బంగారం తూచే గింజలు!
మా ఊరి కంసాలి కాక.. బంగారం తూకం వేసే త్రాసు డబ్బాలో గురివిందలు ఉండేవి. బంగారాన్ని ఇప్పుడు గ్రాముల్లో కొలిచినట్టే, ఒకప్పుడు గురివిందలతో తూచేవాళ్లు. గురివిందలు చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. ప్రతీ గింజ (సుమారుగా) సమాన బరువు కలిగి ఉంటుంది. అందుకే వీటిని బంగారం తూకం వేయడానికి ఉపయోగించేవారు. తులం బంగారం ఎనిమిది గురవింద గింజల ఎత్తుకు సమానమని చెప్పేవాళ్లు. ఒక గురివింద గింజ 1.2 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.
8 గురివింద గింజల మొత్తం బరువు 12 గ్రాములు. ఆ కాలపు తులం అన్నమాట! అందుకే వీటికి ‘అదృష్ట గింజలు’ అనే పేరొచ్చింది. తమ తప్పును కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ల లోపాలను ఎత్తి చూపే వారిని గురివింద గింజతో పోలుస్తారు. గురివింద గింజ పగడపు రంగులో బటాణీ గింజ పరిమాణంలో ఉంటుంది. చివరన నల్లని మచ్చ కలిగి ఉంటుంది. వీటిలో ఎర్ర గురివిందలు, తెల్ల గురివిందలు, పచ్చ గురివిందలు, నల్ల గురివిందలు ఉన్నాయి. గురివింద తీగ జాతి మొక్క. గురివింద ఆకుల అమరిక (పత్ర విన్యాసం) జమ్మిని పోలి ఉంటుంది.
గురవింద ఔషధ మొక్క. విషపూరితమైనది కూడా! పంట పొలాల కంచెలపైకి ఎగబాకి పెరుతుంది. గులాబీ రంగులో పూలు పూస్తాయి. గింజలోని పప్పుని ఔషధంగా వాడతారు. పేను కొరుకుడు, నేత్ర సంబంధ వ్యాధులు, దగ్గు, వాంతులు, జలుబు నివారణ కోసం తయారుచేసే మందుల్లో గురివింద పప్పును ఉపయోగిస్తారు. గురివింద మొక్క అన్ని భాగాలు తక్కువ మోతాదులో విష గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ గింజలను చిన్న పిల్లలకు దిష్టితగలకుండా ఉండటానికి వాడుతుంటారు. గురివింద గింజలను పూజ గదిలో కూడా ఉంచుతారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు