Startup IPO | పందెం కోడికి.. దమ్మున్న పోషకుడు కావాలి. స్టార్టప్‌కు.. సొమ్మున్న ఇన్వెస్టర్ ఉండాలి. పందెం కోడికి చురకత్తి ఆయుధం. స్టార్టప్‌కు వ్యూహమే అక్షౌహిణుల సైన్యం. పందెం కోడి సత్తా చాటుకోడానికి సంక్రాంతి పండుగ సరైన సీజన్. స్టార్టప్ కంపెనీ ఐపీవోకు రావడానికి ఊపుమీదున్న మార్కెటే ఊతం. గెలిచిన పుంజు.. రారాజే! నిలిచిన స్టార్టప్.. కుబేర సామ్రాజ్యమే. ఈ ఏడాది బరిలో నిలబడి.. లక్ష్యంపై గురిపెట్టిన కార్పొరేట్ పందెం కోళ్లు చాలానే ఉన్నాయి. ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకూ గడువు. మహా రంజైన ఆ పందాల గురించి..
పందెం కోడి.. పౌరుషానికి ప్రతీక. దూకుడుకు తార్కాణం. వ్యూహాత్మక దాడికి పెట్టింది పేరు. చావో రేవో అన్నంత తెగింపు. కార్పొరేట్ ప్రపంచంలోనూ ఇలాంటి దమ్మున్న పుంజులు అనేకం ఉన్నాయి. స్టార్టప్‌గా అవతరిస్తాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆశ్రయిస్తాయి. మార్కెట్ నాడి పట్టేసుకుని, నిలదొక్కుకుంటాయి. ఓ దశలో దిగ్గజాలకూ చెమటలు పట్టిస్తాయి. అంతకుమించి ఎదిగేందుకు.. వనరులు సరిపోవు. శక్తిసామర్థ్యాలు సరితూగవు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన ఏదో ఓ సమయంలో యంగ్ ఆంత్రప్రెన్యూర్స్ బుర్రను తొలిచేస్తుంది. ఇక స్థిమితంగా నిద్రపోనివ్వదు. ప్రశాంతంగా భోంచేయనివ్వదు. తక్షణం రంగంలో దూకేస్తారు.
ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌ను నియమించుకుంటారు. సెబీలో పేరు రిజిస్టరు చేయించుకుంటారు. స్టాక్ ఎక్సేంజ్‌కు దరఖాస్తు చేస్తారు. ఐపీవో ధర నిర్ణయిస్తారు. ప్రకటనలు గుప్పిస్తారు. మార్కెట్ పరిస్థితుల్ని బట్టి స్పందన వస్తుంది. ఇన్వెస్టర్లకు వాటాలు వెళ్తాయి. కంపెనీలో నిధులు ప్రవహిస్తాయి. ఇక ఆకాశమే హద్దు.
