బుల్లితెర ప్రేక్షకులను అలరించి వెండితెరకు పరిచయమైన మలయాళీ ముద్దుగుమ్మ సంగీర్తన విపిన్. ఆచితూచి కథలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఈ భామ తాజాగా ‘జనక అయితే గనక’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. బాలనటిగా పరిశ్రమలోనే ఎదిగినా తనకూ తిరస్కరణ తప్పలేదంటున్నది ఈ కేరళ బ్యూటీ. టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటున్న అందాల భామ సంగీర్తన పంచుకున్న కబుర్లు..
చిన్నప్పటి నుంచి నటన అంటే నాకు చాలా ఇష్టం. నాటకాలతో మొదలైన నా నట ప్రయాణం.. బుల్లితెరపై సుదీర్ఘంగా సాగింది. ఇప్పుడు వెండితెరపై రాణించేందుకు ప్రయత్నిస్తున్నా. తెలుగులోనూ మూడు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించా. ‘జనక అయితే గనక’ తెలుగులో హీరోయిన్గా నా మొదటి సినిమా.
సినిమాల్లో నటించడాన్ని ఇష్టపడినా బుల్లితెరకు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమాతో పోలిస్తే టీవీ ప్రేక్షకులు చాలా గాఢంగా అభిమానిస్తారు. ఎందుకంటే టీవీ కార్యక్రమాలు ఎక్కువ కాలంపాటు వాళ్లని అలరిస్తాయి. వేదిక ఏదైనా ఒక నటిగా ఇంతమంది అభిమానం చూరగొనడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా.
కథ విన్నప్పుడు లోతుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. నేపథ్యం, ప్రేరణ, పాత్రల ప్రాముఖ్యాన్ని బట్టి కథలను ఎంచుకుంటాను. కొత్త పాత్రలో నటించే ముందు ధ్యానం చేసి పూర్తిగా ఆ పాత్రలో లీనమయ్యేందుకు సిద్ధమవుతాను. పాత్రపై దృష్టి పెట్టేందుకు ధ్యానం ఉపయోగపడుతుంది.
నటన ద్వారా ఒక కథను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడం నన్ను ఆకర్షించే విషయం. నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది. ముఖ్యంగా మా అమ్మ నా బలం. పరిశ్రమలో ఒక నటిగా గుర్తింపు సాధించాలంటే చాలా అవరోధాల్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమ్మే నాకు అండగా నిలిచింది. ‘నువ్వు సాధించగలవు’ అని ఎంతగానో ప్రోత్సహించింది.
డ్రామా అయినా, థ్రిల్లర్ అయినా ఎమోషనల్‌గా చాలెంజ్ చేసే పాత్రలంటే నాకు చాలా ఇష్టం. హిస్టారికల్ డ్రామాలో భాగం కావడం నా డ్రీమ్. వేరే యుగంలోకి అడుగు పెట్టి ఆ కథలకు ప్రాణం పోయడంలో ఏదో అద్భుతం ఉంది. నేను చాలా సినిమాలు చూస్తాను, వర్క్‌షాప్‌లకు హాజరవుతుంటాను. నా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నిరంతరం కృషి చేస్తాను.
నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి. అదే నన్ను యాక్టింగ్ వైపు నడిపించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి తగిన ఆత్మవిశ్వాసం అందించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నమ్మకం సడలకుండా ప్రయత్నించడం వల్ల ఫలితం ఉంటుందని నమ్ముతాను. తిరస్కరణకు గురైనా ఎప్పుడూ ఫీలవ్వలేదు.
ఏ వృత్తిలో అయినా కొన్నిసార్లు తిరస్కరణ ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో తిరస్కరణ సర్వసాధారణ విషయం. నేను చాలాసార్లు రిజెక్ట్ అయ్యాను. కానీ, ఆ తిరస్కరణలే నన్ను మరింత బలంగా మార్చాయి. నాలో పట్టుదలను పెంచాయి.
మాటలు లేకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించేదే చిత్రలేఖనం. ఇది కూడా నటనను పోలి ఉంటుంది. అందుకే పెయింటింగ్ అంటే చాలా ఇష్టం! ఇది నాకు ఒక చికిత్సలా పనిచేస్తుంది. ప్రయాణాలు, కొత్త సంస్కృతులను అన్వేషించడాన్ని కూడా ఇష్టపడతా. పెయింటింగ్, బుక్ రీడింగ్ నా అభిరుచులు. ఖాళీ సమయాల్లో ప్రకృతి ఒడిలో సమయం గడపడానికి ఇష్టపడతా.