“అబ్బాయ్! సై అంటే సై, నువ్వంటే నువ్వనుకోడమే గాని అరమరికలూ తెర మరపులూ ఎరగం మేం మొగుడూ పెళ్ళాలన్నది ఎప్పుడో… అప్పుడే పెళ్ళిపల్లకీలోనే మర్చిపోయాం”
అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. “ఏవైందంటే… లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తూంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగుకి ముడేసివున్న మూట విప్పి పిడికెడు వేరుశనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్లు ఝల్లుమంది. గుండె తీసి యిచ్చినట్టనిపించింది. “తిను తిను. బావుంటాయ్. కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను.” అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు యీ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా. ఓం ప్రథమంగా మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే. పంచుకు తినే రకం అని గురి కుదిరింది. డబ్బు ఏళ్ళు అయినా పల్లకీలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలిక మీద ఉందిరా-” చిరునవ్వు చెమర్చినట్టయింది.
ఒకసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య.“ఎక్కడెక్కడో వున్న పిల్లల్ని పచ్చటి చెట్లలో చూసుకోవడం నేర్పించాడు మీ మావయ్య. ఇన్నేళ్ళ సావాసంలో కావాల్సినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు. బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మావయ్యని చూసుకోగలను. లక్కా బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది. ఇదిగో ఈ లక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని వత్తి ఎన్నాళ్ళుంటుంది!’ నా విస్తళ్ళు అయిపోగానే నేనూ…” ఎక్కిళ్ళు వినిపించాయి.
“ఇన్నీ చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావ్” అని గసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నాకేసి చూసి
“మరి బతుకంటే అదేరా బడుద్దాయ్” అని బోసిగా నవ్వింది.
శ్రీరమణ ‘మిథునం’ కథ నుంచి