e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ బ్రహ్మండ విగ్రహాలు

బ్రహ్మండ విగ్రహాలు

బ్రహ్మండ విగ్రహాలు

సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయన నాలుగు ముఖాలనుండే నాలుగు వేదాలు ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే, యజ్ఞ యాగాదుల్లో బ్రహ్మను పూజించినా, భృగు మహర్షి శాపం వల్ల చతుర్ముఖుడిఆలయాలు, విగ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయన్నది ఐతిహ్యం. దేశంలోని బ్రహ్మదేవుడి క్షేత్రాల్లో రాజస్థాన్‌లోని పుష్కర్‌ దేవాలయం సుప్రసిద్ధం. అరుదైన బ్రహ్మదేవుడి విగ్రహాల్లో కొన్ని మన తెలంగాణలోనూ ఉండటం, అందులో జైన, బౌద్ధ మతాలకు చెందిన బ్రహ్మ మూర్తులూ ఉండటం మరింత ప్రత్యేకం.  

జోగుళాంబ గద్వాల జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమప్రాంతం సంగమేశ్వరం. ఇక్కడికి సమీపంలోని ఆలంపూర్‌ జోగుళాంబ దేవాలయం అయిదో శక్తిపీఠం. దక్షిణకాశిగా, శ్రీశైలం పశ్చిమ ద్వారంగా, నవబ్రహ్మల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. క్రీ.శ.6, 7వ శతాబ్ది కాలంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. వీటి సముదాయంలో తొమ్మిది రూపాల (1. కుమార బ్రహ్మ   2.అర్కబ్రహ్మ, 3.వీరబ్రహ్మ, 4.బాలబ్రహ్మ, 5.స్వర్గబ్రహ్మ, 6.గరుడబ్రహ్మ, 7.విశ్వబ్రహ్మ, 8.పద్మబ్రహ్మ, 9.తారకబ్రహ్మ)తో తొమ్మిది శివలింగాలను ప్రతిష్ఠించి, వాటిని  బ్రహ్మదేవుడి పేరుతో కొలుస్తున్నారు. ఇలా ఒకే ప్రదేశంలో తొమ్మిది పేర్లతో బ్రహ్మదేవుడికి పూజలు నిర్వహించే అరుదైన క్షేత్రం మన దేశం మొత్తంలో ఇదొక్కటే కావడం విశేషం. నవబ్రహ్మలకు నిలయం కాబట్టి అలంపురానికి ‘బ్రహ్మపురి‘ అనే పేరుకూడా ఉంది. 

ఓరుగల్లు జైన బ్రహ్మ 

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన వరంగల్‌ నగర నడిబొడ్డున రాజపుత్‌వాడలో ఒక పురాతన రామాలయం ఉంది. హనుమకొండ కోట సమీపంలో పద్మాక్షి గుడికి వెళ్లే దారిలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో హనుమాన్‌, విష్ణువు, శ్రీ సీతారామ ఆలయం, శివాలయం ఉన్నాయి. అదే ప్రాంగణంలో ఒక మనోహరమైన బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది. ఇదొక అరుదైన కళాఖండం. అపూర్వమైన శిల్ప చాతుర్యంతో హోయసల శైలిలో చెక్కిన ఈ విగ్రహం, హళేబీడులోని దేవాలయ కుడ్యశిల్పాలలోని బ్రహ్మ మూర్తిని పోలి ఉన్నది. కాకతీయుల పాలనా కాలంలో శిల్పకళా వైభవం వర్ధిల్లింది. ఓరుగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన కాకతీయులు వేలాది శిల్పాలను చెక్కించారు. వందల కొద్దీ ఆలయాలను నిర్మించారు. ఈ బ్రహ్మ విగ్రహం కూడా ఆ కాలంలోనే రూపుదిద్దుకుంది. కఠినమైన డోలరైట్‌ శిలతో ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి.. శిల్పశాస్త్రంలో పద్ధతులను పక్కనపెట్టి.. ఎంతో విభిన్నంగా, వినూత్నంగా ఈ శిల్పాన్ని చెక్కాడు. చతుర్ముఖాలతో, త్రిభంగ భంగిమలో నిలబడి ఉన్నట్లు ఈ విగ్రహం కనిపిస్తుంది. ప్రసన్న వదనంతో తపస్సు చేస్తున్నట్లు ఉంది. రెండు చేతులలో వీణ, మరో చేతిలో శృక్‌ (యజ్ఞ యాగాదులలో నేతిని వేయడానికి వాడేది) ఉంది. బ్రహ్మ విగ్రహం కింది భాగంలో ఎడమవైపు సరస్వతి విగ్రహం కనిపిస్తుంది. సరస్వతి విగ్రహం కింద హంస, ఆ పక్కనే చామరగ్రాహిని శిల్పం కూడా ఉన్నది. బ్రహ్మ విగ్రహానికి కుడివైపున మరో శిల్పం (సావిత్రి కావొచ్చని నిపుణుల అభిప్రాయం) కనిపిస్తున్నది. 

బౌద్ధ బ్రహ్మ – సింగరాయలొద్ది

కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్ది పక్కన ప్రవహించే తుమ్మెదవాగు సమీపంలో అరుదైన బౌద్ధ బ్రహ్మ విగ్రహం ఉన్నది. తెలంగాణ చరిత్ర బృందం కృషితో ఇటీవలే వెలుగులోకి వచ్చింది. నాలుగు తలలతో ఉన్న ఈ విగ్రహం 6వ శతాబ్దంలో రూపొంది ఉండొచ్చని చరిత్రకారులు  చెబుతున్నారు. శరీర భాగం ముందువైపు పూర్తిగా ఉండగా, మిగతా మూడువైపులా అంత స్పష్టంగా లేదు. నలువైపులా జటామలకాలున్న నాలుగు తలలు, ముందు భాగంలో రెండు చేతులు ఉన్నాయి. ఎడమ చేతిలో కమండలం ఉంది. మానేరుకు ఉపనది అయిన మోయ తుమ్మెదవాగు  పరీవాహక ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని ఇక్కడ లభించిన చారిత్రక అవశేషాలు రుజువు చేస్తున్నాయి.

కుడ్య శిల్పాల్లోనూ..

రాష్ట్రంలోని పలు ఆలయాల్లోనూ బ్రహ్మ శిల్పాలున్నాయి. నల్గొండ జిల్లాలోని అమనగల్‌, గుడిపల్లి గ్రామంలో, మెదక్‌ జిల్లాలోని అల్లాదుర్గంలో,  రామప్ప దేవాలయ అంతరాల మంటపంలో, కాళేశ్వరం ఆలయ ప్రాంగణంలోని ఒక స్తంభంపై, మంథని సమీపంలోని చంద్రవెల్లి దేవాలయాల గోడలపై బ్రహ్మ దేవుడి శిల్పాలు కనిపిస్తాయి.

-అరవింద్‌ ఆర్య , 7997 270 270

Advertisement
బ్రహ్మండ విగ్రహాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement