నాగరికతకు మూలాలైన నదులంటే సినారెకు మిక్కిలి పాయిరం. నిజానికి ఆయన పాట ప్రస్థానం, కవిత్వ గమనం వాగులు, నదుల వారసత్వమే. తాను బాల్యంలో జలకాలాడుకున్న సిరిసిల్ల మానేరు వాగును గురించి చెబుతూ ‘మానేరు మా కళ్లకు ముత్యాల పేరు’ అన్నారు. తన నలుగురు కుమార్తెలను ‘గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి’లుగా పిలుచుకోవడం నదులపై ఆయనకున్న ప్రేమను తెలుపుతుంది. అందులోనూ తెలుగు నేలకు జీవధారగా నిలిచిన ‘కృష్ణవేణి’ని అనేకసార్లు కవిత్వం చేశారు సినారె. గేయ కావ్యం ‘నాగార్జున సాగరం’ అందుకు అద్భుత తార్కాణం. నాగార్జున సాగరం కావ్య రచనకు ముందే ఇదే పేరుతో ఆయన గేయ కావ్యాన్ని కూడా రాశారు. ఈ రెండిటిలో వస్తువు కృష్ణానది కావడం విశేషం. కొన్ని సినీ గీతాలలోనూ నాగార్జున సాగరం, కృష్ణవేణి ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి.
‘బంగారక్క’ సినిమలో ‘నా హృదయం నాగార్జున సాగరం.. సాగే ప్రతి తరంగం అనురాగానికి ప్రతిబింబం/ గలగల పారే కృష్ణవేణి తలపులే నా పరుగులు..’ అంటారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే తన ‘అనురాగానికి ప్రతి తరంగం ప్రతిబింబం’ అని ఈ గీతంలో చెబుతారు. ‘నాగార్జున సాగరం’ గేయ కావ్యంలో ప్రతి భాగానికి ‘తరంగం’ అని పేరు పెట్టారు సినారె. ఇక ‘కృష్ణవేణి’ చిత్రం 1974లో చలసాని గోపి నిర్మాణంలో, వి. మధుసూదనరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. కథా నాయకుడు కృష్ణంరాజు, నాయిక వాణిశ్రీ. నాయకా నాయికలు కృష్ణా తీరంలో విహరిస్తూ పాడుకునే ఒక యుగళ గీతాన్ని ‘తెలుగు’తనం ప్రవహించేలా కూర్చారు సినారె. ఆ కృష్ణవేణీ తరంగాల గలగలలను చూద్దాం.
పల్లవి
ఆమె: కృష్ణవేణీ… కృష్ణవేణీ… కృష్ణవేణీ… కృష్ణవేణీ…
కృష్ణవేణి తెలుగింటి విరిబోణీ
అతను: కృష్ణవేణి నా ఇంటి అలివేణి ॥2॥
పల్లవిలోని మొదటి వాక్యం నాయికది. రెండో వాక్యం నాయకునిది. నాయిక కృష్ణను ‘తెలుగింటి విరిబోణీ’ అని సంబోధిస్తే, నాయకుడు ఆమెను ‘నా ఇంటి అలివేణి’ అని అంటాడు. ‘రచన రీత్యా పల్లవి చిన్నదే. కానీ స్వర రచనను బట్టి చూస్తే వరిష్ఠమైందే’ అని సినారె పేర్కొన్నారు. గీతంలోని ఇతర అలల చరణాలను చూద్దాం.
చరణం
ఆమె: శ్రీగిరి లోయల సాగే జాడల
విద్యుల్లతలు కోటి వికసింపజేసేవు
అతను: లావణ్య లతవై నను చేరువేళ
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి
చరణం
ఆమె: నాగార్జున గిరి కౌగిట ఆగి
బీళ్లను బంగారు చేలుగా మార్చేవు
ఆంధ్రావనికే అన్నపూర్ణవై
కరవులు బాపేవు, బ్రతుకులు నిలిపేవు
అతను: నా జీవనదివై ఎదలోన ఒదిగి
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి
అది మాటైనా, పాటైనా, కవిత్వమైన తనదైన ఒక విశేషాన్ని లేదా విలక్షణతను అందులో నిక్షిప్తం చేసి, దానిని మరింత అందంగా కూర్చడం సినారెకు బాగా తెలుసు. తొలి సినిమా ‘గులేబకావళి కథ’ నుంచీ ప్రతి చోట దానిని మనం చూడవచ్చు, వినవచ్చు. ఈ గీతంలోనూ ఒక విశేషముంది ప్రతి చరణంలో మొదటి వాక్యం నాయిక పలుకుతుంది. ఆమె పలికేవన్నీ నదిని గూర్చి, దాని విశిష్టతను గూర్చి. కాగా, నాయకుడు నాయిక పలికిన వాక్యాల విలువను గూర్చి, ప్రేమ, జీవితానికి అన్వయించి పలుకుతాడు. ఇందులోని ‘శ్రీగిరి’ శ్రీ పర్వతం… అదే శ్రీశైలం. మొదటి చరణంలో నాయిక ‘విద్యుల్లతలు’ వెలిగించేవు అంటే, నాయకుడు ‘శతకోటి చంద్రికలు’ వెలిగిస్తావని అంటున్నాడు. నిజానికి కృష్ణానది, శ్రీశైలం పేర్లను వినగానే తెలుగునేలను వెలిగింపజేస్తున్న జలవిద్యుత్తు కూడా గుర్తుకురావడం మామూలే.
రెండో చరణంలోని విశేషం ‘నాగార్జున గిరి కౌగిట ఆగి బీళ్లను బంగారు చేలుగా’ మార్చే జీవధాతువుగా కృష్ణవేణిని కవి వర్ణిస్తాడు. ‘బీళ్లను బంగరు చేలుగా మార్చడం’ నాయిక మాట. దీనికి సమాధానంగా నాయికను ఉద్దేశించి ‘పచ్చని వలపులు’ పండించేదిగా చెబుతాడు నాయకుడు. ఇక్కడ రెండర్థాలు ఒకటి నాయిక పరంగా ఉంటే, మరోటి నదీమతల్లి పరంగా చూడాలి. నాగార్జునసాగర్ కాల్వలు తెలుగు నేలలోని ఒక భాగాన్ని సస్యశ్యామలం చేయడం తెలిసిందే. ‘జీవనది’ అన్ని కాలాల్లో పారేనది అని అర్థం. ఇక్కడ నాయకుని పరంగా నాయిక అతనికి జీవేశ్వరి, ప్రాణేశ్వరి అని కూడా భావం. మూడో చరణం చూద్దాం.
చరణం
ఆమె: అమరావతి గుడి అడుగుల నడయాడి
రాళ్లను అందాల రమణులుగ తీర్చేవు
అతను: ఏ శిల్ప రమణులు, ఏ దివ్య లలనలు
ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి
ఆమె: అభిసారికవై హంసలదీవిలో
సాగర హృదయాన సంగమించేవు
అతను: నా మేని సగమై నా ప్రాణసుధవై
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి
సినారె రచనల్లో కృష్ణవేణి ఒక జీవ కవితా వాహినిగా కనిపిస్తుంది. మూడో చరణంలో బౌద్ధ ధామమైన అమరావతిని, అక్కడి అందాల శిల్పాలను గురించి ప్రస్తావిస్తుంది. ఇక్కడ నాయకుడు మాత్రం చిత్రంగా ‘ఏ శిల్పరమణులు/ ఏ దివ్య లలనలు / నోచని అందాలు దాచిన కృష్ణవేణి’ తన నాయికను కీర్తిస్తాడు. కృష్ణవేణి హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. దీనినే సినారె అందంగా ‘సాగర హృదయాన సంగమించేవు’ అన్నారు. ఇక్కడ కృష్ణవేణిని కవి అష్టవిధ నాయికల్లో ఒకరైన ‘అభిసారిక’గా ప్రస్తావిస్తారు. అభిసరణమంటే వెతుకుతూ వెళ్లడం… సాగరసంగమం కోసం హంసలదీవి దాకా అలా వెళ్లిందన్న భావమూ ఇందులో చూడొచ్చు. ‘నా మేని సగమై నా ప్రాణసుధవై.. నిఖిలము నీవై
నిలిచిన కృష్ణవేణి” అని నాయకుని మాట. సినారె అన్నట్టు ‘నదీపరమైన సంబోధనతో మొదలైన ఈ గీతం సతీపరమైన తాదాత్మ్యస్థితితో ముగుస్తుంది’.
దీనిని సంగీత దర్శకుడు విజయ భాస్కర్ మధ్యమావతి రాగంలో స్వరపరిచారు. ఈ గీతం సాహిత్యపరంగా
కృష్ణవేణి పొంగులా సాగితే, సంగీతం ఆ నదీమతల్లి పరుగులా ప్రవహిస్తుంది.
-పత్తిపాక మోహన్