గత ఏడాది మామాఎర్త్, ఐడియాఫోర్జ్, యాత్రా.. తదితర సంస్థలు ఐపీవోల రూపంలో మొత్తంగా మూడున్నర వేల కోట్లు సమీకరించగలిగాయి. అంతకుముందు ఏడాది డ్రోన్‌ఆచార్య వదిలిన బాణం గురితప్పలేదు. డెల్హీవరీ కూడా ఇన్వెస్టర్ల కలల్ని బాగానే డెలివరీ చేసింది. ట్రాక్సాన్.. సరికొత్త ట్రాక్ రికార్డు సృష్టించింది. కొత్త సంవత్సరంలో సరికొత్త ఉత్సాహంతో చాలా కంపెనీలు బరిలో దిగుతున్నాయి. గురి చూసి బాణం వేస్తున్నాయి. ఆ శ్రమ ఫలించి అనూహ్య స్పందన లభించనూవచ్చు. కొన్నిసార్లు అంచనాలను అందుకోలేకపోనూవచ్చు. అంతిమ ఫలితం ఎలా ఉన్నా.. ఓ స్టార్టప్‌గా అవతరించి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ ఉంది. ప్రతి విజయం వెనుకా ఓ స్ఫూర్తిదాయక కథనం ఉంది. ఉనికి కోసం పడిన పాట్లు, ఎదురుపోట్లు.. అనేకం, అపారం. అయినా సరే, ఏ దశలోనూ ఓటమిని అంగీకరించలేదు వ్యవస్థాపకులు. సత్తువ సరిపోనప్పుడు కసరత్తు చేసి బలం పుంజుకున్నారు. వ్యూహాలు విఫలమైనప్పుడు కొత్త సాధన సంపత్తిని సమకూర్చుకున్నారు. ప్రత్యర్థులు విసిరిన రాళ్లను పెట్టని కోటలుగా మార్చుకున్నారు. గాయాలకు ఓర్చుకున్నారు. కొత్త పాఠాలు నేర్చుకున్నారు. నీరసంగా అనిపించిన ప్రతిసారీ విజేతల కథల్ని పురాణాల్లా చదువుకున్నారు. గుండె ధైర్యం నింపుకొన్నారు. ఆ పట్టుదలే ఐపీవో వరకూ తీసుకొచ్చింది. ఇది కూడా ఆరంభమే.
బస్ టికెట్‌కు ఒక యాప్. ట్రైన్ బుకింగ్‌కు ఒక యాప్. విమాన ప్రయాణమైతే ఇంకో యాప్. అక్కడితో పనైపోదు. వెళ్లిన ప్రతిచోటా ఏదో ఓ హోటల్ రూమ్ బుక్ చేసుకోవాలి. దానికి మరో యాప్. ‘ప్రయాణమంటే ఎందుకింత ప్రయాస?’ అనిపించింది రజనీశ్ కుమార్, అలోక్ బాజ్‌పాయ్‌లకు. ‘రేయ్! నువ్వెంత ఇన్వెస్ట్ చేయగలవు?’ అడిగాడు రజనీశ్. ‘మాగ్జిమమ్ మూడు లక్షలు’ జవాబిచ్చాడు అలోక్. ‘గుడ్. నేనూ అంతే. మూడు నెలలు సమయం తీసుకుందాం. అంతలోపు ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని పని మొదలుపెడదాం’ అని చెబుతున్నప్పుడు రజనీశ్ గొంతులో పిచ్చ క్లారిటీ. గురుగ్రామ్‌లోని ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాత్రికి రాత్రే ఆఫీసుగా మారిపోయింది. ఇద్దరూ గతంలో ఓ విదేశీ ట్రావెల్ టెక్ కంపెనీలో పనిచేశారు. అదే ఫార్ములాను భారతీయ మార్కెట్‌కు అన్వయించాలని నిర్ణయించుకున్నారు. టెక్నాలజీ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని ముందే అనుకున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్.. జోడించి మరీ ఓ అప్లికేషన్ సిద్ధం చేశారు. రైలు, బస్సు, విమానం, హోటల్ రూమ్.. ఏదైనా క్షణాల్లో బుక్ చేసుకునేలా, ఆ ఎంపిక కూడా కస్టమర్ అభిరుచికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. ప్రయాణంలో భోజనం ఏర్పాట్ల గురించీ ఆలోచించారు. డిస్కౌంట్లు, ఆఫర్లు మామూలే. కంపెనీ పేరు విషయంలోనూ అంతే వైవిధ్యాన్ని పాటించారు.
