సోషల్ మీడియా, డిజిటల్ మీడియా.. ఏదైనా ఒక్కటే లక్ష్యం అదే వ్యూస్, లైక్స్!! ఏం చేసైనా ఇవి తెచ్చుకోవాలి.. పాపులర్ అవ్వాలి. రెవెన్యూ సంపాదించాలి. అయితే, ప్రపంచాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సోషల్ మీడియాలో ఈ రకమైన పెడపోకడ ఎంతవరకూ సరైంది? కేవలం కొన్ని ప్రసార మాధ్యమాల ఆధిపత్యాన్ని తప్పించుకుని, ఎవరికైనా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇచ్చిన సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం వెంపర్లాట ఓ విష సంస్కృతికి దారితీస్తున్నది. టెక్నాలజీ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ ధోరణి వెనక ఒక చీకటి కోణం కూడా ఉంది. ఇప్పుడిదొక వ్యాపారంగా మారిపోయింది. వ్యూస్, లైక్స్, డబ్బుల కోసం విలువల్ని తాకట్టుపెట్టే స్థాయికి చేరింది.
Social Media | ఇన్ఫ్లుయెన్సర్ అంటే మార్గదర్శకుడు కావాలి. కానీ, కొందరు మాత్రం ఈ వృత్తిని తప్పుడు మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. కంటెంట్ క్రియేషన్ అంటే.. కథలు చెప్పడం, సృజనాత్మకంగా ఉండటం, నిజమైన ప్రతిభను ప్రదర్శించడం చుట్టూ తిరగాలి. అయితే.. నేడు బిగ్గరగా, వింతగా మాట్లాడేవారికే ఎక్కువ గుర్తింపు లభిస్తున్నది. గేమింగ్, వినోదం నుంచి రాజకీయ ప్రసంగాల వరకు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ వ్యూస్, లైక్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలను పెంచుకోవడానికి విద్వేషపూరిత ప్రసంగాలు, అసభ్య పదజాలం, తప్పుడు కథనాలను ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. నాణ్యమైన కంటెంట్ కంటే సంచలనం సృష్టించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అల్గారిథమ్‌లు ఎక్కువ ఇంటరాక్షన్ ఉన్న పోస్ట్‌లను ప్రోత్సహించేలా రూపొందిస్తారు. దీంతో ఉన్నపళంగా సంచలనం అయ్యే కంటెంట్ వైరల్ అయిపోతుంది. లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ విజయానికి కొలమానంగా మారాయి. గేమింగ్, కామెడీ, లైఫ్‌ైస్టెల్.. ఏ రంగమైనా సరే ఇన్ఫ్లుయెన్సర్లు అసభ్య పదజాలం వాడటానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి లైంగికపరమైన వ్యాఖ్యల్ని కూడా జోడిస్తున్నారు. దాన్నే వినోదంగా చలామణిలోకి తెస్తున్నారు. శ్రుతిమించిన కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు కలిసి, ఒకరినొకరు తిట్టుకునేలా స్క్రిప్ట్ రాసుకుని, పబ్లిసిటీ సంపాదించుకుంటారు. రాజకీయ నాయకులు, సినిమా హీరోల అభిమానుల్ని రెచ్చగొట్టేలా కంటెంట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలపై తప్పుడు కథనాలు ప్రచారం చేసి, తమ చానెల్‌కు ట్రాఫిక్ తేవాలనే ఫేక్ ఫార్ములాతో ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకొందరైతే నకిలీ అకౌంట్లను సృష్టించి, క్లిక్‌ల కోసం దిగజారుతున్నారు. మరోవైపు కంపెనీలు కూడా నాణ్యతను పక్కనపెట్టి వ్యూస్, ఎంగేజ్మెంట్ ఉన్న వాళ్లకే అడ్వర్టయిజ్మెంట్లు ఇస్తున్నాయి.
అయితే ఇది వ్యక్తిగత సమస్య కాదు. మొత్తం వ్యవస్థాగతంగా మారిపోయింది. ఈ ధోరణికి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రమే తప్పుపట్టలేం. దీనికి వేదికగా మారుతున్న కమర్షియల్ ప్లాట్‌ఫామ్‌లు.. ఇతర సంస్థలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేనా.. ప్రేక్షకులు కూడా ఈ తరహా కంటెంట్‌ని ప్రోత్సహించడం ద్వారా రాబోయే రోజుల్లో జరిగే విధ్వంసాలకు సాక్షులుగా నిలుస్తారు. ఎందుకంటే.. నేటి సోషల్ మీడియాలో విశ్వసనీయత కంటే వివాదాస్పద అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్రాండ్లు, ఇతర సంస్థలు కంటెంట్‌ను పరిశీలించకుండానే ఇన్ఫ్లుయెన్సర్లకు నిధులు ఇస్తున్నాయి. ప్రేక్షకులు కూడా జీబీల కొద్దీ డేటా ఉంది కదా అని.. హానికరమైన కంటెంట్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఈ విష వలయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
సరిచేయవచ్చా అంటే అవుననే చెప్పాలి. ఈ దిశగా అందరూ కలిసి పనిచేయాలి. ఈ తరహా కంటెంట్‌ని తిరస్కరించాలి. నిజమైన టాలెంట్ ఉన్నవాళ్లను మాత్రమే ప్రోత్సహించాలి. ఇన్ఫ్లుయెన్సర్ ఎంత పాపులర్ అని కాకుండా, వాళ్లు ప్రదర్శించే కంటెంట్ విలువను చూసి ప్రమోట్ చేయాలి. తప్పుడు ప్రచారం, అసభ్యకర వ్యాఖ్యలు చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు విద్వేషపూరిత ప్రసంగం, అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలి. ప్రేక్షకులు హానికరమైన సమాచారానికి లైక్‌లు, షేర్లు ఇవ్వకుండా, దానిమీద ఫిర్యాదు చేయాలి. సంస్థలు కూడా విద్వేషం, అసభ్యతతో కూడిన కంటెంట్‌తో డబ్బు సంపాదించే ఇన్ప్లుయెన్సర్లకు మద్దతు ఇవ్వకూడదు. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగిస్తే సమాజంపై సానుకూల ప్రభావం పడుతుంది. కాబట్టి, మంచి కంటెంట్‌నే డిమాండ్ చేయాలి. విష ప్రచారానికి అడ్డుకట్టవేయాలి.
గతంలో ఆమోదయోగ్యం కాని దూషణలు, అవమానాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. తప్పుడు కథనాల ద్వారా ప్రజలు నిజం కాని విషయాలను నమ్మడం మొదలుపెడతారు. వాటి గురించే మాట్లాడుకుంటూ స్టేటస్లు పెడతారు. వ్యక్తిగతంగానూ మీమ్స్, రీల్స్ సృష్టిస్తున్నారు. అందుకే, సోషల్ మీడియా సృజనాత్మకతకు బదులుగా విధ్వంసం సృష్టించే వారిని ప్రోత్సహిస్తున్నది.