‘పెళ్లిసందD’తో వెండితెరపై సందడి చేసిన నటి శ్రీలీల. అందం, అభినయం కలగలసిన ఈ అమ్మడు కెరీర్
విజయవంతంగా సూపర్ డూపర్‌గా సాగిపోతున్నది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది. రవితేజ ‘ధమాకా’తో హిట్ రుచి చూసింది. మూడేళ్ల తర్వాత మళ్లీ రవితేజ సరసన‘మాస్ మహారాజా’తో విజయాన్ని ముద్దాడిన శ్రీలీల పంచుకున్న కబుర్లు ఇవి..
నా చిన్ని కెరీర్లో గుర్తుండిపోయే మంచి పాత్రలు చేశాను. ‘భగవంత్ కేసరి’లో హీరో బాలకృష్ణ గారికి కూతురి లాంటి పాత్రలో చేశాను. కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి పాత్ర చేయొద్దని కొందరు సలహా ఇచ్చారు. కానీ, నటనకు స్కోప్ ఉన్న అలాంటి రోల్ చేయడం నాకు చాలెంజింగ్ అనిపించింది. ఇక ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తోనూ మంచి గుర్తింపు వచ్చింది.
అందరూ డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అంటారు. నేనూ అంతే.. కానీ, డాక్టర్ కావాలనుకున్నాను అయ్యాను. యాక్టర్ మారిన తర్వాత కూడా డాక్టర్ చదువు ఆపలేదు. ఎంబీబీఎస్ పూర్తయిన రోజు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. మరోవైపు నటిగా ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఇంతటి అభిమానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా.
చిన్నప్పటి నుంచి భరత నాట్యం నేర్చుకున్నా. శాస్త్రీయ నృత్యంలో ముద్రలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, హావభావాలకూ అంతే ప్రాముఖ్యం కనిపిస్తుంది. ఎక్కువ, తక్కువ కాకుండా.. సమంగా ప్రకటించాలి. లేకపోతే.. నాట్యం రక్తికట్టదు. అలా నటనలో పరిధులు కూడా నాట్యం ద్వారానే తెలుసుకున్నా.
పవన్ సార్‌తో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నేనూ ఎదురు చూస్తున్నా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే! తమిళంలో చేస్తున్న ‘పరాశక్తి’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో హిందీ సినిమా షూటింగ్ దశలో ఉంది.
‘మాస్ మహారాజా’లో నా కెరీర్లో మంచి సినిమా. నా పాత్ర చాలా జోవియల్‌గా సాగిపోతుంది. పల్లెటూరి అమ్మాయిగా బాగా నప్పావని అందరూ అంటున్నారు. తొలిసారి శ్రీకాకుళం యాసలో సంభాషణలు చెప్పాను. నా బాడీ లాంగ్వేజ్‌కు సిక్కోలు యాస బాగా సూటయింది అంటున్నారు.
ఒక సన్నివేశంలో అద్భుతాలు చేయడం, మరో సన్నివేశంలో తేలిపోవడం ఉండదు. ఆ పాత్ర స్వభావం తెలుసుకోవాలి. ఆ పాత్రకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిని ఆకళింపు చేసుకోవాలి. సీన్లోకి ఎంటర్ అయ్యాక శ్రీలీల కనిపించకూడదు. ఆ పాత్రే కదలాడాలి. అప్పుడే నటిగా సక్సెస్ అయినట్టు. నటన నిరంతరం నేర్చుకునే కళ. ఇక్కడ నిత్య విద్యార్థిగా ఉండాలి.
చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా ఉత్సాహాన్ని గమనించిన అమ్మ నన్నెంతో ప్రోత్సహించింది. డ్యాన్సర్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఎలాంటి స్టెప్ అయినా వేయగలదు అన్న పేరు కూడా ఉంది. ఈ క్రెడిట్ అంతా మా అమ్మకు, నాకు డ్యాన్స్ నేర్పించిన గురువులకే ఇచ్చేస్తాను. డ్యాన్స్ నేర్చుకోవడం నా నటనకు హెల్ప్ చేసింది. సందర్భోచితంగా హావభావాలు పలకించడం నాట్యం వల్లే అబ్బింది.