హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో ‘ఇలాయిచీ మసాలా చాయ్’ తాగని వారుండరు. వంటలకూ, పానీయాలకూ ఈ యాలకులను జోడిస్తే మంచి సువాసన వస్తుంది. యాలకులు, ఏలకులు, ఇలాచీ అని ఒక్కొక్కరు ఒక్కోపేరుతో పిలుస్తారు. యాలకుల్లో పచ్చ యాలకులనీ, నల్ల యాలకులని రెండు రకాలుంటాయి. పచ్చ యాలకులు కొంచెం తియ్యగా ఉంటాయి. నల్ల యాలకులు ఘాటుగా ఉంటాయి. బిర్యానీ, మిఠాయిలు, పానీయాలు, పాన్ తయారీలో యాలకులు ముఖ్యమైన మసాలా దినుసు. అందుకే దీన్ని ‘మసాలా దినుసుల రాణి’ అంటారు. కుంకుమపువ్వు తర్వాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం ఇదే! మన దేశంలో మలబార్ యాలకులనీ, మైసూర్ యాలకులనీ రెండు రకాలున్నాయి.
యాలకుల చెట్టు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరిగే మొక్క. చిన్న పొదలాగా అల్లం మొక్కలా ఉంటుంది. ఆకులు కూడా అచ్చం అల్లం ఆకుల్లా ఉంటాయి. పచ్చని ఆకులతో అలంకరణకు కూడా బాగుంటుంది. నీరు సులభంగా జారే, ఎక్కువ తేమగా ఉన్న మట్టిలో, పాక్షికంగా నీడ ఉన్న వాతావరణంలో యాలకుల మొక్కలు సులువుగా పెరుగుతాయి. వీటి సాగుకి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల వాతావరణం అనుకూలమైనది. ఆరోగ్యవంతమైన తల్లివేరు దుంప నుంచి వచ్చిన పిలక దుంపలను వేరు చేసి ప్రవర్ధనం చేసుకోవచ్చు. గింజల ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు.
ఇది బహువార్షిక మొక్క. యాలకుల పువ్వులను తుంచి టీ డికాక్షన్‌తో కలిపి సేవించవచ్చు. చరక సంహిత, కౌటిల్యుని అర్థశాస్త్ర గ్రంథాల్లో యాలకుల సుగంధ ద్రవ్యం విషయాల ప్రస్థానం ఉంది. శరీరానికి చలువ చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నందున ఆహారంలో, పానీయాల్లో, యధాతథంగాను సేవించడం ఆనవాయితీ. యాలకులకు మరిన్ని సుగంధ ద్రవ్యాలు జోడించిన ‘పాన్ (తాంబూలం)’ సేవనం అతిథి సత్కారాలు, పూజాదికాల్లో నివేదించడం మన సంప్రదాయం.
నోటి దుర్వాసన పోగొట్టడంలో దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒళ్లునొప్పులకి, నాసికా చికిత్సకి, తలనొప్పి, దగ్గుల ఉపశమనానికి సంప్రదాయ చికిత్సకు వీటిని ఉపయోగిస్తారు. యాలకుల పేస్ట్ గాయాలపై, పుండ్లపై లేపనం చేయడం వల్ల త్వరగా మానతాయి. ధనికులు, నవాబులు రాజసానికి ఈ యాలకులను ఎప్పుడూ నములుతూ ఉంటారు. వీటికి ఉదర సంబంధ వ్యాధులకు, కడుపులోని అల్సర్లను తగ్గించే గొప్ప గుణం ఉంది కాబట్టి వారి జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ఎన్నో రుగ్మతలకు ఉపయోగపడే ఈ చిన్న యాలకులను ‘సంజీవని’ వంటివని అనవచ్చు.
g ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు