నాకు ఇద్దరు మగపిల్లలు. మాట వినడం లేదు. మా ఇంటిలోపం ఏమిటి?
– డి. హరిశ్చంద్ర, చౌటుప్పల్.
ఇంటిలోపం.. అలాగే, ఇంటి పెద్దల లోపం కూడా ఉంటుంది. పరీక్షల సమయంలో వాళ్లు గదిలో కూర్చొని చదువుకోవాలి. మనం హాల్లో కూర్చొని టీవీ చూడాలి. పెద్దలు ఇలా ఉంటే.. పిల్లలకు ఎలా మనస్కరిస్తుంది. అనునిత్యం ‘వాళ్లకోసం మనం’ అన్న స్పృహ మనకు ఉండాలి. అలాంటి అవగాహన వారికి అందించాలి. అప్పుడు తప్పక పిల్లలు మనల్ని అనుసరిస్తూనే ఉంటారు. అనుకరణ చిన్ననాటి నుంచి ఉంటుంది కదా! ఆశ్చర్యం ఏంటంటే పెద్దవాళ్లు చేసే ఆరోపణ.. ‘వాళ్లు మమ్మల్ని బాగా చూసుకోవడం లేదు. మమ్మల్ని వృద్ధాశ్రమంలో వేశారు’ అంటూ ఉంటారు. విషయం అదికాదు. మన అమ్మానాన్నలను మనం ఎలా చూసుకున్నాం అన్నది మనం వాళ్లకు చిన్నప్పుడే ప్రాక్టికల్‌గా చూపించాం కదా! ఇక వాళ్లు పెద్దయ్యాక మనం చూపినదే.. వాళ్లు మనకు చూపిస్తున్నారు.
ఇందులో వాళ్ల దోషం ఏంటి? ఇచ్చిన, చూపిన మార్గం అనుసరిస్తున్నదే. వయసులో మనం ఆవేశంతో అమ్మానాన్నలను వారి మాటలను నిర్లక్ష్యం చేసిందే కదా! ఇప్పటి మన అనుభవం. యాభై ఏండ్ల క్రితం వృద్ధాశ్రమాలు, పిల్లలు చూడటం లేదు అనే ఆరోపణలు విన్నామా? లేదు కదా! ‘మీరు తాగకండి. చెడిపోతారు’ అంటూ మనం తాగుతుంటే.. ఏం పాఠం చెబుతున్నట్టు? మనం చెప్పేదా? చేసేదా? ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనం చేస్తూ పోతేచాలు.. చెప్పాల్సిన అవసరం లేదు. అలా ముందు మనం మారాలి. ఇక ఇంట్లో ఈశాన్యం, నైరుతి ఇంటి కటింగ్ వల్ల పెద్దవాళ్ల ఆలోచనలు, పిల్లల మనసులు వక్రతలు పడతాయి. అలాంటి దోషాలు లేకుండా చూడాలి. మన స్థలం, గృహం పవిత్రంగా, మన మనసు ఆదర్శంగా ఉంటే.. ఎవరి మార్గంలో వాళ్లు ఎదుగుతుంటారు. ఎవరి మార్గం వారికి బాధను లేదా ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా మన చేతల్లోనే ఉంది. ఇల్లు అయినా.. ఒళ్లు అయినా!
మేము కొనాలని అనుకుంటున్న ఇల్లు.. ఇంగ్లిష్ అక్షరం ‘సి’ ఆకారంలో ఉంది. అలా ఉండొచ్చా? తూర్పు వీధి ఉంది.
– కె. పద్మ, హస్తినాపురం.
తూర్పు భాగాన్ని తెంపి కట్టడం, ఉత్తరం మధ్య భాగాన్ని కట్ చేసి ఇల్లు నిర్మించడం ఇవాళ ఫ్యాషన్ అయ్యింది. అంతేకాదు.. సింహద్వారాన్ని వెనక్కి జరిపి ఫాయర్ అని కడుతున్నారు. ఇవన్నీ దిక్కుమాలిన పనులు. ఇంటి విషయంలో, ఒంటి విషయంలో ప్రయోగాలు చేయవద్దు. ఏ ప్రాంతంలో పుట్టినా.. మనిషి నిర్మాణం మారదు. అది ప్రకృతి చట్టం. సృష్టి ఆమోదిత్వం మన నిర్మాణంలో ఉన్నపుడే.. అవి నివాసయోగ్యతకు నోచుకుంటాయి. ఎవరు, ఎలా కట్టినా.. అది వారి ఇష్టానికి వదిలివేయాలి. కానీ, అదే శాస్త్రం అని అనుకోవడం అవివేకం అవుతుంది. అలాంటి ఇండ్లను మార్చుకోవాలి. అందుకు అంగీకరించకపోతే.. వదులుకోవాలి. అందాల ఎలివేషన్ చూసి వెల్లకిలా పడొద్దు. జీవితం ముఖ్యం.
ఇండ్ల మధ్య ఉండే రెండు అడుగుల సందు.. పోటు అవుతుందా? రెండూ కలిపి కట్టాలా?
– బి. సత్యనారాయణ, సుచిత్ర.
రెండు ఇండ్ల మధ్య ఒక్క అడుగు, రెండు అడుగులు వదిలి కట్టుకోవడం అనేది ఎవరి ఇంటి ప్రాధాన్యత వారికి ఉండటానికి. ఊళ్లలో కూడా రెండు ఇండ్ల మధ్య ‘షేరు సందులు’ అని వదిలి కడుతూ ఉంటారు. అది శాస్త్ర ఆమోదితం. ఆ సందులు నడకలకు సంబంధించినవి కావు. ఇతర జీవజాలం పోవడానికి, గాలి తిరుగాడటానికి.. అంతేకానీ, వాటిని వీధిపోట్లుగా, సంది పోట్లుగా పరిగణించకూడదు. వీధి వేరు.. రెండు ఇండ్ల మధ్య గ్యాప్ వేరు. అంటుకొని ఇండ్లు కట్టడం మన శాస్త్రంలో లేదు. అది పెద్ద దోషం. ఎవరి వాతావరణం వారికి ప్రత్యేకం. ఏ ఇల్లుకు ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి. నిజానికి ఇండివిజువల్ హౌజ్ అనేది అప్పుడే ఏర్పడుతుంది. ప్రతి ఇల్లు శ్వాస తీసుకుంటుంది. అలాంటి ఆక్సిజన్ విడుదల చేసే స్థలం.. రెండు ఇండ్లకూ ఉండాలి. అది దోషం కాదు.
హాలు పెద్దగా ఉండొద్దా? ఎంతవరకు ఉండాలి?
– బి. రామస్వామి, జోగిపేట.
చాలామంది ఇంట్లో హాలును, డ్రాయింగ్ రూమును వేరుగా చేయడం లేదు. ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి రాగానే.. ఇల్లు పెద్దగా ఉండాలని పెంచుకుంటున్నారు. ఇది చూడటానికి విశాలంగా ఉంటుంది. కానీ, శాస్ర్తానికి సరిగ్గా ఉండదు. ఇల్లు విభజన చేసినప్పుడే దానికి పూర్ణత్వం వస్తుంది. మనిషికి కడుపు-తల-కాళ్లు-చేతులు ఉన్నట్టే.. ఇంటికి డ్రాయింగ్ రూము-హాలు-పడకగది-కిచెన్.. ఇలా గదుల విభజన లెక్క ప్రకారం చేయాలి. డోర్‌లోకి ఎంటర్ కాగానే.. పెద్దగా కనిపించాలి అని డ్రాయింగ్ రూమును పెంచి.. నైరుతిలో బెడ్రూమును కడుతున్నారు. ఇది అపసవ్యంగా ఉండి, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. సంపద నిలవదు. డ్రాయింగ్ రూమును కిచెన్ సైజులో, దాని లైనులో వేరైపోయి.. మధ్యలో హాలు ఎంత వైశాల్యంగానైనా చేసుకోవచ్చు. ప్రతి గది సరైన కొలతలతో ఉన్నప్పుడే.. వాస్తు కుదురుతుంది.