ఒక బెడ్రూమ్ మూల మరో బెడ్రూమ్లోకి రావచ్చా? ఇంట్లో స్థలం సరిపోవడం లేదు.
– కె.వి.త్రినాథ్, ఖమ్మం.
ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి పూర్ణాకారం అనేది ఉంటుంది. చెట్టు ఆకును చూడండి. లేదా ఒక చెట్టునుంచి వచ్చే గింజ (విత్తనం) చూడండి. అది ఉండాల్సిన రీతిలోనే ఉంటుంది. ఓవైపు కొరికినట్టుగా.. రంధ్రంతో.. మూలలు కత్తిరించినట్టుగా ఉండవు. దేని ఆకారం దానిదే! అది అలానే ఉండాలి. ఉంటుంది కూడా! దానినే సృష్టి నిర్మాణ ధర్మం అంటారు. సరిగ్గా శాస్త్రంకూడా ఒక ఇల్లు, ఒక బెడ్రూమ్ ఎలా ఉండాలో.. ఎక్కడ ఉండాలో సూచిస్తుంది. మన వ్యక్తిగత అవసరాలు, అవస్థలు దానికి అనవసరం. కాబట్టి, నిర్మాణ లోపాలు ఉండకూడదు. చాలామంది గదుల విభజన విషయంలో ఇష్టం వచ్చినట్టు ఇరికిస్తూ ఉంటారు. ఒక గదికి ఉపయోగపడే టాయిలెట్‌ను లేదా డ్రెస్సింగ్ రూమ్‌ను మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకొని, దాని ఏదో ఒక మూలను ఆక్రమిస్తుంటారు. తద్వారా ప్రధాన బెడ్రూమ్ ఈశాన్యం లేదా వాయవ్యం లేదా తూర్పు మధ్య భాగం.. ఇలా ఏ దిశ అయినా కట్ అయిపోతుంది. అలా చేసినప్పుడు ఆ రెండు గదుల స్వరూపంలో తేడా వస్తుంది. దాని స్వభావంలో మార్పు వస్తుంది. ఇదంతా మనకు వెంటనే అర్థంకాదు. వేలు తెగినట్టుగా.. ప్రకృతి వెంటనే అరుపులు పెట్టదు. కానీ, రానురానూ అది వైఫల్యాలను సృష్టిస్తుంది. కాబట్టి, ప్రతి గది.. శాస్త్రం చెప్పినట్టు ఉండాల్సిందే!
మా ఫ్లాట్‌లో ఉత్తర – ఈశాన్యంలో టాయిలెట్ ఉంది. అలా ఉండవచ్చా? దానిని మూసి తాళం వేయొచ్చా?
– కె. శ్రీకాంత్, జీడికల్.
తాత్కాలిక మార్పు – శాశ్వత మార్పు.. అని రెండు రకాలు. ప్రతి యజమాని లేదా బిల్డర్ సుఖ, సౌకర్యాలు బాగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. అందుకే, అనేక తప్పులు. ఈశాన్యంలో బెడ్రూమ్ కడతారు. ‘దానికి అటాచ్డ్ టాయిలెట్ లేకపోతే ఎట్లా?’ అని పెడతారు. ‘అయ్యో.. ఈశాన్యంవైపే పూజగది ఉండాలి కదా!’ అని దానికి అంటుకొని పూజగది ఇస్తారు. మళ్లీ.. ‘టాయిలెట్, పూజగది ఒకచోట ఉండొద్దు!’ అంటారు. అప్పుడు టాయిలెట్‌కు రెండు గోడలు కట్టి.. మళ్లీ దాని పక్కనే పూజగది ఇస్తారు. ఇదీ.. నేటి గొప్ప కట్టడాల నిర్వాకం. ఇంటిని తంతులాగా కట్టొద్దు. దేని ప్రాధాన్యతనూ చెడగొట్టవద్దు. కడితే సరిగ్గా స్వస్థానంలో టాయిలెట్ కట్టాలి. అది ఎక్కడ ఉండాలి అనేది ముఖ్యం. ఈశాన్యంలో పడకగది అనేదే ఉండకూడదు.. అని కదా శాస్త్రం మాట. అది మరిచి కట్టడం.. పైగా దానికి టాయిలెట్ పెట్టడం! ముందు ఆ టాయిలెట్‌ను శాశ్వతంగా తీసివేయండి. ఆ గదిని తొలగించి, పడక గదిలో కలపండి. అంతేకానీ, ఆ గదికి తాళం వేసి మూసేయకండి. లేదా ఇల్లు మారిపోండి.
