ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. మరి మహిళ విజయం వెనుక? మగవాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పుట్టుకతో అబ్బిన నాయకత్వ లక్షణాలే ఆమె వెన్నంటి నిలిచే విజయ రహస్యాలు. ఐఐఎంలో చదవకపోవచ్చు, హార్వర్డ్ దాకా వెళ్లి ఉండకపోవచ్చు, పీటర్ డ్రక్కర్ లాంటి మేనేజ్మెంట్ దిగ్గజాల పేర్లు విని ఉండకపోవచ్చు. అయినా సరే.. ఆమె నాయకురాలు.. సహజ నాయకురాలు.
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత.. అంటూ మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలురని మనువు ఆనాడే చెప్పాడు. నేటి మహిళలు అది నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఇంటిని చక్కదిద్దటానికే పరిమితమైన అతివల ప్రతిభ నేడు అనేక రంగాల్లో విస్తరిస్తున్నది. అనేక అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహించే స్థితిలో నేటి మహిళలు ఉన్నారు. ఆ మధ్య ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 46 శాతం మంది మహిళలు తమ ప్రతిభా పాటవాలకు పరీక్ష పెట్టే సవాళ్లు ఎదురుకావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 75 శాతం మంది కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటానికి తమ స్కిల్స్ పెంచుకుంటున్నామని తెలిపారు. 79 శాతం మంది మహిళలు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉన్నారని ఆ సర్వేలో తేలింది. సహజ సిద్ధంగా వారిలో ఉండే కమ్యూనికేటివ్, రిలేషన్షిప్ స్కిల్స్‌ని ఉపయోగించుకుని మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు.
ఒక్కసారి ఆవరణ అంతా కలియ చూస్తుంది, వైశాల్యాన్ని ఉజ్జాయింపుగా లెక్కేస్తుంది, నిలువుగా, అడ్డంగా చుక్కలు పెట్టేస్తుంది, మొదటి చుక్క కలుపుతూనే పదో చుక్క గురించి ఆలోచిస్తుంది. ఆ మెరుపునకు, ఒడుపునకు ప్రధాన కారణం.. ఆమె మెదడు నిర్మాణమే. పురుషుడి మెదడులో వివిధ భాగాలు స్వతంత్రంగా పనిచేస్తాయి. వేటికవే నిర్ణయాలు తీసుకుంటాయి. దీంతో ఒక సమయంలో, ఒక అంశాన్ని, ఒక కోణం నుంచే మాత్రమే ఆలోచించగలరు. దీన్ని స్టెప్ థింకింగ్ అంటారు. మహిళ అలా కాదు.. ఆమె మెదడులో వివిధ భాగాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. సాలెగూడులా అల్లుకుపోయే ఈ ఆలోచనా శైలిని వెబ్ థింకింగ్ అంటారు. అందుకే ఆమె ఆలోచనలో విస్తృతి ఎక్కువ. ఒక సమస్యకు పది పరిష్కారాలు ఆలోచిస్తుంది. ఒక చర్యకు వంద ప్రతిచర్యలు ఊహిస్తుంది. మార్కెట్‌ని అంచనా వేయడం, వినియోగదారుల అవసరాలను గుర్తించడం, సిబ్బంది నైపుణ్యాలను పసిగట్టడం మహిళలకు కొట్టిన పిండి. అందుకే వ్యాపార రంగంలో వారు ముందుకు దూసుకు వెళ్లగలుగుతున్నారు.
శాస్త్రవేత్తలు నాలుగు పిట్టలని తీసుకొచ్చి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కించారు. వెంటనే అవి ఆధిపత్యం కోసం కొట్టుకోవడం ప్రారంభించాయి. మరో నాలుగు పిట్టలను తీసుకొచ్చి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కించారు. వెనువెంటనే, అవి తోటి పక్షుల మీద ప్రేమ కురిపించడం ప్రారంభించాయి. పురుషుడు టెస్టోస్టిరాన్ జీవి, మహిళ ఈస్ట్రోజన్ జీవి. ఆ హార్మోన్ల ప్రభావం వారి వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి, కర్ర పెత్తనం, బండ చాకిరిలో పురుషులకే ఎక్కువ మార్కులు. ఓర్పుతో నేర్పుతో చేయాల్సిన పనుల్లో, సృజనాత్మక పనుల్లో మహిళదే పైచేయి. అందుకే క్రియేటివ్ ఫీల్డ్స్‌లో మహిళలు ఎక్కువ శాతం ఉండటం మనం చూస్తున్నాం.
బాధలను తట్టుకునే శక్తి, సమస్యలకు ఎదురొడ్డి నిలిచే ధైర్యం పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ. ప్రాణాలకు తెగించి, నొప్పులను భరించి బిడ్డకు జన్మనిస్తుంది. సృష్టికర్త తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేరుస్తుంది. మహిళలో పట్టుదల కూడా ఎక్కువే. ఏదన్నా అనుకుంటే సాధించి తీరుతుంది. సానుకూల ఫలితాలు వచ్చేంత వరకు ఓపిక పట్టడానికి భూదేవంత సహనం ఉండనే ఉంది. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, వృత్తిగత జీవితంలో కూడా ఈ పట్టుదల, ఓపికతో మహిళ విజయం సాధించగలుగుతుంది.
పురుషులతో పోలిస్తే మహిళల మెదడులో భారీ పదకోశం ఉంటుంది. దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలో ఆమెకు బాగా తెలుసు. కార్పొరేట్ డీల్స్ కుదర్చడంలోనూ, కీలకమైన కాంట్రాక్ట్‌ను ఖరారు చేయడంలోనూ, మొండికేసిన క్లయింట్లను ఒప్పించడంలోనూ ఆ సంభాషణ చాతుర్యం, ఉద్వేగ పూరిత పదకోశం బాగా ఉపయోగపడతాయి.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261