‘సార్.. ఇక్కడ మూసీ నది ఒడ్డుకు ఓ సూట్ కేసు కొట్టుకొచ్చింది. అందులోంచి చాలా దుర్వాసన వస్తుంది’ కంగారుగా ఓ వ్యక్తి ఫోన్లో చెప్తూ పోయాడు. వివరాలు నమోదు చేసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి బయల్దేరాడు. ఆ ప్రాంతమంతా జనంతో గుమిగూడి ఉంది. వాళ్లను పక్కకు జరిపిన పోలీసులు.. ఆ సూట్‌కేసును తెరిచారు.
ఓపెన్ చేయగానే.. ఒక్కసారిగా దుర్వాసన గుప్పుమంది. తమను తాము తమాయించుకొన్న కానిస్టేబుల్స్ నెమ్మదిగా సూట్‌కేసులో ఏమున్నాయో పరీక్షించారు. అందులో ఏవో వస్తువులను చుట్టి కొన్ని షర్ట్స్, ప్యాంట్లు కనిపించాయి. రుద్ర అనుమతితో ఏంటా? అని వాటిని తెరిచారు కానిస్టేబుల్స్. మనిషి నుంచి వేరుచేసిన ఒక కాలు, ఒక చెయ్యి, ఒక చెవి అందులో కనిపించాయి. పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రాంతమంతా అలజడి రేగింది. పరిస్థితులను అదుపు చేయడానికి జనాన్ని దూరంగా జరిపారు పోలీసులు. అప్పుడే వచ్చిన ఫోరెన్సిక్ టీమ్ వివరాలు సేకరించే పనిలోపడింది. నదిమీద ఉన్న వంతెన వరకు వెళ్లిన జాగిలాలు అక్కడితో ఆగిపోయాయి. ఇంతలో రుద్రతో మాట్లాడిన ఫోరెన్సిక్ టీమ్.. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా హంతకులు జాగ్రత్త పడ్డారని చెప్పారు.
‘ఏంటి సార్ ఇది? ఇంత క్రూరంగా హత్యచేసి పబ్లిక్ ప్లేస్‌లో పడేయడమా? అదీ.. ఎలాంటి క్లూలు దొరక్కుండా జాగ్రత్తపడటమా?’ ఆశ్చర్యపోతూ అన్నాడు రామస్వామి. ‘క్రైమ్ చేయడంలో బాగా ఆరితేరిన వాడే ఈ హత్య చేసి ఉంటాడని చెప్తూ పోయాడు. ‘ఎలా చెప్పగలవ్ బాబాయ్?’ సందేహంగా అడిగాడు రుద్ర. ‘కాకపోతే ఏంటి సార్. చనిపోయింది ఎవరో అస్సలు తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. పోలీసు డాగ్స్ కూడా పట్టుకోలేకపోయాయి. మీరూ చూశారుగా’ డిటెక్టివ్‌లా చెప్తూ పోయాడు రామస్వామి. ‘మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసినా.. ఏదో ఆధారం దొరక్కుండా ఉండదు’ అన్నాడు రుద్ర. ‘ఏమో సార్! నాకైతే అనుమానమే! మనిషి ముఖం ఉన్నా.. కూపీ లాగొచ్చు. మొండి చెయ్యి, కాలుతో హత్యకు గురైంది ఎవరని గుర్తిస్తాం, అతణ్ని చంపింది ఎవరో ఎలా కనిపెడతాం’ అంటూ నిట్టూర్చాడు రామస్వామి’. ఇంతలోనే రుద్ర ముఖంలో ఏదో వెలుగు. ఆయనలో వచ్చిన ఆకస్మిక మార్పును అలా చూస్తూ ఉండిపోయాడు రామస్వామి.
మరుసటి రోజు.. ఉదయం టీవీలో వార్తలు చూస్తున్నది శారద. ‘మేడమ్.. నేను ఇన్స్పెక్టర్. లోపలికి రావొచ్చా’ అడిగాడు రుద్ర. లోపలికి రమ్మని చెయ్యి చూపిస్తూ.. ‘విషయమేంటని?’ అడిగింది శారద. ‘శ్రీనివాస్ గారు ఎవరు? ఆయన ఎక్కడ?’ అని ప్రశ్నించాడు రుద్ర. ‘మా నాన్న. దుబాయ్‌లో ఉంటారు. ఏంటీ విషయం?’ అని మళ్లీ అడిగింది శారద. ‘దుబాయ్‌లోనా.. ఎప్పుడు వెళ్లారు?’ ప్రశ్నించాడు రుద్ర. ‘ఆయన వారం కిందటే వెళ్లారు. విషయమేంటో ముందు చెప్పండి’ అని అడిగింది శారద.
‘మీ నాన్నగారిని ఎవరో హత్యచేశారు. ఆయన బాడీలో కొన్ని పార్ట్స్ మాకు నిన్న దొరికాయి’ చెప్పాడు రుద్ర. ఆ మాట విని శారదతోపాటు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి అండ్ కో అంతా షాక్ అయ్యారు. చనిపోయింది శ్రీనివాస్ అని రుద్ర ఎలా చెప్తున్నాడో కానిస్టేబుల్స్‌కు అస్సలు అర్థంకాలేదు. ఇంతలో ఎర్రబడ్డ కండ్లతో కోపంగా.. ‘మీకేమైనా పిచ్చి పట్టిందా? మా నాన్నగారు చనిపోవడమేంటి? ఇప్పుడే ఆయనతో ఫోన్లో మాట్లాడా. కావాలంటే మీతో కూడా మాట్లాడిస్తా’ అంటూ విసురుగా ఫోన్ తీసింది శారదా. శ్రీనివాస్‌కు ఫోన్ కలిపింది. స్పీకర్ ఆన్ చేసింది. ఫోన్ రింగవుతుంది.
అటు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మూడు, నాలుగు, ఐదు, ఆరు ఇలా ఎన్ని రింగ్స్ మోగినా అటువైపు నుంచి ఎవరూ ఫోన్ అటెండ్ చేయలేదు. శారదతో పాటు కానిస్టేబుల్స్ ముఖం మొత్తం చెమట ఆవరించింది. సరిగ్గా ఏడో రింగ్‌కు అటువైపు నుంచి ఫోన్ లిఫ్ట్ చేశారు. ‘హలో బేబీ.. చెప్పమ్మా!’ శ్రీనివాస్ వాయిస్. ‘డాడీ.. మీరు బాగానే ఉన్నారు కదూ’ కంగారుగా అడిగింది శారద. ‘ఐయామ్ ఆల్రైట్. వాట్ హ్యాపెన్డ్ బేబీ’ కాస్త కంగారుగా అడిగాడు శ్రీనివాస్. ‘నేను మళ్లీ ఫోన్ చేస్తాను డాడీ’ అని ఫోన్ కట్ చేసింది.
రుద్ర వైపు కోపంగా తిరిగి..ఇప్పుడేమంటారు? అన్నట్టు చూసింది శారద. ‘మీ నాన్నగారు దుబాయ్‌లో ఉంటే, పక్కన చార్మినార్ బాగుంది అన్నట్టు ఎవరో టూరిస్టులు ఎందుకు మాట్లాడుకొంటున్నారు? దుబాయ్‌లో కూడా చార్మినార్‌ను కొత్తగా కట్టారా?’ బాంబు పేల్చాడు రుద్ర. స్పీకర్లో ఆ కాన్వర్జేషన్‌ను విన్నప్పటికీ, తాము ఎలా పట్టుకోలేదబ్బా? అని మిగతా కానిస్టేబుల్స్ సిగ్గుపడ్డారు.
శారద ముఖం పాలిపోయింది. స్టేషన్‌కు వెళ్లి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని శారద బయటపెట్టింది. తన ప్రేమను ఒప్పుకోనందుకు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తానే శ్రీనివాస్‌ను చంపానని, శవాన్ని గుర్తుపట్టకుండా శరీర భాగాలను వేరు చేసి అక్కడక్కడ పడేశామన్నది. అందర్నీ నమ్మించడానికి దుబాయ్‌కు వెళ్లాడని నాటకం ఆడానని చెప్పింది. బంధువులను నమ్మించడానికి తండ్రి మొబైల్‌ను మిమిక్రీ తెలిసిన తన బాయ్‌ఫ్రెండ్‌కు ఇచ్చినట్టు, అలా అతనితో శ్రీనివాస్‌గా మాట్లాడిస్తున్నట్టు ఒప్పేసుకొంది. కాగా, సూట్‌కేసులో ఉన్నది శ్రీనివాస్ శరీర భాగాలే అని రుద్ర ఎలా నిర్ధారణకు వచ్చాడు??
టైలర్ల దగ్గర మనం ఏదైనా షర్ట్‌ను స్టిచ్చింగ్ చేయిస్తే, కాలర్ దగ్గర ఆ టైలర్ షాప్ లేబుల్ వేస్తారన్న విషయం తెలిసిందే. అంతేకాదు. కొలతలు తీసుకొనేప్పుడు దర్జీ.. షర్ట్ పీస్‌లోని చిన్న ముక్కను కత్తిరించి ఎవరు కుట్టిస్తున్నారో ఆ వ్యక్తి వివరాలు ఉన్న పేజీకి ఆ ముక్కను శాంపిల్‌గా స్టాపిల్ చేస్తాడు. ఆర్డర్లు తారుమారు కాకుండా ఉండేందుకే ఇలా చేస్తాడు. ఈ విషయం తెలిసిన రుద్ర.. సూట్‌కేసులోని షర్ట్స్, ప్యాంట్స్ సాయంతో టైలర్ షాప్‌ను, తద్వారా శ్రీనివాస్ వివరాలను తెలుసుకొన్నాడు. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి శారద అడ్డంగా దొరికిపోవడం కేసును మరింత ఈజీగా సాల్వ్ చేయడానికి రుద్రకు సాయపడింది.