Internet Usage | ఫోన్లో జీబీల్లో డేటా ఉంది.. చూడడానికి నెట్టింట్లో అపరిమితమైన కంటెంట్ ఉంది. ఈ క్రమంలో ఖర్చయ్యే డేటా గురించి ఆలోచించక పోయినా ఫర్వాలేదు కానీ, కంజ్యూమ్ చేస్తున్న కంటెంట్ గురించి అయితే కచ్చితంగా ఆలోచించాలి. ముఖ్యంగా పిల్లలు ఏం చూస్తున్నారో పేరెంట్స్ మానిటర్ చేయాలి. ఇది క్వాలిటీ కంటెంట్.. ఇదేమో డర్టీ కంటెంట్ అనే ఓ సన్నని గీత గీయాలి.. లేదంటే పిల్లల తలరాత చెడిపోవడం ఖాయం. కాదంటారా?
మనం ఏదైనా పోస్ట్ చేయడానికి, షేర్ చేయడానికి ముందు ఒక ప్రశ్నను గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. ‘ఈ షేరింగ్ ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడటానికి తగినదేనా?’ ఈ ఒక్క ప్రశ్న మనల్ని సరైన ఆలోచనా మార్గంలో ఉంచుతుంది. స్వేచ్ఛకు విలువిచ్చే సమాజం.. నేటి తరం పిల్లలను కూడా రక్షించుకోవాలి. డిజిటల్ పౌరులుగా మనం ఇంటర్నెట్ను కేవలం కోరికలను తీర్చుకునే వేదికగా మాత్రమే చూడొద్దు. గౌరవాన్ని పెంచే నాలెడ్జ్ రీసోర్స్‌గా దానిని వినియోగించుకోవడం మనందరి బాధ్యత.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్‌లో ఇంటిల్లిపాదీ కూర్చుని చూడగలిగే వీడియోలు, పోస్ట్‌లు, షోలు మీకు తారసపడుతున్నాయా? ఒకవేళ మీ సమాధానం ‘నో’ అయితే.. దీని గురించి తప్పక మాట్లాడుకోవాలి. నిపుణులుగానో, పాలసీ మేకర్స్గానో కాదు. తల్లిదండ్రులుగా, పౌరులుగా! రేపటి తరానికి మనం ఏం అందిస్తున్నామో… ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే.. అశ్లీలత ఇప్పుడు ఓటీటీ, సోషల్ మీడియా ద్వారా నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి వచ్చేసింది.
తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్లలోనే పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారు. దీంతో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. దీనికి పరిష్కారం కేవలం నిషేధాలు మాత్రమే కాదు.. పటిష్ఠమైన నియంత్రణతోపాటు డిజిటల్ అక్షరాస్యత పెంపొందించుకోవాలి. ఒకప్పుడు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా పెద్దలు వస్తే చానెల్ మార్చేవాళ్లం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ వచ్చేసింది. పిల్లలు వారి చదువుల కోసం ఆ ఫోన్‌ను తీసుకుంటున్నారు. అది వాళ్లను ఎటువైపు తీసుకెళ్తుందో మనకు తెలియడం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్లో పోర్న్గ్రాఫిక్ కంటెంట్ నుంచి బోల్డ్ వెబ్‌సిరీస్‌ల వరకు అన్నీ సులభంగా దొరికేస్తున్నాయి. ఇలాంటి అశ్లీలత మన కుటుంబాలను, ముఖ్యంగా టీనేజ్ పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తున్నదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.
మనం చూసే కంటెంట్ మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. నేడు వర్చువల్ వరల్డ్‌లో అశ్లీల కంటెంట్ పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అల్గారిథమ్స్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని అల్గారిథమ్స్ పక్కగా కంపైల్ అవుతున్నాయి. మీరు ఒక రకమైన కంటెంట్‌ను ఎక్కువ చూస్తున్నారని గుర్తిస్తే చాలు.. అలాంటి వీడియోలు మీకు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. దీంతో పెద్దగా ఇష్టపడకపోయినా సరే, ఇలాంటి వీడియోలను చూసేలా అల్గారిథమ్స్ ప్రేరేపిస్తున్నాయి.
డబ్బు కోసం: లైక్స్, షేర్స్, వ్యూస్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని తెలియడంతో కంటెంట్ క్రియేటర్స్ హద్దులు మీరుతున్నారు. దీంతో అసభ్యకరమైన, అశ్లీలమైన వీడియోలు ఎక్కువైపోయాయి. కుటుంబాల మధ్య దూరం: కుటుంబ సభ్యులు అందరూ వేర్వేరు డివైజ్‌లను వాడుతూ.. ఎవరి డిజిటల్ ప్రపంచంలో వాళ్లు లీనమైపోతున్నారు. దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.
డిజిటల్ ప్రపంచంలో కళకు, అశ్లీలతకు మధ్య ఉన్న గీత చెరిగిపోతున్నది. ఒకప్పుడు నిషేధించిన.. అంటే.. సెన్సార్ చేసిన కంటెంట్‌ను ఇప్పుడు ‘బోల్డ్ నరేటివ్’, ‘వాస్తవానికి దగ్గరగా’ అనే పేర్లతో ఓటీటీల్లో చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. ఇవి కళను ప్రోత్సహించడం లేదు. కేవలం అశ్లీలతను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా, వయసు వారీగా ఫిల్టర్లు లేకుండా వీటిల్లో కంటెంట్ వస్తున్నది. సమాజం కూడా దీనిపై పెదవి మెదపడం లేదు. ముఖ్యంగా సెలెబ్రిటీలు కూడా మౌనం దాలుస్తున్నారు. గతంలో ఓ లీడ్ హీరోయిన్ డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ముక్తకంఠంతో సినీజనాలు అందరూ ఖండించారు. కానీ, ఓటీటీలో మితిమీరి స్ట్రీమింగ్ అవుతున్న అశ్లీల కంటెంట్ విషయంలో కంటెంట్‌పై వారంతా సైలెంట్‌గా ఉంటున్నారు.
ఈ తరహా కంటెంట్ మన జీవితంపై దుష్ప్రభావం చూపుతున్నది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారు. సోషల్ మీడియాలోని ఇన్ఫ్లూయెన్సర్లు చేసే తప్పులను చూసి, వారే సరైనవారు అనుకుని టీనేజర్లు ఫాలో అవుతున్నారు. మరో అడుగు ముందుకేసి వారిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం.. ఎవరికి వారే అన్నట్టుగా మారిపోయిన కుటుంబ వ్యవస్థ. ఒకే టీవీని అందరూ కలిసి చూసి సంతోషపడిన కుటుంబాలు.. ఇప్పుడు తమ తమ డివైజ్‌లలో నచ్చిన కంటెంట్‌ను చూస్తూ దూరమైపోతున్నారు. మరైతే, ఈ తరహా కంటెంట్‌ని ఎలా బ్లాక్ చేయాలి. ఏముంది.. ‘వీటిని బ్యాన్ చేయడమే! పరిష్కారం’ అనుకుంటే పొరపాటే. అదొక్కటే సరిపోదు. ఎందుకంటే నిషేధించిన కంటెంట్‌ను కూడా వెతికి చూడొచ్చు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, కఠినమైన నియంత్రణ అవసరం. ప్రభుత్వమే.. పకడ్బందీ నియమావళి ఏర్పాటు చేసి, పక్కాగా అమలు చేయడం అనివార్యం.
అనిల్ రాచమల్ల,
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్