మిషన్ డోలోకు సక్సెస్‌ఫుల్‌గా ఎండ్‌కార్డ్ వేసిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ కాశీ విశ్వేశ్వరుడి ప్రాంగణంలో కాసేపు సేద తీరారు. అప్పటికే, ఈ మిషన్ గురించిన వార్తలు తెలియడంతో దేశమంతటా రుద్ర టీమ్ పేరు మార్మోగిపోయింది. ‘రుద్ర.. ఇప్పుడు మన నెక్ట్స్ స్టెప్?’ అడిగాడు కరణ్.
రుద్ర సమాధానమిస్తూ.. ‘మీ నాగ్‌పూర్ జైలుకే మన ప్రయాణం.. ఈ సమస్యకు ఆది.. అంతం కూడా పడేది అక్కడే!’ నిశ్చయంగా చెప్పాడు రుద్ర. అర్థంకానట్టు చూస్తుండిపోయారు జయ, రామస్వామి, స్నేహిల్, హరిశ్వ. ప్రయాణంలో అన్ని వివరాలు చెప్తానంటూ రుద్ర అనడంతో నాగ్‌పూర్‌కు బయల్దేరారు రుద్ర అండ్ టీమ్. అప్పటికే, హరిశ్వ విజ్ఞప్తి చేయడంతో తన టీమ్‌లో అతన్ని చేర్చుకొన్నాడు రుద్ర. ప్రయాణంలో రుద్ర మాట్లాడుతూ.. ‘నాగ్‌పూర్ జైలులో మనం చేయాల్సినవి రెండు ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఒకటి.. మిషన్ డోలో గురించి ముందుగా మనకు సమాచారమిచ్చిన కమలాకర్‌ను ఎలాగైనా ఉరి నుంచి కాపాడాలి’ అని రుద్ర ఆగాడు.
‘మరి రెండోది?’ ఆసక్తిగా అడిగాడు కరణ్. ‘అది మీరే చెప్పాలి కరణ్.. పక్క దేశానికి చెందిన ఓ పౌరుడు అదే ఆ డోలోగాడు.. మీ పర్యవేక్షణలో ఉన్న జైలులో ఇంత తతంగం నడిపిస్తుంటే? మీరంతా ఏం చేస్తున్నట్టు??’ అంటూ కరణ్‌ను సూటిగా ప్రశ్నించాడు రుద్ర. నిర్ఘాంతపోయాడు కరణ్. మళ్లీ కొనసాగించాడు రుద్ర. ‘ముందే చెప్పాను కదా.. ఆది.. అంతం.. అక్కడేనని.. పదండి అన్ని విషయాలు బయటపడ్తాయ్’ అంటూ ముగించాడు. అసలేం జరుగుతుందో అర్థంకాక అందరూ మిన్నకుండిపోయారు.
నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ‘రుద్ర.. మీరు నన్ను అనుమానిస్తున్నారా?’ కాస్త ఉద్వేగానికి గురవుతూ సూటిగా ప్రశ్నించాడు కరణ్. టీమ్ మెంబర్స్ అందరూ ఎంతో ఆందోళనకు గురవుతూ చూస్తుండిపోయారు. మనలో మనకే ఇలా గొడవలు రావడం ఏమిటోనంటూ అందరూ లోలోపలే బాధపడిపోతున్నారు. ఇంతలో నోరు తెరిచిన రుద్ర.. ‘మా డీసీపీ సార్ సత్యనారాయణ గారి స్టూడెంట్ అయినంత మాత్రాన మిమ్మల్ని గుడ్డిగా నమ్మాలా కరణ్? నేనడిగిన ప్రశ్నకు ముందు సమాధానం ఇవ్వండి. పక్క దేశానికి చెందిన ఓ పౌరుడు.. మీ పర్యవేక్షణలో ఉన్న జైలులో ఇంత తతంగం నడిపిస్తుంటే? మీరంతా ఏం చేస్తున్నట్టు??’ అంటూ రుద్ర పూర్తిచేయకముందే.. ఉండబట్టలేక ఎట్టకేలకు జయ నోరు తెరిచింది.