‘ఇక్సిగో’ అని నిర్ణయించారు. ఇదో ప్రయాణ సెర్చ్ ఇంజిన్. కరోనా సమయంలో చాలా ట్రావెల్ యాప్స్ చితికిపోయాయి. కానీ, ఇక్సిగో మాత్రం సరికొత్త వ్యాపార అవకాశాల్ని వెతుక్కుంది. జనంలో భ్రమణ కాంక్ష పెరగడం ఈ సంస్థకు కలిసొచ్చింది. మార్కెట్ వాటా పెంచుకోడానికి కన్ఫర్మ్ టికెట్ యాప్‌నూ కొనుగోలు చేశారు ఆ ఇద్దరు మిత్రులు. నిజానికి ఇక్సిగో.. నేరుగా టికెట్లు కొనివ్వదు. గదులూ బుక్ చేయదు. ఆ వ్యాపారంలో ఉన్న వివిధ సంస్థలతో సమన్వయం చేసుకుంటుంది అంతే. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరిగినంత కాలం.. టూరిజం వ్యాపారానికి ఢోకా ఉండదు. ఆ ఒత్తిడి నుంచి దూరంగా పారిపోడానికైనా టికెట్లు బుక్ చేసుకుంటారు. విమానమో, రైలో ఎక్కుతారు. కాబట్టే, ఇక్సిగో ఆరు లక్షల రూపాయల కంపెనీ నుంచి ఐదువందల కోట్ల స్థాయికి చేరుకుంది. ఐపీవోతో ఆ విలువ వెయ్యికోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ‘క్షణక్షణానికి ప్రజల ఆలోచనలు, అభిరుచులు మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకుని వ్యాపారాన్ని నడిపించడం మీదే ఏ ఆంత్రప్రెన్యూర్ విజయమైనా ఆధారపడి ఉంటుంది’ అంటాడు రజనీశ్.
ఫండింగ్ కాదు కదా, మీరు ఇప్పటివరకూ నిలదొక్కుకోవడమే ఓ విచిత్రం. మీ వ్యాపారం ఓ పేకమేడ. మిమ్మల్ని నమ్మి ఏ మూర్ఖుడూ పెట్టుబడులు పెట్టడు.. అంటూ చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరిచారు. అయినా మేం వెనక్కి తగ్గలేదు. అస్త్ర సన్యాసమూ చేయలేదు. ప్రతి సవాలునూ ఓ అవకాశంగానే మలుచుకున్నాం.
-అలోక్ బాజ్‌పాయ్ ఇక్సిగో సహ-వ్యవస్థాపకుడు
డ్రోన్ ఆధునిక జీవితంలో భాగమైపోయింది. వివాహాల ఫొటోగ్రఫీ నుంచి సరిహద్దు రక్షణ వరకు ప్రతిచోటా, ప్రతి రంగాన్నీ ఏలుతున్నది. సేద్యానికీ సాయపడుతున్నది. మనం ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. కానీ ఎనిమిదేండ్ల క్రితం నుంచీ ద్రోణాచార్యుడిలా.. డ్రోన్ల మీద గురిపెట్టాడు ‘గరుడ ఏరోస్పేస్’ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాశ్. డ్రోన్ వినియోగం పెరిగేకొద్దీ గరుడ వ్యాపారమూ విస్తరించింది. నాలుగువందలకుపైగా క్లయింట్స్ ప్రభుత్వ సంస్థలే. ఆ వృద్ధి ఇన్వెస్టర్లను ఆకర్షించింది. పెట్టుబడుల వరద ప్రవహిస్తున్నది. ‘ప్రతి వ్యాపారంలోనూ ఓ సామాజిక కోణం ఉంటుంది. ఉండాలి కూడా. రకరకాల కారణాలతో అడవులు అంతరించిపోతున్నాయి. పర్యావరణం సంక్షోభంలో చిక్కుకుంటున్నది.
