భారతావని సంస్కృతికి సజల దృశ్యం గంగానది. సనాతన ధర్మానికి సాక్షిగా యుగాలుగా పారుతూనే ఉన్నది ఈ పావన తరంగిణి. అందుకే గంగానదిలో మునకేస్తే చాలనుకుంటారు చాలామంది. నదులకు నాగరికతకు ఉన్న సంబంధం గురించి చరిత్ర పొడవునా చదువుకున్నదే. కానీ, గంగాజలానికి ఉన్న పవిత్రత గురించి పెద్దగా చదువుకున్నది లేదు. గంగజాల పవిత్రత విశ్వాసమా? వాస్తవమా? అనే సందిగ్ధత ఎంతోకాలంగా ఉన్నదే. హిమశిఖరాలపై నుంచి మొదలై, రాతి కొండలపై నుంచి జాలువారుతూ ప్రవహించే గంగానది ఈ ప్రకృతిలోని అనేక సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలను తనలో కలుపుకొంటూ కిందికి సాగిపోతుంటుంది.
రాతిని కోస్తూ, ఇసుకలో సుడులు తిరుగుతూ కదలిపోతుందీ నది. ఆధ్యాత్మిక కేంద్రాలున్న చోటికి గంగ తరలి రాలేదు. గంగమ్మ పవిత్రత వల్లే ఆ ఈ పుణ్య తీర్థం తీరం వెంట ఎన్నెన్నో క్షేత్రాలు వెలిశాయి. పవిత్రమైన జలంతో ప్రాణాలను కాపాడే గంగను ఆరాధిస్తూ హారతిపట్టి మనిషి కృతజ్ఞత చాటుకుంటున్నాడు. మహమ్మారికి ఊళ్లకు ఊళ్లే మాయమైపోయిన కాలంలో మనిషిని కాపాడుకున్న గంగకు మనం అర్పించే జోతలు ఇవి. బ్రిటిష్ కాలంలోనూ కలరా మహమ్మారి ఊళ్లకు ఊళ్లను ఊడ్చుకుపోయింది. ఆ కాలంలోనూ గంగా తీరాన నివసించే మనిషి బతికి బట్టకట్టాడు.
ఇదేమిటని బ్రిటిష్ పరిశోధకుడు ఎర్నెస్ట్ హన్కిన్ అధ్యయనం చేస్తే.. ఆనాటి మరణాల సంఖ్య గంగ తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అధికంగా, గంగా తీర ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్టు గుర్తించాడు. ఈ లెక్క తేడా తేల్చేందుకు ఆయన అధ్యయనం చేస్తే గంగ నీటిలోని అతి సూక్ష్మ జీవులకు ప్రాణాంతక బ్యాక్టీరియాను అంతమొందించే శక్తి ఉన్నదని గుర్తించాడు. ఈ పరిశోధనను మరింత లోతుగా విశ్లేషించాలని భారత ప్రభుత్వం నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఆదేశించింది.
ఆ మేరకు పరిశోధకులు గంగానదితోపాటు యమున, నర్మదా నదిలోని నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. బ్యాక్టీరియాను హరించే సూక్ష్మాతిసూక్ష్మజీవులను గంగతోపాటు నర్మద, యమునా నదీజలాల్లోనూ గుర్తించారు. అయితే నర్మద, యమునా నది నీటిలో రెండు వందల రకాల బ్యాక్టీరియాని హరించే అతిసూక్ష్మ జీవులను గుర్తిస్తే, గంగాజలంలో 1100 రకాలను గుర్తించారు. ఈ నీటిలోని ఈ సుగుణమే గంగాజలానికి పవిత్రతను, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని తెచ్చిపెట్టింది!