సీ॥ అఖిలవత్సరములు నంబుజాక్షీ వియో
గులకు విలంబులో గుణ సముద్ర
యుభయాయనములు గాంతోరు దుర్విధులకు
నుత్తరంబులు విచిత్రోజ్వలాంగ!
ఋతువులన్నియు సుందరీదూరునకు శర
ర్తులు కీరవంశ పాథోధి చంద్ర!
సకల మాసములు యోషారిక్త జనులకు
జ్యేష్ఠంబులమల భూయిష్ఠ చరిత
తే॥ పక్షముల్ రెండు బహుళముల్ ప్రాజ్ఞ తిలక!
తిథులశేషము దశములుద్రిక్త తేజ
వారములు సర్వమును గురువారము లు బ్ర
సూనశరహయ! ప్రియవధూ శూన్యులకును!
ఈ పద్యం సింహాద్రి వేంకటాచార్యులు రచించిన చమత్కార మంజరి అనే మూడు ఆశ్వాసాల కావ్యం లోనిది. ఇటీవల హన్మకొండలో ఒక సాహితీ సమావేశంలో పెద్దలు ఆచార్యులు డాక్టర్ కోవెల సుప్రసన్న గారు ఈ కావ్య ప్రసక్తి తెస్తూ ఈ కవి తెలంగాణ నివాసి అని పేర్కొన్నారు. పేరుకు తగ్గట్టుగా ఎన్నెన్నో చమత్కారాల ప్రోది ఈ కావ్యం.శ్రీకృష్ణుడికి, బృహత్సేన మహారాజు పుత్రిక లక్షణకు మధ్య చిలుక రాయబారం నెరుపుతున్న సందర్భంలో.. కాంతా వియోగంలోని వేదనలను చిలుకకు వివరిస్తున్నాడు కృష్ణమూర్తి.
ఏ దౌత్యంలోనైనా రాయబారిని మచ్చిక చేసుకుంటే సగం పని ముగిసినట్లే. ఇది పాటించకుండా రావణుడు, కౌరవులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కృష్ణుడు అందుకే చిలుకను వివిధ రకాలుగా స్తుతిస్తున్నాడు. గుణసముద్ర, విచిత్రోజ్వలాంగ అంటూ. ఇక పద్యం సరళ సుబోధకంగానే ఉంది. అలా అలవోకగా ఇబ్బంది లేకుండా సాగిపోతుంది.. కాంతా వియోగులకు సంవత్సరాలన్నీ విలంబులవుతాయి (విలంబినీ నామ సంవత్సరం) ఉత్తర దక్షిణ అయనాలు ఉత్తరములవుతాయి. రుతువులు శరర్తులవుతాయి. మాసాలు జ్యేష్ఠములవుతాయి. పక్షాలు బహుళములు, తిథులు దశములు, వారములు గురువారములు అవుతాయి అనుకుంటూ క్రమంగా సంవత్సరాల నుంచి రోజుల వరకు వచ్చాడు కవి.
ఇందులో కవి చేసిన చమత్కారం ఏంటో ఆలోచించాలి. మొదటగా సంవత్సరాలు విలంబులవుతాయి. అంటే మెల్లగా నడిచేవి. అంటే కాంతా వియోగం ఏడాదిని యుగంగా మారుస్తుందని. అయనాలు ఉత్తరములు అవుతాయి. ఉత్+ తరంబులు అంటే దాటలేనంత ఎత్తయినవి అని. ఇక ఋతువులు శరర్తులు. శర అంటే ఐదు, రెల్లు గడ్డి, బాణాలు అనే అర్థాలు ఉన్నాయి. రుతువులలో ఐదవది హేమంతం. చలి ప్రారంభం. అంతేకాక శిశిర రుతువును వెంట తీసుకుని వస్తుంది.
ఇక శరదృతువు సహజంగానే వెన్నెల మాసం కాబట్టి మరింత విరహోద్విగ్నత ఇనుమడిస్తుంది. ఈ సమయంలోనే రెల్లు పూలు పూస్తాయి. ఇక మాసాలు జ్యేష్ఠాలు. జ్యేష్ఠంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అట్టుడికించే తాపం కలిగించేవని భావం. పక్షాలు రెండూ కృష్ణ పక్షాలే. అంధకార బంధురాలు, సుదీర్ఘాలు అని. తిథులన్నీ దశమి తిథులే. దశమిన్ అనే నకారాంత పదానికి శతవృద్ధుడు అనీ దశమీస్థుడు అంటే వృద్ధుడనీ, నష్ట వీర్యుడనీ అర్థాలు ఉన్నాయి. అంటే ఉపయోగం లేనివనీ. ఇక రోజులన్నీ గురువారాలు. అంటే సుదీర్ఘమైనవి, బరువైనవి. అంతేకాక బృహస్పతి వారం. ఈ రోజు దాంపత్య సంయోగం నిషిద్ధం. ఇలా చమత్కార భరితంగా సింహాద్రి వెంకటాచార్యులు రచించారు.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