మంచు దుప్పటి కప్పుకొని మల్లెపువ్వుల్లా కనిపించే ఊళ్లంటే మనకెంత మోజో! హిమపాతం జలపాతంలా జారుతుంటే బంగారు వర్ణపు కాంతులు పరచుకున్న గదిలో ఓ అంచున కూర్చుని చూడటం ఎంత బాగుంటుందో. కొండల మధ్య పారే నదీ పాయలూ, ఆ అంచున మంచున మునిగిన ముచ్చటైన ఇళ్లూ చూడాలంటే ఏ స్విట్జర్లాండో, యూరపో వెళ్లనక్కర్లేదు. మన హిమాలయాల మధ్య ఉన్న జిస్పా గ్రామం అలాంటి ఎన్నో అందాలకు ఆలవాలం!
మంచు తెరలు కమ్మే చలికాలమే మనసు తెర తీసి బయటికి చూస్తుంటుంది. అడుగులు ఎక్కడికో ఒకక్కడికి పోదామంటూ హడావుడి చేస్తాయి. కళ్లు అందాల విందుకు సిద్ధమవుతుంటాయి. అందుకే శీతాకాలం విహారకాలం అనేంతలా పేరుపొందింది. ప్రకృతితో మన విరహానికి స్వస్తి పలికే సమయమూ ఇదే. ఇక, మంచు మీద మనసు పడే వాళ్లకు హిమాలయాలకు మించిన స్వర్గం మరోటి ఉండదు. ఆ పర్వత సానువుల్లో అందంగా ఒదిగిన జిస్పా వ్యాలీ ఈ సమయంలో మరింత మనోహరంగా దర్శనమిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి ప్రఖ్యాతిగాంచిన రోహ్తాంగ్ పాస్‌కు వెళ్లే దారిలో ఉందీ జిస్పా గ్రామం. అటల్ టన్నెల్, బారా లచ్చా లా పాస్‌లతో పాటు సూరజ్ తల్, దీపక్తల్లాంటి స్వచ్ఛమైన సరోవరాలనూ ఈ చుట్టు పక్కల చూడొచ్చు.
సముద్ర మట్టానికి 10,500 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఊరు ఏడాదంతా చల్లగానే ఉంటుంది. హిమాలయాల ప్రాంతంలో ఉండటం వల్ల మలయమారుతాలు, మంచు పొరలను ఏ సమయంలో వెళ్లినా అనుభవించవచ్చు. సుమారు 70-80 ఇండ్లు, 400 దాకా జనాభాతో ఉండే చిన్న గ్రామమే అయినా లేహ్-లద్దాఖ్ వెళ్లే మార్గంలో ఉండటం వల్లా, అందమైన ప్రాంతం కావడం వల్లా ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడ రాత్రి బస చేస్తుంటారు. పర్యాటకుల కోసం ప్రత్యేకించి చిన్న చిన్న కాటేజీల్లాంటివి ఉంటాయిక్కడ. అక్కడి కొండల మధ్య నుంచి భాగా నది వంపులు తిరిగి ప్రవహిస్తూ ఉంటుంది.
ట్రెకింగ్, మౌంటెనింగ్, రివర్‌రాఫ్టింగ్, హైకింగ్లాంటి రకరకాల సాహసక్రీడలకు ఇది నెలవు. సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య వరకూ సగటున 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో హాయిగొలిపే వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతూ జనవరికి -10 డిగ్రీలకు చేరుకుంటాయి. ఈ సమయంలో వెళితే వెన్నెల తునకల్లా రాలే తెల్లని మంచుతో పాటు గడ్డ కట్టిన సరోవరాలనూ చూడొచ్చు. అప్పుడప్పుడూ అటుగా వచ్చి వెళ్లే మంచు చిరుతలు మరో ప్రత్యేక ఆకర్షణ. అందుకే అక్కడికి వెళ్లి వచ్చిన ఎవరైనా జిస్పా మన బ్రాండ్ స్విట్జర్లాండ్ అని అనక మానరు!
15