అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కన్నడ సోయగం రుక్మిణీ వసంత్. ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో తెలుగువారికి చేరువైన ఈ అమ్మడు.. శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోయిన్గా
రాణిస్తున్నది. టాలీవుడ్ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేస్తూనే.. ఇటీవల శివకార్తికేయన్ సరసన ‘మదరాసీ’లో
మెప్పించింది. ‘కాంతార చాప్టర్-1’తో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్న రుక్మిణీ వసంత్ పంచుకున్న కబుర్లు..
ప్రస్తుతం కన్నడలో ‘బఘీరా’, ‘కాంతార: చాప్టర్ 1’తో పాటు యశ్‌తో ‘టాక్సిక్’ సినిమాలు చేస్తున్నా. తమిళం, తెలుగులోనూ పలు కథలు వింటున్నా. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. భాష ఏదైనా వైవిధ్యమైన పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం.
చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్ అంటే ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే చదువు పూర్తవగానే రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ (RADA)లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ శిక్షణ నన్నెంతగానో ప్రభావితం చేసింది. నా నటనా సామర్థ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఎంతో ఉపయోగ
పడింది.
మాది బెంగళూరు. మా నాన్న అశోక చక్ర అవార్డు అందుకున్న మొదటి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన 2007లో ఉరిలో మార్టిర్ అయ్యారు. నాన్న దగ్గర దేశభక్తి గురించి చాలా విషయాలు నేర్చుకున్నా. అమ్మ స్మిత, నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ అన్నీ తానై అండగా ఉంటున్నది.
డ్యాన్స్ చేయడం, బుక్స్ చదవడం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. బంకమన్నుతో రకరకాల పాత్రలు తయారు చేస్తుంటాను. ప్రకృతిని అమితంగా ప్రేమిస్తా. చాయ్ బిస్కెట్ నా ఫేవరెట్. పురాతన కట్టడాలను సందర్శించడం, కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకి వెళ్లడం ఇష్టం. ఖాళీ సమయంలో ఫ్యామిలీతో గడుపుతాను.
రోజూ క్రమం తప్పకుండా యోగ, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. హెల్తీ డైట్ ఫాలో అవుతాను, సినిమాలకు ఫిట్‌గా ఉండాలంటే తప్పదు. శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతాను. నా సౌందర్య రహస్యమదే! ఐస్‌క్రీమ్, ఇడ్లీ సాంబార్ నా ఫేవరెట్ ఫుడ్. సింపుల్‌గా ఉంటూనే గ్లామర్‌గా కనిపించాలనుకుంటాను. చీరలంటే చాలా ఇష్టం.
షూటింగ్స్ కోసం ఏ ఊరు వెళ్లినా లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకుంటాను. పుస్తకాలు చదవడమంటే అంత ఇష్టం. కన్నడ సినిమా ‘బానదరియల్లి’ కోసం వాటర్ స్పోర్ట్స్ నేర్చుకున్నా. సీ సర్ఫింగ్, స్విమ్మింగ్‌లో
కూడా శిక్షణ తీసుకున్నా.
నా మొదటి సినిమా ‘బీర్బల్’. థ్రిల్లర్‌గా రూపొందిన ఆ సినిమా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ‘సప్తసాగరదాచే ఎల్లో’ రెండు పార్టుల్లో నటించడం నా కెరీర్‌కి చాలా కలిసొచ్చింది. ఆ సినిమాలోని ప్రియ పాత్ర ద్వారా నన్ను నేను నిరూపించుకోగలిగా. రక్షిత్ శెట్టి డెడికేషన్ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది.