తండ్రి కొరియోగ్రాఫర్ కావడమే ఆ ముద్దు గుమ్మకు కలిసొచ్చింది. తనకిష్టమైన నటనలో రాణించేందుకు తోడ్పడింది. ముంబయిలో పుట్టిన సాక్షి సాగర్ మడోల్కర్ బాలీవుడ్ అవకాశాలను అందిపుచ్చుకుంది. తెలుగులో అడపాదడపా ప్రకటనల్లో మెరిసిన ఈ మరాఠీ అందం.. రోషన్ కనకాల హీరోగా వస్తున్న ‘మోగ్లీ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగువారికి చేరువైన సాక్షి పంచుకున్న కబుర్లు ఇవి..
హీరో విషయానికి వస్తే సుమ కనకాల గారి అబ్బాయి రోషన్ అని తెలిసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. సుమగారి యాంకరింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్. ఆమె ఎనర్జీ లెవల్స్ సూపర్బ్. నేను ఈ సినిమా ఒప్పుకొన్నప్పుడు నాకు తెలుగు ఒక్క ముక్క రాదు. ఇప్పుడు తెలుగులో మాట్లాడేస్తున్నా!
చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు చాలా ఆశ్చర్యం కలిగేది. నా ఊహల్లో ఉన్న కథ అలా తెరపై కనిపించడం అద్భుతం అనుకునేదాన్ని. ఎప్పటికైనా నేను కూడా స్క్రీన్‌పై కనిపించాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. అలాగని చదువు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే.. అవకాశాల కోసం సీరియస్‌గా ప్రయత్నించాను.
నేను అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచే సినిమాలకు దగ్గరగా ఉన్నాను. మా నాన్న సాగర్ మడోల్కర్ కొరియోగ్రాఫర్ కావడంతో.. నా చుట్టూ సినిమా ప్రపంచమే ఉండేది. తెలియకుండానే చిత్రసీమపై అభిమానం ఏర్పడింది. పెద్దగా శ్రమించకుండానే నాన్న నుంచి డ్యాన్స్ వారసత్వంగా అబ్బేసింది. అలాగే యాక్టింగ్ కూడా వచ్చేసింది.
కొన్నాళ్ల కిందట ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశాం. అందులో నేను తిశ్రూలం పట్టుకొని అమ్మోరులా కనిపిస్తాను. ఆ లుక్‌కి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన వచ్చింది. చాలామంది భక్తితో నమస్కరిస్తూ కామెంట్ చేశారు. అవి అందించిన బూస్ట్ అంతా ఇంతా కాదు.
నటనలో అనుభవం పెరిగే కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా స్వీకరించాలి. కొత్త తరహా పాత్రలు చేయాలి. ఆ పాత్రల కోసం మానసికంగానూ సిద్ధమవ్వాలి. పాత్ర లోతు అర్థం చేసుకోగలిగితేనే దానికి న్యాయం చేయగలం అని నేను నమ్ముతాను. ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫార్మ్.. ఇదే నా ఫార్ములా. తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోవాలని ఉంది.
2021లో ‘లైఫ్ ఆఫ్ లైవ్’ వెబ్ సిరీస్‌లో చేశాను. 2022లో ‘జహా చార్ యార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. 2024లో ‘నమకూల్’ వెబ్‌సిరీస్‌లో నటించాను. కొన్ని ప్రకటనలు మినహా.. తెలుగు ఇండస్ట్రీతో నాకు అస్సలు సంబంధం లేదు. ‘మోగ్లీ’ డైరెక్టర్ సందీప్‌రాజ్ సినిమా కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. కథంతా అడవి నేపథ్యంలో సాగుతుంది. వినోదంతోపాటు భావోద్వేగాలూ బాగా ఉన్నాయనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమా నాకు కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందించింది.