ఒకప్పుడు తనదైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల నోట జోర్దార్ హీరోయిన్ అనిపించుకున్నది జ్యోతిక.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్రేమ, పెండ్లి, పిల్లల కారణంగా కొన్నాళ్లు తెరకు దూరమైంది.
మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి ప్రధాన పాత్రలే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అదరగొడుతున్నది. వరుస అవకాశాలతో ఇటు దక్షిణాదిలో, అటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నది. తాజాగా ‘శ్రీకాంత్’ సినిమాలో టీచర్‌గా పాఠాలు బోధించిన జ్యోతిక సక్సెస్ కోసం కంఫర్ట్ జోన్ దాటాల్సిందేనని జీవిత పాఠాలూ చెబుతున్నది…
ఈరోజుల్లో పిల్లలకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు, కెరీర్‌ను నిర్ణయించుకునే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అందుకే ఒక తల్లిగా పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. నేను మళ్లీ నటించడానికి ప్రధాన కారణం సూర్య ప్రోత్సాహమే. ఇంట్లో అన్ని విషయాలూ చర్చిస్తాం. ఇద్దరి సినిమాల గురించీ మాట్లాడుకుంటాం. మాకు సరిపోయే కథ వస్తే కలిసి
నటించడానికి ఇద్దరం సిద్ధమే!
పెండ్లికి ముందు, తర్వాత జీవితం వేరేగా ఉంటుంది. కెరీర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కష్టపడాల్సిందే. అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే పెళ్లి తర్వాత కూడా ప్రతి మహిళా రాణిస్తుంది. పరస్పర సహకారం, గౌరవం, నమ్మకం బంధాన్ని దృఢంగా మారుస్తాయి. ఒకరి అభిప్రాయాలకు ఒకరు తప్పకుండా విలువ ఇవ్వాలి.
బాలీవుడ్లో నటించేందుకు కాదు.. కొవిడ్ తర్వాత అమ్మానాన్నల్ని చూసుకోడానికి, పిల్లల చదువుల కోసమే ముంబయి వెళ్లాం. నాలుగు భాషల్లో కథలు వింటున్నా. మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగులోనూ చేస్తా. పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటూ వయసుకు తగిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. స్ఫూర్తిదాయక సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇష్టం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో బ్రేక్ పడుతుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు. కంఫర్ట్ జోన్ దాటి కష్టపడాలి. అప్పుడే సక్సెస్ దక్కుతుంది. లక్ష్యాన్ని సాధించాలంటే ఎలాంటి అడ్డదారులూ ఉండవు.. హార్డ్‌వర్క్ ఒక్కటే మార్గం.
ఎన్ని సినిమాలు చేసినా కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను నటించిన చంద్రముఖి ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నది. అందుకే రొటీన్‌కి భిన్నంగా స్ఫూర్తినిచ్చే పాత్రలకే మొగ్గు
చూపుతాను. నిజ జీవితంలో తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కారణంగా ఆ జానర్, వయసు పాత్రల్లో నటిస్తే పెద్దగా కష్టపడే పని ఉండదు. ఎందుకంటే ఒక తల్లిగా ఆ ఎమోషన్ని నేను అర్థం చేసుకోగలను. శ్రీకాంత్ సినిమాలో టీచర్‌గా నటించా. ఒక మెంటర్‌గా మోటివేట్ చేయడం ఓ తల్లికి కష్టమైన పనేం కాదు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో నార్త్, సౌత్ తేడా లేదు. తెలుగు పరిశ్రమ నేషనల్ హిట్స్‌ని అందించి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక్కడి హీరోలు బాలీవుడ్లో నటిస్తున్నారు, వాళ్లు దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. హీరోలు, హీరోయిన్లే కాదు దర్శకులు, ఇతర టెక్నీషియన్లు కూడా ప్రాంతాలకు అతీతంగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో సౌత్, నార్త్ అనడం కంటే ఇండియన్ సినిమా అంటే బాగుంటుంది.