e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News 1971 ఎంత స్పెష‌లో ! ఒక్క ఏడాదిలోనే ఎన్నెన్ని అద్భుతాలో !!

1971 ఎంత స్పెష‌లో ! ఒక్క ఏడాదిలోనే ఎన్నెన్ని అద్భుతాలో !!

నిమిషాల్లో గంటలు, గంటల్లో రోజులు, రోజుల్లో నెలలు.. సంవత్సరాలు కాలగర్భంలోకి దొర్లిపోతుంటాయి. వెనక్కి మళ్లిన కాలాన్ని అనగనగా అని గుర్తు చేసుకోవడంలో ఓ తృప్తి ఉంటుంది. గడిచిన కాలం ఓ అనుభవాన్నిస్తుంది. భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేస్తుంది. ఎన్నెన్నో ఈవెంట్లను దాచుకున్న 1971లో మెచ్చుతునకలు కొన్ని ఉన్నాయి. వాటిని మరోసారి తలుచుకుందాం..

రచ్చ గెలిచి

క్రికెట్‌ పుట్టింట్లో భారత్‌కు తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయం దక్కింది 1971లోనే. అంతకు ముప్పయ్‌ ఏండ్ల ముందు నుంచి టీమ్‌ ఇండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఉభయదేశాల మధ్య క్రికెట్‌ అనుబంధ వారధిగా నిలిచింది. కానీ, ఎప్పుడు ఇంగ్లండ్‌కు వెళ్లినా ఇండియా సిరీస్‌ ఓడిపోవడమో, డ్రాగా మిగలడమో జరిగేది. ఈ చరిత్ర యాభై ఏండ్ల కిందట మారింది. 1971లో ఇంగ్లండ్‌లో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా అజిత్‌ వాడేకర్‌ వ్యవహరించారు. తొలి రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మూడో మ్యాచ్‌ గెలిచిన వాళ్లే సిరీస్‌ విజేతలు. అది ఇండియా సాధిస్తే అప్పటికి 39 ఏండ్లుగా ఇంగ్లండ్‌పై సిరీస్‌ గెలవాలన్న కల నెరవేరుతుంది.

- Advertisement -

నిర్ణయాత్మక మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆగస్టు19న మొదలైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది ఇంగ్లండ్‌. తొలి ఇన్నింగ్‌లో 355 పరుగులు చేసింది. దీనికి బదులుగా దిలీప్‌ సర్దేశాయ్‌, అజిత్‌ వాడేకర్‌, ఏక్‌నాథ్‌ సోల్కర్‌, ఫారుక్‌ ఇంజినీర్‌ రాణించడంతో ఇండియా మొదటి ఇన్నింగ్‌లో 284 పరుగులు చేయగలిగింది. ఆతిథ్య జట్టు ఆధిక్యం 71 పరుగులు. రెండో ఇన్నింగ్‌ మొదలుపెట్టింది ఇంగ్లండ్‌. 150 పరుగులు చేసిన భారత్‌కు గట్టి లక్ష్యం ముందు ఉంచొచ్చన్నది వాళ్ల ఉద్దేశం. లెగ్‌ స్పిన్నర్‌ చంద్రశేఖర్‌ పూనకం వచ్చినవాడిలా రెచ్చిపోయాడు. సుడులు తిప్పుతూ బంతులు గిరాటేశాడు. ఆయన మాయాజాలంతో క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఏదో పనున్న వారిలా అలా పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ ఇన్నింగ్‌లో చంద్రశేఖర్‌ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా, ఒక రనౌట్‌లోనూ భాగమయ్యాడు. ఫలితంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్‌కు 101 పరుగులకే తెరపడింది. 172 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆదిలోనే గవాస్కర్‌ వికెట్‌ కోల్పోయినా అందరూ సమష్టిగా ఆడి చిరకాల విజయాన్ని అందుకున్నారు. కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌, గుండప్ప విశ్వనాథ్‌, దిలీప్‌ సర్దేశాయ్‌ రాణించడంతో నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది. అలా యాభై ఏండ్ల కిందట ఇంగ్లిష్‌ గడ్డపై తొలి సిరీస్‌ గెలిచింది ఇండియా.

