలు, బృంద గీతాలను రాశారు. ఒంటరి గీతాల్లో నాయిక.. నాయకుడిని ఆట పట్టించేవో, నాయకుడు.. నాయికను తమాషా పట్టించేవో ఉన్నాయి. ఈ గీతాలను గురించి సినారె చెబుతూ… ‘మన తెలుగు సినిమాల్లో యుగళగీతాల్లో పెళ్లి కాకముందు జంటలు ఒకరినొకరు ఉడికిస్తూ పాడేవి కొన్ని ఉంటాయి’ అంటారు. ఇందులో ఆయన యుగళ గీతాల గురించి పేర్కొన్నా ఇది అన్నింటికీ వర్తిస్తుంది. వారు రాసిన వాటిలో ‘లక్షాధికారి’, ‘కలవారి కోడలు’ వంటి చిత్రాల్లో అమ్మాయిలను ఉడికిస్తూ అబ్బాయిలు పాడే పాటలు కనిపిస్తాయి. అబ్బాయిలను అమ్మాయిలు ఆటపట్టిస్తున్నట్టు రాసిన వాటిని ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’, ‘ప్రణయ గీతం’ చిత్రాల్లో చూడవచ్చు. ఇటువంటి గీతమే ఈ ‘ఛాంగురే బంగారు రాజా!’. ఎన్.టి.రామారావు తీర్చిదిద్దిన ఈ చిత్రం కోసం సినారె రెండు గీతాలు రాశారు. ఇందులో ఒకటి హిడింబ పాత్ర కోసం రాయగా, రెండవది సుయోధన సార్వభౌముడి స్వాగత గీతం.
పల్లవి
ఓహోహో…
ఛాంగురే బంగారు రాజా!
ఛాంగు ఛాంగురే బంగారు రాజా!
మజ్జారే మగరేడా మత్తైనా వగకాడా! అయ్యారే!
అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా!! ॥ఛాంగురే॥
అవకాశం రావాలే కానీ సినిమాల్లో జానపద బాణీల్లో రాయడం సినారెకు బాగా నచ్చుతుంది. అంతేకాదు ఆబాల గోపాలానికి నచ్చేట్టు ఆ గీతాన్ని కూర్చారాయన. పదాల ప్రయోగం మొదలు సన్నివేశం, సమయం, సందర్భం వరకు ఔచిత్యవంతంగా ఆ గీతాన్ని ఎలా కూర్చాలో ఆయనకు బాగా తెలుసు. రారాజు సుయోధనుని కోసం రాసినప్పుడు ‘చిత్రం భళారే విచిత్రం’ అంటూ రాజసం ఒలికించే విధంగా కూర్చిన సినారె ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం కోసం ఒక రాక్షసాంగన అడవిలో మానవాంగనగా మారిన సందర్భంలో పై పల్లవిని కూర్చారు. ఇందులోని ‘ఛాంగురే’ పదం ‘మజ్జారే’, ‘అయ్యారే’ ‘మగరేడ’ వంటివన్నీ విలక్షణమైన పద ప్రయోగాలు. పాటకు అందాన్నివ్వడమే కాక భాషా సౌందర్యపు గుబాళింపునకు పర్యాయంగా నిలుస్తాయి.
