ఆకాశమెత్తు చమత్కారం.. స్కైడెక్! అమెరికాలోని చికాగో నగరంలో ఉందీ మహాసౌధం. ప్రపంచ పర్యాటకుల హృదయాలను దోచుకుంటున్న ‘విల్లీస్ టవర్’ 103వ అంతస్తులో ఉన్నదీ వ్యూ పాయింట్. చికాగో మహానగరం మొత్తాన్నీ ఒక్క స్కైడెక్ బాల్కనీ నుంచే చూసేయొచ్చు! ఆ అనుభూతిని మనతో పంచుకుంటున్నారు యాత్రా ప్రియుడు పంతంగి శ్రీనివాసరావు.
మనిషికి సహజంగానే భ్రమణకాంక్ష ఎక్కువ. తనకు తెలియని ప్రపంచాన్ని చూడాలని ఆరాటపడతాడు. ఎవరూ చేరని ఎత్తులకు చేరుకోవాలని ఉబలాటపడతాడు. ఎంగిలి దారిని వదిలిపెట్టి.. కొత్త మార్గాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తాడు. అది అతని సహజ జిజ్ఞాస. అదే సముద్ర యాత్రలకు కారణమైంది. కొత్త జాతులు, దేశాల అన్వేషణకు స్ఫూర్తినిచ్చింది. తెలుగువాళ్ల విషయానికొస్తే.. నాలుగైదు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఆమెరికా ప్రయాణాలు.. ఇప్పుడు ఊపందుకున్నాయి. ఏటా లక్షలమంది సందర్శిస్తున్నారు. అక్కడే స్థిరపడినవారు, స్థిర పడాలని ఆశిస్తున్నవారు ఎంతోమంది. నిజంగానే అమెరికా ఓ భూతలస్వర్గం. అనుభూతుల భోషాణం పెట్టె. ఆస్వాదించినంత వారికి ఆస్వాదించినంత. చూసినకొద్దీ చూడాల్సిన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే. అందులో ఒకటి.. స్కై డెక్.
అంతెత్తున మనం. మహామహా సౌధాలు సైతం.. చీమల్లా, దోమల్లా.ఆ ఆనందానుభూతికి వేదిక.. స్కై డెక్. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా 1970 ఆగస్టులో సియర్ టవర్ నిర్మాణం చేపట్టింది అమెరికా ప్రభుత్వం. దాదాపు 44,77,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మించారు. మూడు బేస్మెంట్లపైనే మొత్తం నిర్మాణం సాగింది. 110 అంతస్తుల ఈ సౌధం 1450 అడుగుల ఎత్తు ఉంది. ఈ భవంతి టెలివిజన్ సిగ్నల్స్‌కు అడ్డుపడటంతో చికాగోలో 15 శాతం మంది ప్రజలు ఇప్పటికీ శాటిలైట్ ప్రసారాలు అందుకోలేకపోతున్నారని అంచనా. స్కైడెక్ టవర్‌లో 16 డబుల్ డెకర్ ఎలివేటర్స్ ఉన్నాయి. దీన్ని 1973లో ప్రారంభించారు. తర్వాత కాలంలో భవంతి పేరును ‘విల్లీస్ టవర్’గా మార్చారు. ప్రజలు మాత్రం ‘సియర్ టవర్’ అనీ, ‘స్కైడెక్’ అనే పిలుస్తున్నారు. ఈ స్కైడెక్ పాతిక సంవత్సరాలపాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా విరాజిల్లింది.
ఆనంద శిఖరం అమెరికాలో ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శించే వాటిలో స్కైడెక్ ఒకటి. విశ్వ యాత్రికుల హృదయాల్ని దోచుకున్న ఈ భవన సందర్శనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనుమతిస్తారు. స్కైడెక్లోని 99వ అంతస్తును సమావేశాలు, వివాహాలు, విందులు, వేడుకలు నిర్వహించుకునేందుకు కేటాయించారు. పర్యాటకులు సేద తీరేందుకు స్కైడెక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్నో వసతులున్నాయి. స్కైడెక్ 110వ అంతస్తుపై అబ్జర్వేషన్ డెక్ ఉంది. ఈ అద్భుతాన్ని ఏటా 17 లక్షలకు పైగా పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఇక్కడినుంచి చూస్తున్నప్పుడు పర్యాటకులు మహదానందాన్ని పొందుతారు. పై అంతస్తులో సంచరిస్తుంటే అవ్యక్తానుభూతి కలుగుతుంది. ఆ భవనం పైనుంచి చూస్తున్నంతసేపూ (కనీసం రెండు గంటలపాటు) కాలం ఘనీభవించినట్టుగా ఉంటుంది.
ఆ రోజంతా అదే అనుభూతిలో ఉండిపోతాం!
ఎత్తయిన ప్రపంచం!
ప్రపంచం రోజురోజుకూ మారిపోతూ ఉంటుంది. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నే వాడుంటాడన్నట్లు ఏటా కొత్త ఆకాశహర్మ్యాలు పుట్టుకొస్తున్నాయి. సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆ తీవ్ర పోటీతో అత్యంత ఎత్తయిన భవనాల జాబితాలో స్కైడెక్ 23వ స్థానానికి పడిపోయింది. పశ్చిమార్ధ గోళంలో మాత్రం మూడో ఎత్తయిన భవనంగా నిలిచింది. ఇటీవల అమెరికా పర్యటన తిరుగు ప్రయాణంలో ఈ స్కైడెక్‌ను సందర్శించే అవకాశం కలిగింది. ఆ సమయంలో మా ఆనందం అంబరాన్ని తాకింది. ఈ అద్భుతం వీక్షించడం మా అదృష్టమే! కిందికి దిగగానే.. మళ్లీ మనం మామూలు మనుషులమైపోయిన భావన. గత నిమిషం.. అంతెత్తున. ఈ క్షణం నేలమీద. అదే కదా జీవితం. ఆ చంచలత్వాన్ని పరోక్షంగా గుర్తుచేసింది స్కైడెక్. స్కైడెక్లో ప్రవేశమే ఒక వింత.ఆ వీక్షణ జీవితకాల అనుభవం.
స్కైడెక్లోని ప్రత్యేకత.. గ్లాస్ బాల్కనీ. దీన్ని ‘ద లెడ్జ్’ గా పిలుస్తారు. 103వ అంతస్తులో ఉండే ప్రతి గాజు బాల్కనీ నాలుగు అడుగుల వెడల్పుతో గాలిలో తేలినట్టుగా ఉంటుంది.ఈ బాల్కనీ నేలకు 1353 అడుగుల ఎత్తున ఉంటుంది. పర్యాటకులు ఇక్కడి నుంచి చికాగో నగరాన్ని వీక్షిస్తారు.
-పంతంగి శ్రీనివాసరావు
ఎల్బీ నగర్, హైదరాబాద్