ఈ సమస్యకు డ్రోన్ టెక్నాలజీలో పరిష్కారం ఉంది. మేం మహారాష్ట్ర, తమిళనాడులో డ్రోన్ సాయంతో లక్షల విత్తనాల్ని వెదజల్లాం. డబ్భు అయిదువేల మొక్కలకు జీవం పోశాం’ అని చెబుతాడు అగ్నీశ్వర్. ఆ యువకుడి తాజా లక్ష్యం అంతరిక్షం. ఉపగ్రహాల ప్రయోగానికి అనువైన డ్రోన్లను తయారుచేయడం. ఆ ప్రయత్నంలోనూ దూసుకుపోతున్నది గరుడ ఏరోస్పేస్. ఏ పనినైనా పట్టుదలతో ప్రయత్నించడం అగ్నీశ్వర్కు కొత్తేమీ కాదు. తను పుట్టడమే ఊపిరితిత్తుల సమస్యతో పుట్టాడు. మిగతా పిల్లలతో పోలిస్తే.. ఇరవైశాతం సామర్థ్యంతోనే లంగ్స్ పనిచేసేవి. సాధనతో ఆ పరిమితిని అధిగమించాడు. స్విమ్మింగ్ చాంపియన్ అయ్యాడు. ఇప్పుడు బిజినెస్ హీరోగానూ అవతరిస్తున్నాడు. ఈ ఏడాది ఎలాగైనా ఐపీవోకు వెళ్లాలన్నది ఈ చెన్నై యువకుడి వ్యాపార వ్యూహం. అన్నట్టు తను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు. అంతకుమించి, భారతీయ మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. కాబట్టే, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీని కూడా డ్రోన్ వ్యాపారంలోకి లాగాడు. అతని పేరు మీద డ్రోన్ కెమెరాను విడుదల చేశాడు. ‘ఏ కంపెనీకైనా ఐపీవో అనేది ఓ పెద్ద కల. దాన్ని నిజం చేసుకునే ప్రయత్నం మొదలైంది. సాంకేతికత, సామాజిక బాధ్యత ఈ రెండూ మా సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. స్టార్ మార్కెట్లో మా విజయానికి కూడా ఆ విశ్వసనీయతే కారణం అవుతుంది’ అంటాడు అగ్నీశ్వర్.
వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఖర్చులు పెరుగుతున్నాయి. కూలీల కొరత ఇబ్బంది పెడుతున్నది. ఈ సమస్యకు సాంకేతికతలో పరిష్కారం ఉంది. గరుడ ఏరోస్పేస్.. డ్రోన్ ఆధారిత సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఐపీవో ద్వారా మా పరిధిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
-అగ్నీశ్వర్ జయప్రకాశ్ గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు
అమిత్ రమానీ.. కొంతకాలం అమెరికాలో పనిచేశాడు. తిరిగివచ్చే సమయానికి ఇక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయి. కొత్తకొత్త స్టార్టప్స్ వచ్చేశాయి. చిన్నచిన్న పరిశ్రమలు చాలానే పుట్టుకొచ్చాయి. అలా అని పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. చాలా కంపెనీలు పాలపండ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. ఉనికి చాటుకోడానికి ఆరాటపడుతున్నాయి. ఆ దశలో సొంతంగా ఓ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం తలకుమించిన భారం. ఎలాగోలా ఓ ఆఫీసు సిద్ధం చేసుకున్నా.. ఏసీ, కాన్ఫరెన్స్ రూమ్, ఇంటర్నెట్, కెఫెటేరియా తదితర సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి. ఆ పరిమితినే ఓ వ్యాపార అవకాశంగా మార్చుకున్నాడు అమిత్. ‘మాది ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ. పది నిమిషాల్లో మీకంటూ ఓ చాంబర్ ఇచ్చేస్తాం. మీరు ఏకవ్యక్తి సైన్యం కావచ్చు. మీకంటూ పదిమంది సిబ్బంది ఉండొచ్చు’ అంటాడు అమిత్. ఆ తర్వాత చాలామంది ఈ ఐడియాతో వచ్చినా.. మేనేజ్మెంట్ భాషలో చెప్పాలంటే ‘అటాకర్స్ అడ్వాంటేజ్’ అమిత్‌నే అగ్రస్థానంలో నిలిపింది. ఇన్వెస్టర్లు వరుసకట్టారు. వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం Awfis (ఆఫీస్) సంస్థకు.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలలో నలభైరెండు వేల సీట్లు ఉన్నాయి. ‘వాట్ నెక్ట్స్?’ అనే ప్రశ్నకు ‘చలో.. ఐపీవో’ అనే జవాబిస్తున్నాడు అమిత్. ఆ నిర్ణయానికి తిరుగులేదు. ఎందుకంటే, అమిత్‌కు ఘన విజయాలే కాదు ఘోర వైఫల్యాలూ తెలుసు. మొత్తం ఎనిమిది కంపెనీలు పెట్టాడు. ఏడు పత్తాలేకుండా పోయాయి. ఓ దశలో ‘ఆమ్లా షాట్స్’ పేరుతో ఉసిరితో కనకవర్షం కురిపించాలని చూశాడు. వర్కవుట్ కాలేదు. ఓడి గెలిచినవాడిని ఎవరూ ఆపలేరు. ఓ మేనేజ్మెంట్ గురువు అన్నట్టు.. ‘రాత్రికి రాత్రే ఎవరూ విజేత కాలేరు. అయినా విజేతగా నిలిచారంటే.. ఆ రాత్రి దశాబ్దకాలమంత సుదీర్ఘమైనదై ఉంటుంది’. నిజమే, అమిత్ ఐపీవో స్థాయికి రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది.
ఆఫీసు కోసం ఓ పెద్ద భవనాన్ని కొనే శక్తి కానీ, లీజ్‌కు తీసుకునే ఓపిక కానీ చాలా సంస్థలకు లేదు. సాధ్యమైనంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం నిర్వహించాలనేది నవతరం ఆంత్రప్రెన్యూర్స్ ఆలోచన. ఆ ప్రయత్నంలో మేం సహకరిస్తాం.
– అమిత్ రమానీ, Awfis, ఫౌండర్
పసిబిడ్డ తొలి ఏడుపు తల్లికి అపురూపం, తండ్రికి అద్భుతం. ఆ కేర్కేర్లు వినిపించగానే అమ్మ ప్రసవ వేదనను మరిచిపోతుంది. నాన్న తొమ్మిది నెలల నిరీక్షణ ఫలిస్తుంది. కాబట్టే, పసిపిల్లల దుస్తులతో ముడిపడిన వ్యాపారానికి ‘ఫస్ట్ క్రై’ అని పేరు పెట్టారు అమితవ్ సాహా, శుభం మహేశ్వరి. స్టార్టప్ ఆలోచనకు మూలం మాత్రం మహేశ్వరి జీవితానుభవంలోనే ఉంది. కొడుకు పుట్టగానే.. బిడ్డ కోసం చాలా షాపింగ్ చేయాలని అనుకున్నాడు. ఆఫ్‌లైన్‌లో వైవిధ్యం తక్కువ. ఆన్లైన్లో అయితే అసలు నాణ్యతే లేదు. దీంతో తానే రంగంలో దిగాలని నిర్ణయించాడు. ప్రపంచ మార్కెట్లోని అత్యుత్తమ ఉత్పత్తులను కస్టమర్స్‌కు అందించాలని తీర్మానించాడు. మిత్రుడు అమితవ్ భాగస్వామిగా ఉండటానికి ముందుకొచ్చాడు. ఆన్లైన్లో మొదలుపెట్టి ఆఫ్లైన్కూ విస్తరించారు. ఫ్రాంచైజీ మాడల్నూ అనుసరిస్తున్నారు. బాలింతలకు ఫస్ట్‌క్రై తరఫున గిఫ్ట్ ప్యాక్ ఇచ్చేలా వివిధ హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రత్యేక ఏర్పాటు వల్ల ప్రచారం పెరిగింది. లాభాలు రెట్టింపయ్యాయి. యాజమాన్యం ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ కింద సిబ్బందికి మూడుశాతం వాటాలనూ కేటాయించింది. రేపు ఐపీవోకు వెళ్తే వాళ్లంతా కుబేరులు కావడం ఖాయం. ‘సంపద పెంచుకోవడమే కాదు, పంచుకోవడమూ తెలుసు మాకు’ అంటారు అమితవ్, శుభం.
