నగల్లో పూల డిజైన్లు కనిపించడం, ప్రత్యేక సందర్భాల్లో మెడలో పూలహారం వేసుకోవడం మనకు తెలిసిన సంగతులే. కానీ ఆభరణాల్లో పండ్ల రూపాలు కనిపించడం చాలా అరుదు. ప్రకృతిలో ఒకదానికొకటి ముడి వేసుకుని ఉండే పూలూ పండ్లను ఇక్కడ మాత్రం భిన్నంగా చూడటం ఎందుకు? అవి మాత్రం నగల్లో అందంగా ఎందుకు మెరవకూడదు… అనుకున్నారేమో డిజైనర్లు ‘ఫ్రూట్ జువెలరీ’కి ప్రాణం పోశారు. పూలూ పండ్లూ పుష్కలంగా కనిపించే ఈ వానాకాలంలో పండ్ల సోయగం నగలకూ తీగలా పాకిందన్నమాట!
పువ్వుల్లో దాగున్న పండ్లెంతో అతిశయం… అని ఒక్క కవిగారికే కాదు, కళా హృదమమున్న ప్రతివారికీ అనిపిస్తుంది. పువ్వెక్కడో పండక్కడే అయినప్పుడు వాటికీ వీటికీ నగల్లో సమన్యాయం లేకపోవడం అన్యాయం! ‘అయినా అందమంతా రంగులోనే ఉంటే కేవలం పువ్వుకే ఈ గొప్పదనం ఏమిటి? పండ్లకు మాత్రం రంగులు లేవా…’ అని ఏ మూలో ఓ ప్రకృతి ప్రేమికుడి గొంతు ఘోషించి ఉంటుంది. అందుకే వాటికీ మగువ ఆభరణాల్లోకి ఆవాహన ఆహ్వానం అందింది. సౌందర్యానికి చిరునామా అయిన ఇంతి సొమ్ముల్లో కొంత చోటిస్తామంటే ఫలాలు మాత్రం చలించి రావూ. ఇంకేం, నగల నగిషీ, పండ్ల సొబగూ రంగరించుకొని సుమహారాన్ని మైమరపించే ఫల‘హారాలు’ రూపు దిద్దుకొంటున్నాయి. ఇందులో గొలుసులేనా… ఆడపిల్లలు పెట్టుకునే ఆభరణాలన్నింటా ఇప్పుడు పండ్ల సందడి విందు చేస్తున్నది.
పండ్లను చూడగానే సహజంగానే నోరూరుతుంది. అదే పండ్ల నగలను చూస్తే పెట్టుకోవాలని మనసూరుతుంది అని చెబుతున్నారు నేటి డిజైనర్లు. వీటి క్రేజ్ ఎంతలా ఉంది అంటే డాల్చీ అండ్ గబానాలాంటి ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్లు కూడా పండ్ల నగల్ని రూపొందిస్తున్నాయి. నెక్లెస్లు, లాకెట్లతో పాటు ఉంగరాలు, చెవిపోగులు, బ్రేస్లెట్లలాంటి నగలన్నింటినీ ఇలా పండ్ల ఆకృతులతో అలంకరిస్తున్నారు సృజనకారులు. ఆపిల్, నారింజ, దానిమ్మ, అరటి, ద్రాక్ష, బెర్రీలు… ఇలా మన చుట్టూ ఉండే రకరకాల పండ్లన్నింటి రూపాలనూ అందంగా నగల్లో అమర్చుతున్నారు. చూసేందుకు పక్కా ఫంకీ అనిపించేలా ఉండే వీటిని ఫ్యాన్సీగానే కాదు బంగారంతో చేసి రత్నాలు పొదిగి కూడా తయారు చేస్తున్నారు. ఒక్క నగ పెట్టుకున్నా సరే విభిన్నంగా కనిపించాలి అనుకునే వాళ్లకి ఇవి మంచి చాయిస్. పండ్ల నగలు రంగురంగుల్లో వస్తాయి కాబట్టి మ్యాచింగ్ ఉండి తీరాల్సిందే అనుకునే వాళ్లకీ ఇది పర్ఫెక్ట్ ఆప్షనే.