ఈ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌పై మళ్లీ అదే గడ్డపై విజయం సాధించడానికి భారత్‌కు మరో 15 ఏండ్లు పట్టింది. 1986లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలిచింది. తర్వాత 21 ఏండ్లకు 2007 రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో పటౌడీ ట్రోఫీని 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ ఏడాది ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లిన టీమ్‌ ఇండియాకు యాభై ఏండ్ల కిందట మనవాళ్లు సాధించిన విజయం స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

బంగ్లాకు స్వేచ్ఛ

స్వతంత్ర భారత చరిత్రలో 1971 ఇండో-పాక్‌ యుద్ధం ప్రధానమైనది. ఈ యుద్ధం ప్రపంచపటంలో ఓ కొత్తదేశానికి చోటిచ్చింది. పాకిస్థాన్‌కు భారత శక్తిని చాటిచెప్పింది. తూర్పు పాకిస్థాన్‌గా పేరున్న బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించిన ఘనత భారత్‌కు దక్కింది. భారత విమాన స్థావరాలపై దాడి జరిపి కయ్యానికి కాలుదువ్విన పాక్‌కు తగిన రీతిలో బుద్ధిచెప్పింది భారత సైన్యం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్‌ విమోచన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు. ఇదే సమయంలో భారత త్రివిధ దళాల అసమాన పోరాట ఫలితంగా.. 1971 డిసెంబర్‌ 3న మొదలైన యుద్ధం, అదే నెల 16న ముగిసింది. అతి తక్కువ కాలంలో ముగిసిన యుద్ధంగా దీనిని పేర్కొంటారు. ఏటా డిసెంబర్‌ 16న ‘విజయ్‌ దివస్‌’గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.పద్నాలుగు రోజుల యుద్ధంలో త్రివిధ దళాలు కీలకంగా వ్యవహరించాయి. ఈ సమరం ముగిసే నాటికి పాక్‌ సైన్యంలో మూడోవంతు యుద్ధఖైదీలుగా పట్టుబడటం విశేషం. భారత్‌ ధాటికి తట్టుకోలేక పాకిస్థాన్‌ సైన్యాధికారి జనరల్‌ అమీర్‌ అబ్దుల్లాఖాన్‌ నియాజీ 93వేల మంది సైన్యంతో భారతీయ ఆర్మీకి లొంగిపోవడంతో భారత విజయం లాంఛనప్రాయమైంది. 14 రోజులపాటు జరిగిన యుద్ధం భారత్‌ శక్తియుక్తులను ప్రపంచానికి చాటిచెప్పింది.

అర్ద శతాబ్దపు అద్భుతం

తెలుగులో మొట్టమొదటి కౌబాయ్‌ చిత్రంగా పేర్కొన్న ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ 1971లోనే విడుదలైంది. అప్పటికే టాలీవుడ్‌ గూఢచారిగా పేరున్న కృష్ణ మొదటి కౌబాయ్‌ అన్న కీర్తినీ మూటగట్టుకున్నాడు. ఆ ఏడాది ఆగస్టు 27న విడుదలైన ‘మోసగాళ్లకు మోసగాడు’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. తమిళం, కన్నడం, హిందీ భాషల్లోకే కాకుండా ‘ది ట్రెజర్‌’ పేరుతో ఇంగ్లిష్‌లోకి డబ్‌ చేశారు. ఈ ఇంగ్లిష్‌ తర్జుమా చిత్రం ఏకంగా యాభై దేశాల్లో విడుదలవ్వడం విశేషం. స్పానిష్‌ భాషలోకీ అనువదించారు. అప్పట్లో ఈ సినిమా పేరుతో వైకుంఠపాళీ కూడా అమ్మేవారు. ఈ సినిమా స్ఫూర్తితోనే తెలుగులో కౌబాయ్‌ సినిమాలు వచ్చాయి. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ‘మోసగాళ్లకు మోసగాడు’ యాభై ఒడిలోకి చేరుకున్నా, ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూసేవాళ్లు ఎందరో!!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement