సిటీలో టెర్రర్ ఎటాక్‌ను ఆపడానికి ఉగ్రవాదుల స్థావరానికి వెళ్లిన రుద్రకు ఊహించని షాక్ తగిలింది. బాంబులు ఫిక్స్ చేసిన ఉగ్రవాదులంతా మూకుమ్మడిగా సూసైడ్ చేసుకొన్నారు. పక్కనే ఓ లెటర్. అందులో.. ‘మిస్టర్ రుద్ర.. నిఖేశ్ మా ఆచూకీ చెప్తాడని తెలుసు. అందుకే, నీకు దొరక్కుండా ఇలా చేస్తున్నాం. మేం వచ్చిన పని అయిపోయినట్టే. సిటీలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు బాంబులు పేలబోతున్నాయ్. దమ్ముంటే ఆపు. ఆల్ ది బెస్ట్’ అని ఉంది.
అక్కణ్నుంచి స్టేషన్‌కు వచ్చిన రుద్ర.. స్నిగ్ధను హత్యచేసిన నిఖేశ్‌తోపాటు ఉగ్రవాదులతో చేతులు కలిపిన నిఖేశ్ ఏజెన్సీ సభ్యులను ఎడాపెడా వాయించాడు. లాకెట్ ఎక్కడుందో చెప్తేనే మంచిదని గద్దించాడు. భయపడిపోయిన నిఖేశ్ అండ్ ఏజెన్సీ ముఠా.. ‘సార్.. నిజంగా ఆ లాకెట్ గురించి మాకు తెలియదు’ అన్నారు. ఇంతలో నిఖేశ్ ప్రాధేయపడుతూ.. ‘రుద్ర.. ఉగ్రవాదులతో నేను చేతులు కలిపి తప్పు చేశా. భార్యనూ పొట్టనబెట్టుకొన్నా. దీంతో నేను సాధించింది ఏంటా అని ఆలోచిస్తే ఏమీలేదు. నన్ను క్షమించు. చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడుతున్నా’ అంటూ బోరుమన్నాడు.
‘నిఖేశ్.. ఏడ్చినంత మాత్రాన స్నిగ్ధ మళ్లీ తిరిగి వస్తుందా? నువ్వు నిజంగా మారినట్లయితే, నీ పశ్చాత్తాపం నిజమైతే.. టెర్రర్ ఎటాక్ జరుగకుండా దయచేసి మాకు ఏదైనా సాయం చేయ్’ అన్నాడు రుద్ర. ఇంతలో ఏదో గుర్తుచేసుకొన్న నిఖేశ్.. ఒక్కసారిగా.. ‘రుద్ర.. నేను స్నిగ్ధను కాల్చేప్పుడు ఏ లాకెట్ తన మెడలో లేదు. అయితే, ట్రిగ్గర్ నొక్కేప్పుడు ఆమె నన్ను మాటల్లో పెడుతూ టీవీ షెల్ఫ్ దగ్గరున్న ఓ పుస్తకాన్ని ఎందుకో తెరిచింది’ నిశ్చయంగా చెప్పాడు నిఖేశ్. ‘నిఖేశ్.. నువ్వు చెప్పేది నిజమా?’ రుద్ర వెంటనే అడిగాడు. ‘ఎస్.. రుద్ర. నా వల్ల ఇంకో తప్పు జరగడం నాకు ఇష్టంలేదు. వెంటనే ఇంటికి వెళ్దాం. ఆ పుస్తకంలోనే స్నిగ్ధ లాకెట్ పెట్టొచ్చు’ నిఖేశ్ పూర్తిచేసేలోపే రుద్ర కుర్చీలో నుంచి లేచాడు. నిఖేశ్ సహా అందరూ స్నిగ్ధ ఇంటికి బయల్దేరారు.
ఇళ్లంతా బంధువులు, ఆప్తులతో గందరగోళంగా ఉంది. నిఖేశ్‌ను చూడగానే స్నిగ్ధ తరుఫు బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. అతన్ని కొట్టడానికి విరుచుకుపడ్డారు. సిబ్బంది సాయంతో ఎలాగోలా పరిస్థితిని అదుపు చేసిన రుద్ర అండ్ టీమ్ హాల్లోకి వచ్చారు. నిఖేశ్ చెప్పినట్టే టీవీ షెల్ఫ్‌లో పుస్తకం ఉంది. రుద్ర కండ్లు మెరిశాయి. వెంటనే పుస్తకాన్ని అందుకొని మొత్తం వెతికాడు. అయితే, లాకెట్ కనిపించలేదు. నిఖేశ్ వైపు కోపంగా చూశాడు. ‘రుద్ర.. నేను చెప్పింది నిజం’ అన్నాడు నిఖేశ్. అప్పటికే మధ్యాహ్నం మూడు దాటింది. ఇంతలో.. ‘రుద్ర.. స్నిగ్ధ అంత్యక్రియలను కవర్ చేయడానికి వీడియోగ్రాఫర్‌ను మాట్లాడినట్టున్నారు. ఆ వీడియోలు చూస్తే, ఈ పుస్తకాన్ని పొద్దున్నుంచి ఎవరెవరు తెరిచారో పట్టుకోవచ్చు’ అన్నాడు డీసీపీ సత్యనారాయణ. రుద్ర అండ్ టీమ్ వీడియో ఫుటేజీని చెక్ చేశారు. నలుగురు వ్యక్తులు ఆ పుస్తకం దగ్గరకు వెళ్లినట్టు వీడియో ద్వారా తెలిసింది. అందరినీ ప్రశ్నించాడు రుద్ర. అందులో ముగ్గురు లాకెట్‌ను చూశామని చెప్పగా, మరొకరు తనకేమీ తెలియదని చెప్పారు. ఇంటరాగేషన్ ఇలా సాగింది.
మొదటి వ్యక్తి: ‘సార్.. నేను షెల్ఫ్ పక్కగా వెళ్తుంటే పుస్తకం కనిపించింది. ఏంటా అని తెరిచి చూస్తే ఏదో లాకెట్ ఉంది. బంగారు రేకుపై ఏదో రాసి ఉంది. దాన్ని ఎవరైనా తీసుకోవచ్చని ఆ లాకెట్‌ను పుస్తకం లోపలికి దూర్చా. అందరూ వెళ్లాక తీసుకొందామని అనుకొన్నా అంతే.. కానీ తీసుకోలేదు’ రాధిక చెప్పింది.
‘దానిపై ఏమైనా కోడ్ ఉందా? ఏం రాసి ఉంది?’ ఆత్రుతగా అడిగాడు రుద్ర. ‘సారీ.. సార్! దాన్ని నేను అంతగా పట్టించుకోలేదు’ చెప్పింది రాధిక.రెండో వ్యక్తి: ‘సార్.. రాధిక ఏమో చేస్తుందని చూశా. ఆమె అక్కణ్నుంచి కదలగానే పుస్తకం దగ్గరికి వెళ్లా. లోపల వెతగ్గా లాకెట్ కనిపించింది. ఇంతలో నా భర్త పిలవడంతో దాన్ని 210-211 పేజీల మధ్య పెట్టా’ చెప్పింది ఐశ్వర్య.
‘లాకెట్‌పై కోడ్ చదివారా?’ ఆశగా ప్రశ్నించాడు రుద్ర. లేదని బదులిచ్చింది ఐశ్వర్య. దీంతో ‘లాకెట్‌ను పెట్టిన పేజీ నంబర్లు సహా చెప్తున్నారు. అంత కరెక్టుగా ఆ నంబర్లలోనే లాకెట్ పెట్టినట్టు ఎలా గుర్తుంది?’ ప్రశ్నించాడు రుద్ర. ‘సార్.. అది చాలా సన్నగా ఉంది. ఎక్కడ పెట్టామో మరిచిపోతే ఎలా? అని ఏదో చేతికొచ్చిన పేజీ నంబర్లలో పెట్టా. వాటిని గుర్తుపెట్టుకొన్నా.. తీసుకునేప్పుడు ఈజీగా ఉంటుందని’ చెప్పింది ఐశ్వర్య.
మూడో వ్యక్తి: ‘సార్.. 210-211 పేజీల మధ్య లాకెట్‌ను నేను తీశా. అయితే, కానిస్టేబుల్ ఇటువైపు రావడంతో 361-362 పేజీల మధ్య దాన్ని ఉంచి ఇటువైపు వచ్చా’ సమాధానమిచ్చింది లలిత.
నాలుగో వ్యక్తి: ‘సార్.. అందరూ ఆ పుస్తకం దగ్గరకి ఎందుకు వెళ్తున్నారో తెలుసుకొందామని నేనూ వెళ్లా. అయితే, ఆ పుస్తకంలో నాకు ఏ లాకెట్ కూడా కనిపించలేదు’ బదులిచ్చింది సుమతి. ‘కనిపించలేదా?’ ప్రశ్నించాడు రుద్ర. ‘అవును సార్. నాకు ఏ లాకెట్ కనిపించలేదు’ నిశ్చయంగా చెప్పింది సుమతి. ‘మరి పుస్తకం దగ్గర నుంచి వెనక్కి వచ్చేప్పుడు చేతి కొంగుతో ముఖాన్ని ఎందుకు దాచుకొన్నట్టు?’ సూటిగా ప్రశ్నించాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి. అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వీడియో ఫుటేజీని చూపించాడు రామస్వామి. ‘సార్.. ఇంట్లో అగరబత్తిల పొగ ఎక్కువగా ఉండటంతోనే కొంగును ముఖానికి అడ్డుపెట్టుకొన్నా’ చెప్పింది సుమతి.
సమయం 4 గంటలు కావొస్తోంది. మరో గంటలో బాంబ్ బ్లాస్ట్ కానున్నది. అప్పటికే సిటీలో హైఅలర్ట్ ప్రకటించారు. రుద్ర బుర్ర వేడెక్కిపోతున్నది. ఇంతలో చేతిలో పుస్తకాన్ని తీసుకొన్న రుద్రకు ఏదో మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే లలితను పిలిపించి గట్టిగా అడిగాడు. లేడీ కానిస్టేబుల్స్ తమదైన శైలిలో ప్రశ్నించగా.. లాకెట్‌ను తానే తీశానని ఎట్టకేలకు ఒప్పుకొన్న లలిత దాన్ని పోలీసులకు అప్పగించింది. ఆ లాకెట్‌పై ‘జంట నగరాల వారధి.. దాన్ని చేరే దారేది?’ అని రాసి ఉంది. పేలుడుకు మరో అరగంట సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో సత్యనారాయణ, రుద్ర సహా అందరూ కోడ్‌ను డీకోడ్ చేయడంలో మునిగిపోయారు. ఇంతలో డిటెక్టివ్ అయిన నిఖేశ్.. ‘రుద్ర.. జంట నగరాలు.. సికింద్రాబాద్-హైదరాబాద్. వీటిని కలిపే వారధి అంటే ట్యాంక్‌బండ్. దాన్ని చేరే దారేది? అంటే ట్యాంక్‌బండ్‌కు వెళ్లే రూట్లు. మనం ఆ రూట్లలో తనిఖీలు చేపడితే ఫలితం ఉండొచ్చు’ నిశ్చయంగా చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి బాంబులను నిర్వీర్యం చేశారు. అది పక్కనబెడితే, లాకెట్‌ను లలితనే తీసిందని రుద్ర ఎలా కనిపెట్టాడు?
సమాధానం
పుస్తకంలో 210-211 పేజీల మధ్య లాకెట్ పెట్టినట్టు ఐశ్వర్య చెప్పింది. 210-211 పేజీల మధ్య ఐశ్వర్య పెట్టిన లాకెట్‌ను అక్కడి నుంచి తీసి 361-362 పేజీల మధ్య ఉంచినట్టు లలిత చెప్పింది. ఐశ్వర్య పెట్టిన లాకెట్‌ను తీశానని లలిత చెప్పింది కాబట్టి.. ఐశ్వర్య లాకెట్‌ను దొంగతనం చేయలేదని దీంతో అర్థమవుతుంది. అయితే, 361-362 పేజీల మధ్య లలిత పెట్టినట్టు చెప్తున్న ఏ లాకెట్ తనకు కనిపించలేదని, అసలు పుస్తకంలో ఏ లాకెట్ లేదని సుమతి చెప్పింది. దీన్నిబట్టి ఈ ఇద్దరిలో లలిత లేదా సుమతి ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నట్టు గమనించవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే.. తొలుత 210-211 పేజీల మధ్య లాకెట్‌ను పెట్టడం నిజమైతే.. 360-361 లేదా 362-363 పేజీల మధ్య మాత్రమే లాకెట్‌ను పెట్టే వీలుఉంటుంది. ఎందుకంటే ఆ పుస్తకంలో ఎడమ పేజీలు సరిసంఖ్యతో కుడి పేజీలు బేసి సంఖ్యతో ఉన్నట్టు అర్థమవుతున్నది. అయితే, లలిత మాత్రం తాను 361-362 పేజీల మధ్య లాకెట్ పెట్టినట్టు ఏదో నోటికొచ్చింది చెప్పింది. నిజానికి ఆ పేజీలు ఒకే పేపర్‌కు ఇరువైపులా ముద్రించి ఉంటాయి. అలాంటప్పుడు వాటిమధ్య లాకెట్ పెట్టడం అనేది అసాధ్యం. ఈ పాయింట్‌నే రుద్ర కనిపెట్టి ఛేదించాడు. కాగా తొలుత ఉగ్రవాదులతో చెయ్యి కలిపి స్నిగ్ధను హత్య చేసినప్పటికీ, లక్షలాదిమంది ప్రాణాలను కాపాడటంలో సాయపడ్డ నిఖేశ్‌కు తక్కువ శిక్ష పడేందుకు రుద్ర ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
-రాజశేఖర్ కడవేర్గు