రూమ్ నంబర్ 25 మిస్టరీని కనిపెట్టిన ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ.. ఇన్స్పెక్టర్ రుద్ర ప్రాణాలు కాపాడింది. ఇంతలో కలుగజేసుకొన్న స్నేహిల్ తన సందేహాన్ని జయతో పంచుకొన్నాడు. ‘ఆంటీ.. మీరన్నట్టు.. మిషన్ డోలోకు సంబంధించి డోలో.. 8 దేశాల పేర్లు చెప్పాడు. మిషన్‌లో ఉన్నవి 8 దశలు. బయోకెమీ
క్రియేచర్ను అష్టదిగ్బంధనతో అంటే 8 బంధనాలతో బంధించారు’ కదా అన్నాడు.
స్నేహిల్ ఇంకా కొనసాగిస్తూ.. ‘ఆంటీ! ఇప్పుడు లాక్ చేసిన ఈ రూమ్ నంబర్ 25లోకి 8 రోజుల తర్వాత ఎంటర్ కాగానే కీలకమైన ఆ ముగ్గురు అధికారులు చనిపోయారు. రూమ్ గోడల్లో అమర్చిన అడ్వాన్స్డ్ ట్రాన్స్‌క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైజ్ యాక్టివేట్ అయిన 8 నిమిషాల తర్వాతే పిల్లి చనిపోయింది. ఇదంతా ఓకే.. కానీ, నా సందేహమేంటంటే, మిషన్ డోలోలో ప్రతి దాన్నీ ‘8’ అంకెకు లింక్ పెట్టిన ఆగంతకులు.. మరి ఈ రూమ్ నంబర్ 25ను ఎందుకు ఎంచుకొన్నట్టు? అయితేగియితే, రూమ్ నంబర్ 26ను (2+6=8) ఎంచుకోవాలి. ఎటూకాకుండా రూమ్ నంబర్ 25ను (2+5=7 వస్తుంది) ఎందుకు ఎంచుకొన్నట్టు?’ అని అడిగాడు.
దీనికి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్ సమాధానమిస్తూ..‘నువ్వు అనుమానపడింది కరెక్టే స్నేహిల్. నిజానికి ఈ రూమ్ నంబర్ 25 కాదు 26. కానీ, మొన్నటి భారీ వర్షాలకు ఒక సెల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సెల్ నంబర్లు ఒకటి చొప్పున తగ్గాయి. రూమ్ నంబర్ 25 సెల్ (గతంలో 26) దూరంగా నిర్మానుష్యంగా ఉండటం వల్లే ఈ మిషన్‌కు దాన్ని సెలక్ట్ చేసుకొన్నారేమో? లేకపోతే, రూమ్ నంబర్ 8, లేదా 17 (1+7=8)ను కూడా మేబీ సెలక్ట్ చేసుకొనేవారు’ అంటూ వివరించాడు కరణ్. ఈ సంభాషణ కొనసాగుతుండగానే, రుద్ర ఆందోళనతో ఆకాశంవైపు చూస్తూ ఉండిపోయాడు. దీన్ని గమనించిన హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి రుద్రను పలకరించాడు.
‘ఏంలేదు బాబాయ్.. ఎంతోమందికి నష్టం చేసిన మిషన్ డోలోను ఆపనైతే ఆపాం గానీ, దీని వెనుక ఎవరు ఉన్నారో మాత్రం కనిపెట్టలేకపోయాం. అదే బాధగా ఉంది’ అంటూ ఆగిపోయాడు రుద్ర. ఇంతలో మిస్టరీ రూమ్ గోడల్లో అమర్చిన అడ్వాన్స్డ్ ట్రాన్స్ క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ డివైజ్ డేటాను విశ్లేషిస్తున్న హరిశ్వను చూసిన రుద్ర ఏమిటని ప్రశ్నించాడు. ‘సర్.. చనిపోయిన ముగ్గురు కానిస్టేబుల్స్ వాళ్లంతలో వాళ్లు ఈ రూమ్‌కు రాలేదు.
ఓ ప్రీ-ఫిక్స్డ్ ప్రోగ్రామ్ నుంచి సెండ్ అయిన మెసేజీ వాళ్లను ఈ రూమ్‌కు రప్పించింది. పైగా మిషన్ డోలో సక్సెస్, అయినా.. ఫెయిల్యూర్ అయినా.. 8వ రోజున ఈ ముగ్గురు ఈ రూమ్‌లోకి ఎంటరై.. 8 నిమిషాల పాటు ఉండేలా అంతా ఎవరో ఫిక్స్ చేశారు. ఈ డివైజ్‌లోని ఎన్క్రిప్టెడ్ డేటాను ప్లెయిడ్ డేటాగా మారిస్తే, నాకు ఈ విషయం అర్థమయ్యింది’ అంటూ చెప్తూ పోయాడు హరిశ్వ. ‘అంటే, మిషన్ డోలోలో పాల్గొన్న అందరూ చివరకు 8వ రోజున చనిపోవాల్సిందే అన్నమాట’ అంటూ నిశ్చయంగా అన్నాడు రుద్ర. ‘అవును రుద్ర. దీన్ని చూస్తే, అదే అనిపిస్తుంది. ఇక, మిషన్ డోలోను ఎవరు స్టార్ట్ చేశారు? అనే విషయం మనకు తెలియడం కష్టం. ఇప్పటికే పీఎంవో అధికారులు, విదేశాంగ ప్రతినిధులు దానిపై 8 దేశాలతో అంతర్గతంగా చర్చించడం మొదలుపెట్టారని ఇప్పుడే సమాచారం వచ్చింది’ అని కరణ్ అన్నాడు.
‘పోనీ రుద్ర! మిషన్ డోలోను ఆపేసి మనకు తోచిన దేశభక్తిని మనం కనబర్చాం. ఇక, ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మంచిదేమో’ అని జయ అనగానే, అవునన్నట్టు అందరూ తలూపారు. ఇంతలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘సార్.. సార్.. మిషన్ డోలో గురించి మనకు తొలుత సమాచారం ఇచ్చిన కమలాకర్‌ను ఉరిశిక్ష నుంచి ఎలాగైనా కాపాడాలి సార్’ అంటూ రామస్వామి అంటుండగానే.. ‘మరేం పర్లేదు రామస్వామి గారూ.. ఎప్పుడో ఆ విషయాలను పూర్తి చేశాం. కమలాకర్ ఉరిశిక్ష తప్పినట్టే. ఆయన ఉరిశిక్షను రద్దు చేయాలని పైస్థాయి అధికారులకు విజ్ఞప్తి చేశాం.
ఆ మేరకు పాజిటివ్ రెస్పాన్స్ ఇంతకుముందే వచ్చింది’ అంటూ అసలు విషయం చెప్పాడు కరణ్. అది వినగానే, అందరూ ఆనందపడ్డారు. ‘సరే..పదండి. ఒకసారి కమలాకర్‌ను కలిసి ఈ గుడ్‌న్యూస్ చెప్పొద్దాం’ అంటూ రుద్ర అనగానే అందరూ కమలాకర్ సెల్ వైపు కదిలారు. కమలాకర్‌ను చూసి యోగక్షేమాలు తెలుసుకొన్న రుద్ర.. మిషన్ డోలోను ఆపేయడంలో తన సాయానికి కృతజ్ఞతలు చెబుతూనే.. అసలు కమలాకర్ ఏ నేరం చేసి జైలుకు వచ్చాడన్న విషయంపై ఆరా తీశాడు.
‘సార్.. మీకు ముందే చెప్పానుగా! నా జీవితంలో ఎన్నో పాపాలు చేశా. మద్యానికి బానిసై ఓ భర్తగా, ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా ఓడిపోయా. అయితే, ఎప్పుడైతే, బుద్ది వచ్చి మంచి మనిషిగా మారాలనుకొన్నానో.. విధి నాపై పగబట్టింది. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా భార్య, పిల్లలను మంచిగా చూసుకోవాలనుకొని ఆ రాత్రి ఇంటికి చేరుకొన్నా. అయితే, డ్రగ్స్‌కు బానిసైన ముగ్గురు, నలుగురు కాలేజీ కుర్రాళ్లు.. కన్నూమిన్నూ కానక, నా భార్య, బిడ్డలపై మృగాళ్లా విరుచుకుపడబోయారు. దాన్ని అడ్డుకొనే క్రమంలో వాళ్లను చంపాల్సి వచ్చింది’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఓదార్చిన రుద్ర.. ఉరిశిక్ష తప్పిన విషయాన్ని కమలాకర్‌కు చెప్పాడు. ‘ఉరి తప్పితే, ఏముంది బాబూ..? చచ్చేంత వరకూ ఇక్కడే చావాలి. అది చావు కంటే నరకం’ అంటూ వాపోయాడు. ఉరిశిక్ష తప్పినప్పటికీ.. కమలాకర్ ఎందుకు ఇలా అంటున్నాడో మీకు అర్థమయ్యిందా? ధానం:
భారత్‌లో నిబంధనల ప్రకారం.. ఉరిపడిన ఖైదీకి శిక్షను తగ్గించాలనుకొన్నప్పటికీ.. జీవితఖైదుకు మించి తగ్గించడానికి కుదరదు. ఇది తెలిసిన కమలాకర్.. తన భార్య, బిడ్డలతో ఇకపై కలిసి ఉండలేనని, జీవితాంతం జైలులోనే మగ్గాల్సి వస్తుందని తెలుసుకొంటూ.. ‘చచ్చేంతవరకూ ఇక్కడే చావాలి. అది చావు కంటే నరకం’ అని వాపోయాడు. డ్రగ్స్ వాడకం ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రాళ్లను పెడదారిలోకి నెట్టి వారి ప్రాణాలను కోల్పోయేలా చేయడమే కాకుండా ఓ కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిందికదా! అంటూ రుద్ర అండ్ టీమ్ బాధపడ్డారు.
– రాజశేఖర్ కడవేర్గు