గీతం సందర్భంలోని కథ ప్రకారం అరణ్యవాసంలో ఉన్న పాండవులు బడలిక తీర్చుకోవడానికి ఒక అడవిలో విశ్రమిస్తారు. అక్కడికి సమీపంలోని ఒక గుహలో హిడింబాసురుడు అనే రాక్షసుడు నివసిస్తుంటాడు. వాడి నాసికలకు నరవాసన తాకగానే ఆ విషయాన్ని తన చెల్లెలు హిడింబకు చెబుతాడు. అన్న ఆదేశంతో వెంటనే నరవాసన వచ్చినవైపు బయలుదేరుతుంది హిడింబ. ఆమెకు చెట్టు నీడలో విశ్రమిస్తున్న వారిలో భీమసేనుడు నచ్చుతాడు. అతనిని చూడగానే ఆమె మనసు అదుపు తప్పుతుంది. “మునుపెందరో మగల గంటిగానీ, ఈ మగరాయని నీటుకు సరిదీటా! ఒళ్లెల్ల కళ్లయినా, సొగసు చూడచాలేనా!” అని అనుకుని వెంటనే తన మాయాబలంతో కుంతీదేవికి, నలుగురు పాండవులకు పూలపాన్పులు, ఫలహారాలు ఏర్పాటు చేస్తుంది. అయినా ఆమె మాయలోకి భీముడు రాకపోవడంతో ఒక మంత్ర సరస్సును సృష్టించి అందమైన అంగనగా మారి భీముణ్ని ఉడికిస్తూ పాడే పాట ఇది. సినారె ఆ సన్నివేశం, పాత్రలతోపాటు అడవి సందర్భానుసారంగా రాశారు కూడా.
చరణం 1
ముచ్చటైన మొలక మీసముంది..
భళా! అచ్చమైన సింగపు నడుముంది ॥ముచ్చటైన॥
జిగీబిగీ మేనుంది
సొగసులొలుకు మోముంది
మేటిదొరవు అమ్మకచెల్ల…!
నీ సాటి ఎవ్వరుండుట కల్ల ॥ఛాంగురే॥
చరణం 2
కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు పచ్చల పిడిబాకు ॥కైపున్న॥
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకో!
గుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటె తెలుస్తుందిరా ॥ఛాంగురే॥
పై చరణంలోని పదాలు, వాక్యాల ప్రయోగం కూడా చూడండి. సన్నివేశంలోని నాయిక పల్లె పడుచో, కులీననో, సాంఘిక సమాజపు మహిళ కాదు. రాక్షసాంగన… మనిషిగా మారింది. అందుకే సన్నివేశాన్ని మరింత దీప్తిమంతం చేశాయి. ‘మగరేడు’, ‘మొలక మీసం’, ‘వగకాడు’, ‘సింగపు నడుము’, ‘మచ్చెకంటి చూపు’ వంటి పద ప్రయోగాలు సినారెను మరింత కొత్తగా చూపుతాయి కూడా. ప్రాచీన కావ్యాల్లోని ‘అమ్మకుచెల్ల’ అనే ప్రయోగాన్ని కూడా ఈ గీతంలో చూడవచ్చు. ఇంకా ‘పచ్చల పిడిబాకు’, ‘విచ్చినపువురేకు’ వంటివి ఈ గీతాన్ని మరింతగా వెలిగింపజేశాయి.
చరణం 3
గుబులుకొనే కోడెవయసు లెస్స
దాని గుబాళింపు ఇంకా హైలెస్స ॥గుబులు॥
పడుచుదనపు గిలిగింత
గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా
కైదండ లేక నిలువలేనురా ॥ఛాంగురే॥
‘లెస్స’, ‘హై లెస్స’ అంటూ పై చరణంలో చేర్చిన అచ్చ తెలుగు పదాలు ఒక కారణమైతే, పాదాల్లో కూర్చిన అంత్యప్రాస ప్రయోగం కావచ్చు. తర్వాతి పాదాల్లోని ‘గిలిగింత’, ‘పులకింత’, ‘సేతురా’, ‘నిలువలేనురా’ వంటివి ఒక కొత్తతూగును గీతానికి అందించాయి. ఇప్పటికీ ఆడియోగా ఈ పాట వినవచ్చినప్పుడు లయకు అనుగుణంగా స్టెప్పులేయకుండా ఉండలేం. అందుకు కారణం ఈ గీతాన్ని మత్తెక్కించేలా గానం చేసిన గాయనీమణి జిక్కి స్వరం. చక్కటి బీట్స్‌తో స్వరపరిచిన టి.వి.రాజు స్వర విన్యాసం. ఇది విన్నాక ‘సినారె…! భళారే….!’ అనకుండా ఉండలేం.
-పత్తిపాక మోహన్