వివాహమైన రోజు నుంచి 16 దినాల్లో నూతన వధువు సరి సంఖ్య రోజులో గృహ ప్రవేశం చేయాలి. చతుర్థి, షష్ఠి, చతుర్దశి మినహా మిగిలిన తిథులు అనుకూలం. సోమ, బుధ, గురు, శుక్ర, శని వారాల్లో ప్రవేశం చేయవచ్చు. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 17 నక్షత్రాలు నూతన వధూ గృహప్రవేశానికి ప్రశస్తమని శాస్త్రం చెప్పింది. ముఖ్యంగా నూతన వధూ ప్రవేశం పగటి పూట కూడదు. రాత్రివేళలో గృహప్రవేశం చేయాలని పెద్దల నిర్ణయం.
వివాహం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఆరు నెలల వరకు చెవులు కుట్టడం, ఉపనయనం, తీర్థయాత్రలు, నూతన వ్రతాలు, ఉద్యాపనలు మొదలైన కార్యక్రమాలు చేయకూడదు. సంవత్సర భేదం ఉంటే ఈ కార్యక్రమాలకు నిషిద్ధం లేదని కొందరి అభిప్రాయం.
వధూవరుల జాతకంలో జన్మ లగ్నం నుంచి కుజుడు 2-4-7-8-12 స్థానాల్లో ఉంటే కుజ దోషం. చంద్ర లగ్నం నుంచి, శుక్ర లగ్నం నుంచి ఈ స్థానాల్లో ఉన్నా అది దోషమే! వధూవరులిద్దరి జాతకంలో కుజ దోషం ఉంటే పరిహారంగా పరిగణించాలి. ఒకరి జాతకంలోనే ఉన్నప్పుడు కుజుడు ఉన్న క్షేత్రాన్నిబట్టి పండితులు పరిహారాలు సూచించారు. కుజుడు ఉచ్ఛ, స్వక్షేత్రం, మిత్రక్షేత్రాల్లో ఉంటే దోష పరిహారం. అలాగే కుజ-చంద్ర, కుజ-గురు, కుజ-బుధ యోగం ఉన్నట్లయితే దోష పరిహారం. కుంభ, సింహ రాశుల్లో పుట్టిన వారికి కుజదోషం లేదు.
వృషభ, తుల రాశుల వారికి 12వ స్థానంలో కుజుడున్నా దోషం లేదు. మేష, వృశ్చిక రాశుల వారికి 4వ స్థానంలో దోషం లేదు. మకర, కర్కాటక రాశుల వారికి 7వ స్థానంలో కుజుడున్నా దోషం లేదు. ధనుర్మీన రాశుల వారికి 8వ స్థానంలో దోషం లేదు.
కుజదోషం లేని నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం లేదు.
చేయదగిన పనులు: యాగం, అన్నప్రాసన, వ్యవసాయం, ఉపనయనం, రిజిస్ట్రేషన్, అక్షరాభ్యాసం
చేయకూడని పనులు: సీమంతం, గర్భాదానం (నక్షత్ర ప్రథమార్థంలో చేయవచ్చు), క్షౌర కర్మ, ఔషధ సేవ, ప్రయాణం, వివాహం స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం శ్రేష్ఠం.