ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలోనే చేయాలి. వేళ తప్పితే, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సందర్భాలను ఉద్దేశించి జానపదులు చెప్పిన సామెత.. ‘యాళ్లతప్పి భూపాలం పాడుడు’. చేయాల్సిన సమయంలో చేయకుండా, ఎప్పుడు పడితే అప్పుడు.. ఏది పడితే అది చేసేవారికి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ‘యాళ్ల’ అంటే వేళ/సమయం.
‘భూపాలం’ అంటే సంగీతానికి సంబంధించిన రాగం. సాధారణంగా భూపాల రాగాన్ని సూర్యోదయ సమయంలో మాత్రమే పాడతారు. పిల్లనగోవి(వేణువు)తో రాగాన్ని పలికిస్తారు. సూర్యోదయ వేళ ఆ రాగం వినసొంపుగా ఉంటుంది. పైగా సంగీత సాధనకు, రాగాల ఆలాపనకు అది అనుకూల సమయం కూడా. అదే భూపాల రాగాన్ని పడుకునే ముందు పలికిస్తే ఇతరులకు ఇబ్బందే. తెలివి తక్కువవారు, అతిగా ప్రవర్తించేవారు వేళాపాళా లేకుండా ఏదైనా పనిచేస్తే.. ఈ సామెతను ఉపయోగిస్తారు.
కొంతమంది చావుల దగ్గర, కుటుంబ బాధలప్పుడు రాని దుఃఖం తెచ్చుకొని దొంగ ఏడుపు ఏడుస్తుంటారు. అలాంటి సందర్భానికి సరిపోయే పలుకుబడి ‘దత్తపుత్ర శోకం’. ‘ఏ.. ఊకో.. వాడిదంతా ఉత్తి దత్తపుత్ర శోకం. ఎవలన్న జూస్తరని దొంగ ఏడ్పు ఏడుస్తుండు.. అంతే’ అంటుంటారు. ఈ దత్తపుత్ర శోకం ఎట్ల వచ్చిందంటే.. పిల్లలు లేనివారు తెలిసినవారి పిల్లలనో, అనాథలనో దత్తత తీసుకుంటారు. వారిలో చాలామందికి కన్న తల్లిదండ్రులపై ఉన్నంత మమకారం, ప్రేమానురాగాలు పెంచిన వాళ్లపై ఉండవని నమ్మకం. పెంచిన తల్లిదండ్రులు చనిపోతే లోకం నిందిస్తుందన్న భయంతో లేని దుఃఖం తెచ్చుకొని పైపైన ఏడుస్తుంటారు. అలా ఏడవడాన్నే ‘దత్తపుత్ర శోకం’ అన్నారు పెద్దలు. ఇదే ‘దొంగ ఏడుపు’గా ప్రజల నోళ్లలో నానుతున్నది. దత్తపుత్రుడికి నిజమైన విచారం, బాధ ఉండవనే భావన నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. అయితే, కొన్ని అరుదైన సందర్భాల్లో కడుపున పుట్టిన బిడ్డలు బాధపడకపోయినా.. పెంపుడు పిల్లలు మాత్రం
మనస్ఫూర్తిగా ఏడుస్తారు. తమదికాని దగ్గర ఎవరైనా ఉత్తగనే ఏడ్చిన సందర్భంలో కూడా… ‘అంతా దత్తపుత్ర శోకం’ అంటారు అనుభవజ్ఞులు.
కొంతమంది చేయాల్సినదంతా చేస్తారు.. పైకి మాత్రం అమాయకుల్లా నటిస్తుంటారు. సరిగ్గా అలాంటివారిని ఉద్దేశించి చెప్పిన సామెత ‘సత్తెపూస.. సల్లగురిగి’. ఇలాంటి వాళ్లనే ‘నంగనాచి తుంగబుర్ర’ అనికూడా అంటారు. నలుగురిలో కలహాలు పుట్టించడమో, కుటుంబంలో చిచ్చుపెట్టడమో, స్నేహితుల మధ్య గొడవలు సృష్టించడమో తెలివిగా చేస్తుంటారు. కానీ, ఏమీ ఎరగనట్లు నటిస్తుంటారు. సత్తెపూస అంటే సత్యం పలికేవాడు, అమాయకుడు అనే అర్థం ఉన్నా.. ఈ పలుకుబడి వ్యంగ్యాస్త్రంగానే ప్రచారంలో ఉంది. అంటే సత్యవంతుడు కాదని, అమాయకుడు అనే ముసుగు వేసుకున్నాడని అర్థం. అంతా మంచివాడనుకునే ఓ వ్యక్తి.. ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఉట్టి మీది చల్ల (మజ్జిగ)గురిగిని కాజేసి, సత్తెపూస లెక్క ప్రవర్తించిండట. తన అతి ప్రవర్తనతో దొరికిపోవడంతో ‘సత్తెపూస సల్లగురిగి’ అనే సామెత పుట్టుకొచ్చినట్లు చెబుతారు పెద్దలు. తప్పులు చేసేవాళ్లు నీతులు చెబితే.. ‘ఏమ్రో పెద్ద సత్తెపూస లెక్క మాట్లాడుతున్నవ్?’ అని ప్రశ్నిస్తుంటారు.
శిడంపడదు = క్షణం పడదు (మా ఇద్దరు పిల్లలకు శిడం పడదు. ఎప్పుడూ ఏదో ఓ గొడవ. వీళ్ల పోరు తీర్చలేక తలపానం తోకకొస్తుంది)
లాగం = తీరు, పద్ధతి (ఇగో రమేశా.. నీ లాగం అస్సలేం బాలేదు. వద్దన్న పనే మళ్లీ మళ్లీ జేస్తున్నవ్. జర పైలం)
నత్కుడు = నక్కడం, దాక్కోవడం (ఎందుకురా దొంగలాగ అట్ల నత్కుతున్నవ్. ఏం తప్పు చేసినవ్?)
ఎగాదిగా = పైకి కిందికి చూసుడు (ఏమ్రో అట్ల నోరెల్లబెట్టి ఎగాదిగా జూస్తున్నవ్..?)
శలపెయ్య = బలిచ్చేందుకు మేపే లేగదూడ (శలపెయ్య లెక్క మాంచి రంజుగున్నవ్) ( జాతర్లలో దేవతలకు ఎదుర్కోలుగా బలిచ్చే బలమైన పెయ్య లేగదూడ. కొందరు వీటిని ప్రత్యేకంగా మేపుతుంటారు)
– డప్పు రవి