‘ఆకతాయి’ నటిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన పంజాబీ భామ రుక్సర్ థిల్లాన్. లండన్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ‘రన్ ఆంటోనీ’ సినిమాతో వెండితెరపై మెరిసింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళ చిత్ర సీమల్లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నది. తాజాగా కిరణ్ అబ్బవరంతో కలిసి ‘దిల్రుబా’ అంటూ తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించిన అందాల భామ రుక్సర్ పంచుకున్న కబుర్లు..
చిన్నప్పటి నుంచే సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆసక్తి ఉండేది. దాంతో స్కూల్లో నాటకాలు, డ్యాన్స్ పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నటనపై ఇష్టం ఉన్నప్పటికీ చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాను. చదువు అయిపోగానే కుటుంబ ప్రోత్సాహంతో మోడలింగ్‌లో అడుగుపెట్టా.
‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా నా కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఆ సమయంలో నటనతోపాటు దర్శకత్వంలోనూ మెలకువలు నేర్చుకున్నాను. ఆ సినిమాలో నా పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.. నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్.
పెండ్లి అనేది జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విషయం. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం సజావుగా సాగుతుంది. నా ఓటు ప్రేమ వివాహానికే. మా కుటుంబంలో చాలామంది ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అందం కాదు, ఒకరిపట్ల ఒకరికి గౌరవం, అవగాహన ఉండటం ప్రధానం.
భిన్నమైన పాత్రల్లో నటించాలనుకుంటున్నా. కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నా.
నా పాత్ర ప్రాధాన్యం కన్నా.. కథనే ఎక్కువగా నమ్ముతాను. నటీనటులు ఎవరైనా కథ బాగుంటేనే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ప్రస్తుతం కెరీర్లో బిజీగా ఉన్నా. తెలుగులోనూ వరుస సినిమాలతో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.
కెరీర్ ఇలా ఉండాలి అని ఏం ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. తొలినాళ్లలోనే పెద్ద నటులతో, పెద్ద బ్యానర్లలో పనిచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.
టాలీవుడ్లో స్టార్ హీరోలు అందరితో కలిసి పనిచేయాలని ఉంది. సుకుమార్ దర్శకత్వంలో మంచి ప్రేమకథలో నటించాలని కోరిక. హీరోయిన్‌గానే చేయాలని రూల్ లేదు. సినిమాలో కీలకం అనిపిస్తే చిన్న పాత్రల్లోనూ నటిస్తా!