‘ఒరేయ్ రుద్ర! ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్? కరణ్ గారికి తెలిసే ఇదంతా జరిగిందంటావా? అదే నిజమైతే, ఈ మిషన్‌ను ఆపేయడానికి ఆయన మనతో అంత శ్రమ ఎందుకు పడ్తారు?’ అంటూ రుద్రను నిలదీసింది జయ. తమ హావభావాలతో దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు స్నేహిల్, రామస్వామి, హరిశ్వ. ఆ వెంటనే దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలిన రుద్ర.. ‘కరణ్.. నేను మిమ్మల్ని అనుమానిస్తానా?’ అంటూ అడిగాడు. లేదన్నట్టు తలూపి సన్నగా నవ్వాడు కరణ్. అర్థంకాక మిగతా వారందరూ బిత్తరచూపులు చూస్తున్నారు. ఇంతలో నోరు తెరిచిన కరణ్ ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘నన్ను సపోర్ట్ చేసిన జయ గారికి, నా గురించి ఫీలైన స్నేహిల్, రామస్వామి, హరిశ్వకు ముందుగా థాంక్స్. నిజానికి రుద్ర నన్నేమీ అనుమానించలేదు. ఇన్వెస్టిగేషన్లో పై అధికారులు నన్ను అడగబోయే మొదటి ప్రశ్ననే ఇప్పుడు రుద్ర వేశాడు. నిజానికి నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకు డిప్యూటీ సూపరిండెంటెంట్‌గా నేను బదిలీ కాకముందే డోలో అక్కడికి వచ్చాడు. 3 వేల మంది ఖైదీలు ఉన్న ఆ జైలులో అందరి గురించి తెలుసుకోవడం ఒక సూపరిండెంటెంట్ స్థాయి అధికారికి కుదరదు. అందుకే, నేను కూడా డోలోపై దృష్టిసారించలేకపోయా. కానీ, కిందిస్థాయి అధికారులే ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ గుట్టును రట్టు చేయాల్సిన సమయమొచ్చింది’ అంటూ కరణ్ ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘ఆ గుట్టు.. రట్టు పక్కనబెట్టండి సార్!
మీకూ, మా రుద్ర బాబుకు మధ్య గొడవలు, అనుమానాలేమీ లేవుగా’ అంటూ ఆందోళనగా అడిగాడు. ‘లేదు రామస్వామి గారు. నిజానికి, వారణాసిలోనే రుద్ర.. నాకు ఈ విషయాలు అన్నీ చెప్పాడు. కాసేపు మిమ్మల్ని ఆటపట్టిద్దామంటూ ఈ అనుమానపు డ్రామా ఆడదామన్నాడు. నేనూ సరేనన్నాను. మీరు టెన్షన్ పడిపోయారు. సారీ’ అంటూ కరణ్ చెప్తుండగానే.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో డ్యూటీలో ఉన్న ముగ్గురు అధికారులు కాసేపటి కిందటే ఆత్మహత్య చేసుకొన్నట్టు కరణ్‌కు సమాచారమొచ్చింది. ఆ మృతదేహాలు సమీప దవాఖానలో ఉంచినట్టు తెలియడంతో రుద్ర అండ్ టీమ్ వెంటనే అక్కడికి చేరుకొన్నారు.
డోలో జైలులోకి ప్రవేశించిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులే సూసైడ్ చేసుకోవడం రుద్ర అండ్ టీమ్‌కు కొత్త సవాల్ విసిరింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సార్.. 8 రోజుల కిందట లాక్‌చేసిన రూమ్‌నంబర్ 25 సెల్‌లోకి ఈ ఉదయాన్నే ఈ అధికారులు వెళ్లారు. ఏమైందో ఏమో.. కాసేపటికే చనిపోయి కనిపించారు’ అంటూ చెప్పడంతో రుద్ర ఆలోచనలో పడ్డాడు. వెంటనే.. ఆ సెల్‌లోకి మరెవరినీ వెళ్లనీయొద్దని కరణ్‌కు చెప్తూనే.. ముగ్గురు అధికారుల మరణానికి కారణం ఏమై ఉంటుందో రుద్ర ఊహించి చెప్పాడు. రుద్ర చెప్పిన ఆ కారణం ఏంటో మీరు కనిపెట్టారా
మిషన్ డోలోకు సంబంధించి తొలుత మాట్లాడుకొన్న నలుగురు వ్యక్తులు చనిపోయింది కూడా ఈ రూమ్‌నంబర్ 25లోనే. మలేషియాలోని సూసైడ్ చీమల మాదిరిగానే .. వశీకరణ ప్రభావానికి గురై ఆ నలుగురు వ్యక్తులు తమకు తాము క్రూరంగా పొడుచుకొని చనిపోయారు. అయితే, డోలో వశీకరణ ప్రభావంతోనే ఆ నలుగురు చనిపోయారని ఇప్పటివరకూ రుద్ర టీమ్ భావించింది. కానీ, డోలో మరణించిన తర్వాత కూడా ఇప్పుడు ముగ్గురు అధికారులు అదే మాదిరిగా సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే, వశీకరణ డోలోది కాదు.. ఆ రూమ్ నంబర్ 25లోనే ఏదో మిస్టరీ దాగున్నదని రుద్రకు అనుమానం వచ్చింది. అందుకే, ఆ సెల్‌లోకి మరెవరూ వెళ్లొద్దని ఆదేశాలు ఇవ్వాలంటూ కరణ్‌ను కోరాడు.
– రాజశేఖర్ కడవేర్గు