Srinidhi Shetty | ‘కేజీఎఫ్’ జంట సినిమాలతో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సంపాదించుకుంది. దక్షిణాదిన వరుస అవకాశాలను అందుకుంటున్నది. చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’తో కోలీవుడ్‌ను పలకరించిన ఈ భామ నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో టాలీవుడ్లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. అందం, అభినయంతో అలరిస్తున్న ఈ కన్నడ భామ పంచుకున్న కబుర్లు ఇవి..
మోడలింగ్‌లోకి వచ్చాక 2015లో మిస్ కర్ణాటక, 2016లో మిస్ సుప్రానేషనల్, యమహా ఫసీనో మిస్ దివా టైటిళ్లను గెలుచుకున్నా. ఆ సమయంలో నా ఫొటోలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అవి చూసే ప్రశాంత్ నీల్ ఫోన్ చేసి ఆడిషన్స్‌కి పిలిచారు.
నా బాల్యం మంగళూరులో గడిచింది. మా అమ్మానాన్నలు కుశాల, రమేశ్ శెట్టి. నాకు ఇద్దరు అక్కలు అమృత, ప్రియాంక. మా అమ్మ నాకు గొప్ప ఇన్స్పిరేషన్. ఏదైనా అనుకుంటే పట్టుదలతో సాధించాలని చెబుతుండేది. చదువును అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేది. నాకు హీరోయిన్ అవ్వాలని ఉందని అంటే.. ‘అవ్వు.. చూద్దాం’ అనేది. అనుకున్నట్టుగానే నేను సినిమాల్లోకి వచ్చా! కానీ, నా సక్సెస్ చూడటానికి అమ్మ ఇప్పుడు లేదు.
ఎంత చదువుకున్నా, మంచి ఉద్యోగంలో చేరినా, అమ్మ కోరిక తీర్చానన్న సంతోషం ఉన్నా.. ఏదో అసంతృప్తి ఉండేది. సినిమాల్లో నటించాలన్న నా అభిలాష కోరికగానే మిగిలిపోతుందా అనిపించింది. ఆ సమయంలో నా కుటుంబం నాకు సపోర్ట్‌గా నిలిచింది. వారి సహకారంతోనే సినిమాల్లో ప్రయత్నించా.
‘కేజీఎఫ్’లో నటించేటప్పుడు ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. కానీ, విక్రమ్ పక్కన ‘కోబ్రా’ చేస్తున్నప్పుడు డైలాగులు చెప్పడం కష్టంగా అనిపించేది. టేకుల మీద టేకులు తీసుకునేదాన్ని. విక్రమ్ సర్ కూల్‌గానే ఉన్నా… నాకు భయమేసేది. ‘ఇండస్ట్రీకి పనికిరాను, ఉద్యోగమే బెటర్’ అనుకుని వెనక్కి వెళ్లిపోవాలనుకున్నా. నాన్న ఇచ్చిన ధైర్యంతో కష్టపడి డైలాగులు ప్రాక్టీస్ చేసి సినిమా పూర్తిచేశా.
మొదట్లో నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడేదాన్ని. దాంతో చాలామంది నా ఉచ్చారణ బాగాలేదని హేళన చేశారు. ఆ సమయంలో మా అమ్మను గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకునేదాన్ని. తర్వాత చాలా బాగా చేశావన్న పొగడ్తలూ అందుకున్నాను. నేనైతే విమర్శలను, పొగడ్తలను ఒకేలా తీసుకోవడం అలవర్చుకున్నా!
అనారోగ్యంతో మా అమ్మ కన్నుమూసింది. అప్పటికి నాకు పద్నాలుగేండ్లు. నా జీవితంలో అత్యంత కష్టకాలం అది. నాన్న మద్దతుతోనే ఆ బాధలోంచి బయటికొచ్చా. అమ్మలేని లోటు లేకుండా చూసుకున్నారు. అమ్మ చెప్పిందని చాలా కష్టపడి చదువుకున్నా. ట్రిపుల్ఈ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్ సాధించా. బెంగళూరు జైన్ యూనివర్సిటీలో సీటు తెచ్చుకున్నా. బీటెక్‌లో టాపర్‌గా నిలిచా. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. ముంబయిలో జాబ్ జాయినయ్యా.
కరోనా లాక్‌డౌన్‌తో ‘కేజీఎఫ్-1’ విడుదల ఆలస్యం అయింది. కొన్నాళ్లకు రెండో పార్ట్ షూటింగ్ మొదలైంది. ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికి దాదాపు ఏడేండ్లు పట్టింది. మరీ ఎక్కువ కాలం కావడంతో ఇంట్లో వాళ్లు నా కెరీర్ ఇక ముందుకు సాగదు అనుకున్నారు. ‘కేజీఎఫ్-2’లో నా పాత్ర కీలకం కావడంతో మంచి పేరూ, ప్రశంసలూ వచ్చాయి.