కన్నవాళ్లు తమ కోసం తాము ఖర్చు పెట్టుకోరు కానీ, తమ పిల్లల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ఫస్ట్‌క్రై విజయ రహస్యం కూడా అదే. ఇక పబ్లిక్ ఇష్యూ అనేది ఏ సంస్థకైనా ఓ మైలురాయే.
– శుభం మహేశ్వరి వ్యవస్థాపకుడు, ఫస్ట్ క్రై
మాజేటి శ్రీహర్ష చిరుపొట్టతో భోజనప్రియుల బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తాడు. ఆ మాటకొస్తే తను ఆరగించని రుచులు, తనకు ఆసక్తిలేని రంగమంటూ లేకపోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తాడు. ఫొటోగ్రఫీని ప్రేమిస్తాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా ప్రయాణిస్తాడు. మహా స్వేచ్ఛాజీవి. కాబట్టే, బిట్స్ పిలానీ చదువు గుదిబండలా అనిపించింది. పెట్టేబేడా సర్దుకుని సొంతూరు విజయవాడ వచ్చేశాడు కూడా. కన్నవారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మళ్లీ క్యాంపస్‌కు వెళ్లాడు. అది వేరే విషయం. అక్కడే నందన్‌రెడ్డి పరిచయం అయ్యాడు. నందు రాయలసీమ బిడ్డ. అనంతపురం నివాసి. తను కూడా ‘హమారా.. కెమెరా’ అంటూ అడవులు పట్టుకుని తిరిగే రకమే. పట్టా చేతికొచ్చాక చాలా కొలువులే చేశాడు నందన్. హర్ష ఐఐఎమ్ కోల్‌కతాలో చేరిన తర్వాత, లండన్ వెళ్లిన తర్వాత కూడా ఆ ఇద్దరి స్నేహం కొనసాగింది. కొంతకాలానికి మిత్రులను స్టార్టప్ పురుగు కుట్టింది.
ఉద్యోగాలకు రాజీనామా చేసి బెంగళూరు చేరుకున్నారు. ఒకట్రెండు ప్రయోగాలు వికటించాయి. ఆ తర్వాత మొగ్గతొడిగిందే ‘స్విగ్గీ’. అప్పటి వరకూ భారత్‌లో ఆహార రంగంలో ఫుడ్ డెలివరీ సౌకర్యం లేదు. ఉడుపి టిఫిన్స్ మొదలు స్టార్ హోటల్స్ వరకు.. ఎక్కడినుంచి అయినా అరగంటలోపే నచ్చిన ఫుడ్ తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది స్విగ్గీ. తొలుత బెంగళూరు ప్రజలకు పరిచయం చేశారు. మొదటి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. రెండోరోజు ముప్పై వరకూ వచ్చాయి. క్రమంగా ట్రాఫిక్ పెరిగింది. వ్యాపారం అధికమైంది. ఆ తర్వాత స్విగ్గీని దేశమంతా విస్తరించారు. రెస్టారెంట్ వరకు వెళ్లాల్సిన పన్లేదు. టేబుల్ వెతుక్కోవాల్సిన బాధ లేదు. వెయిటర్ కోసం వెయిట్ చేయాల్సిన తలనొప్పీ లేదు. ఒక్క క్లిక్ చాలు. కోరిన రుచులు కాలింగ్‌బెల్ నొక్కేస్తాయి. స్విగ్గీ ఓ రుచుల విప్లవం. ప్రతి ఆంత్రప్రెన్యూర్నూ చిటారు కొమ్మన మిఠాయి స్వప్నంలాంటి ఓ ఆశ ఊరిస్తూనే ఉంటుంది. ఆ ఐపీవో స్వప్నాన్ని నిజం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు హర్ష, నందన్. వందకోట్ల డాలర్ల సేకరణ ఆ ఇద్దరి లక్ష్యం.
అమ్మ, నాన్న ముంబైలో పెద్ద డాక్టర్లు. చిన్నప్పుడే భవిష్ అగర్వాల్ బుర్రలో ఐఐటీ స్వప్నాన్ని ఇన్స్టాల్ చేశారు. కానీ మొదటి ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాడు ఆ కుర్రాడు. దీంతో భవిష్ భవిష్యత్తు అగమ్యంగా మారింది. నిరాశలో కూరుకుపోయాడు. తల్లిదండ్రులు బిడ్డకు ధైర్యం నూరిపోశారు. భవిష్యత్తు నీదేనంటూ భరోసా కల్పించారు. ఆ మనోధైర్యంతో మరుసటి ఏడాది ఐఐటీ-ముంబైలో సీటు సాధించాడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మైక్రోసాఫ్ట్ కొలువు వరించింది. సినిమాలు, షికార్లు, వీకెండ్ ట్రిప్స్.. ఎక్కడికి బయల్దేరినా ట్యాక్సీ సమయానికి వచ్చేది కాదు. వచ్చినా తరచూ తలపొగరు డ్రైవర్లు తగిలేవారు. దీంతో వీకెండ్ మూడ్ మొత్తం ఖరాబైపోయేది. ఇది తన ఒక్కడి సమస్యే కాదనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే ఓలా. ఐఐటీలో సీనియర్ అంకిత్ భాటి ఆ ప్రయత్నంలో భాగస్వామి అయ్యాడు. తొలిరోజుల్లో అన్నీ కష్టాలే, జేబుకు చిల్లులు పెట్టే అనుభవాలే. అయినా ఆ మిత్రులు నిరాశపడలేదు. ఓపికతో వ్యవహరించారు. ఓలాను తిరుగులేని సంస్థగా తీర్చిదిద్దారు. అక్కడితో ఆగిపోతే.. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు అర్థమేం ఉంటుంది. ‘ఓలా ఎలక్ట్రిక్’ పేరుతో కాలుష్య రహిత వాహనాల తయారీ రంగంలోకి వచ్చారు. అతితక్కువ కాలంలోనే ఓలా ఈవీ స్కూటర్ బ్రాండ్‌గా ఎదిగింది. సమీప ప్రత్యర్థి ‘హీరో’ను వెనక్కినెట్టి అసలైన హీరోగా నిలిచింది. సంప్రదాయ డీలర్షిప్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా.. ఆన్లైన్లో బండి బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. డిజైన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అత్యాధునికమైన తయారీ యూనిట్ ఓలా ఎలక్ట్రిక్‌కు మూలస్తంభం లాంటిది. ‘ఇంధనాలతో నడిచే వాహనాలకు కాలం చెల్లింది. ఎలక్ట్రిక్ బండ్లదే రాజ్యం. ఐపీవో ద్వారా సేకరించే నిధులతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాం. అయినా, భారత్‌కే ఎందుకు పరిమితం కావాలి?’ అంటున్నాడు భవిష్ అగర్వాల్.
క్రెడిట్‌కార్డుతో మహా అయితే ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ చేసుకుంటాం. కానీ, అంతకుమించిన ఆప్షన్స్ ఉన్నాయంటూ ‘కమర్షియల్ క్రెడిట్ కార్డ్స్’ వ్యవస్థకు ఊతమిచ్చింది ‘పేమేట్’. ఇదొక మొబైల్ బేస్డ్ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. దీని వ్యవస్థాపకులు అజయ్ ఆదిశేషన్, విశ్వనాథన్ సుబ్రమణియన్. ఈ మనీ మెజీషియన్ల ఐపీవో కల ఈ ఏడాది నెరవేరే ఆస్కారం ఉంది. మొబైల్ వ్యాలెట్ అంటే ఏమిటో కూడా జనానికి తెలియని రోజుల్లోనే గుర్‌గ్రామ్ కేంద్రంగా ‘మొబీక్విక్’కు రూపం ఇచ్చారు బిపిన్ప్రీత్ సింగ్, ఉపాసనా టాకు. అంతేకాదు, తన కస్టమర్లకు తక్షణ రుణాలూ మంజూరు చేస్తుంది. బీమా సేవలనూ అందిస్తున్నది. డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండనే ఉంటాయి. ‘ఆర్థిక విషయాల్లో ఇదో ఆత్మీయ నేస్తం’ అంటాడు బిపిన్. తను ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ‘జనాగ్రహ’ అనే ఎన్జీవోలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఉపాసన స్టాన్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్. ఈ సంస్థ తక్షణ గురి.. ఐపీవో. బ్రేక్‌ఫాస్ట్ నుంచి సెలూన్ సేవల వరకూ సర్వమూ గడప దగ్గరికే వస్తున్నప్పుడు, వైద్య సేవల కోసం మాత్రం దవాఖానలు, ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్న ఓ స్టార్టప్ ఆవిర్భావానికి కారణమైంది. అలా ప్రశ్నించిన వ్యక్తి మీనా గణేశ్. అప్పుడు ఆవిర్భవించిన సంస్థ.. పోర్టీ. ప్రాథమిక ఆరోగ్య సేవల్ని మరింత నాణ్యంగా, ఇంకొంత చౌకగా అందించాలన్నదే తమ లక్ష్యమని చెబుతారు మీనా. ఆరుపదుల వయసులోనూ అలసట తెలియని సీరియల్ ఆంత్రప్రెన్యూర్ ఆమె. కాలు మోపిన ప్రతి రంగంలోనూ ఘన విజయం సాధించారు. దీంతో ఆమె నేతృత్వంలో రానున్న ఐపీవోపై కూడా మదుపర్లు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అజయ్ ఆదిశేషన్.. సీరియల్ ఆంత్రప్రెన్యూర్. కలలు కనడం. ఐడియాలు సృష్టించడం. వాటికి రూపం ఇవ్వడం. ఆ సంస్థను ఏ బహుళజాతి సంస్థకో విక్రయించడం.. అతని వ్యాపారం. ఆ వరుసలోని ఒకానొక కంపెనీ.. పేమేట్ ఇండియా. ఇదొక బిజినెస్ టు బిజినెస్ వ్యాపార సంస్థ. వ్యాపార విస్తరణకు ఐపీవో ప్రణాళికలు రచిస్తున్నది.
ప్రతి సంస్థ ప్రయాణమూ సినిమా కథంత ఉత్కంఠభరితం. అనేకానేక మలుపులు, చిన్నాపెద్ద కష్టాలు, ఒకరిద్దరు వ్యవస్థాపకుల జీవితాల్లో రొమాంటిక్ కోణాలు.. బోలెడంత మసాలా! ఆ తళుకు బెళుకుల వెనుక చీకట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఓ పన్నెండు కంపెనీలను తీసుకుంటే.. అందులో ఎనిమిది వరకూ దినదినగండంగానే నడుస్తున్నాయి. వాటి వార్షిక నష్టాలు ఎనిమిదివేల కోట్ల రూపాయల పైచిలుకు. ఫస్ట్‌క్రై, మొబీక్విక్, ఓలా ఎలక్ట్రిక్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. మిగిలినవాటి ఆర్థిక చరిత్ర కూడా ఏమంత ఘనంగా లేదు. కాకపోతే, భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగా కనిపిస్తున్నది. నిజమే, ప్రతి విజయం ఓ కలగానే మొదలవుతుంది. ఏదో ఒకరోజు వాస్తవ రూపం ధరిస్తుంది. బరిలో వంద పందెం కోళ్లు ఉండొచ్చు. అందులో విజేతగా నిలిచేది ఒకటే. అయితేనేం.. మరో సంక్రాంతి రానే వస్తుంది. గెలిచే అవకాశాన్ని మోసు కొస్తుంది. ఏ స్టార్టప్‌కు అయినా ఆశావాదమే అంతులేని ఆస్తి. ఐపీవో రూపంలో అందేది బోనస్ మాత్రమే. పండగ ముగ్గేస్తున్న పడతి చుక్కల్ని కలుపుకొంటూ పోయినట్టు.. జీవితాన్ని, వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. ఇదే సంక్రాంతి సందేశం.