డూప్లెక్స్ ఇంటిలో పూజగది ఏ ఫ్లోర్లో ఉండాలి? ఎక్కడ, ఏ దిక్కువైపు ఉండాలి?
– పి. శ్యామ్, కూరెళ్ల.
రెండు అంతస్తులుగా ఉండే డూప్లెక్స్ ఇల్లును చక్కగా ప్లాన్ చేసుకుంటే పూజాస్థానం తప్పకుండా సెట్ అవుతుంది. చాలామంది కిచెన్ వచ్చే ఫ్లోర్‌లోనే అంటే.. కింది ఫ్లోర్‌లోనే పూజగదిని పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీది మీ ఇష్టం. అయితే, మొదటి అంతస్తులో కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా, అందరూ ఈశాన్యం పూజగది అని ఇంటి ఈశాన్యం మూలలో కడతారు. అలాగే, ఈశాన్యం వైపు ప్రధాన ద్వారం (సింహద్వారం) ఉండాలని, దాని పక్కనే పెడతారు. ఇది సరైన విధానం కాదు. ప్రాక్టికల్‌గా.. ఛత్రశాల భవనం వేరు. నేటి ఇండ్ల నిర్మాణం వేరు. ఇంటికి తూర్పు మధ్యలో అంటే.. ఉచ్ఛంలో లేదా ఉత్తరం మధ్యలో పూజగది కింది అంతస్తులో అయినా.. డూప్లెక్స్ ఇంటి పై అంతస్తులో అయినా పెట్టుకోండి. దైవం తూర్పు లేదా పడమర చూసేలా గదిని నిర్మించండి. దేవుడి గది ఉండాలి కదా అని కట్టొద్దు. అదే గొప్పగా ఉండాలి అని కట్టండి. చక్కగా.. పడకగది కన్నా ఎక్కువ ప్రేమతో కట్టండి. అంత పెద్దది కాకపోయినా సరే!
అపార్ట్మెంట్ మీద సొంత ఇల్లు కట్టుకోవచ్చా?
– వి. శ్రీనివాస్, గద్వాల.
అపార్ట్మెంట్ కట్టారు అంటేనే.. దానికి లిఫ్ట్‌లు, మెట్లు ఇచ్చి ఉంటారు. అంతేకాదు.. ఒక ఫ్లోర్లో రెండు లేదా మూడు ఫ్లాట్లు కట్టినప్పుడు వాటి మధ్య వెంటిలేషన్ కోసం ఓపెన్ టూ స్కై (ఆకాశ స్థానం) వదిలి ఉంటారు. మొత్తం టెర్రస్‌మీద మీ ఇల్లును విశాలంగా కట్టుకోవాలని ప్లాన్ చేశారు అంటే.. ఈ ఖాళీలు, మెట్లు, లిఫ్ట్‌లు.. మీ గృహాన్ని అనేక అవస్థలకు గురిచేస్తాయి. కొన్ని కామన్‌గా వాడతారు కాబట్టి. పైన స్లాబ్‌ను ఖాళీలు లేకుండా ఇంటి మధ్యలో మెట్లు లేకుండా.. ఇంటి గర్భస్థానంలో పిల్లర్లు రాకుండా.. ఇంటి ఈశాన్యంలో లిఫ్ట్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకొని, అవసరంకాని వాటిని సవరించి మీ ఇల్లు కట్టాల్సి ఉంటుంది. అంతేకానీ, ఇంటిని తెంపులు చేసి.. ఒక చక్కని ఆకారం లేకుండా కట్టడం పెద్ద దోషం అవుతుంది. అన్నీ తెలిసిన వారిచేత చూపించుకొని కట్టండి. లేదా మానుకోండి. ఇంటి విషయంలో రాజీపడవద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143