దారికి ఇరువైపులా ఎదిగే రేల చెట్లు… పూల శాండ్లియర్లతో ఆ తొవ్వకు కొత్త సోకు తీసుకొస్తాయి. లేత పసుపు వన్నెలో కాంతులీనే రేల పూలను చూడగానే ఆనందం కలుగుతుంది. రేల చెట్టు సామాన్యంగా అడవుల్లో, పంట పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తాయి. ఇది పది నుంచి ఇరవై మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పెరుగుదల మాత్రం చాలా వేగంగా ఉంటుంది. ఆకులు దళసరిగా, నేరేడు ఆకుల ఆకారంలో ఉంటాయి. దీని కొమ్మలకు వేలాడే పసుపు పచ్చని పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకులు కనిపించనంత దట్టంగా పూల గుత్తులుగా పూస్తాయి. దట్టమైన అడవుల్లో కనిపించే చెట్టు అయినా, పూల అందం కోసం ఇళ్ల ముందు కూడా పెంచుకుంటారు.
ఆదివాసీల సాంస్కృతిక జీవనంలో రేల పూలకు ప్రత్యేక స్థానం ఉన్నది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోయలు రేల పండుగ (రేలా పండుమ్) జరుపుకొంటారు. రేలారే అంటూ ఆదివాసీలు, లంబాడాలు జానపదాలు పాడుకుంటారు. వారి జానపద పాటలలో ప్రతి చరణం చివర ‘రేలారే’ పదం ఉంటుంది. చేసిన ప్రమాణం గాలికొదిలేసే వాళ్లను ‘రేల కాయలు తిన్న నక్క వలె’ అని పోల్చడం కద్దు. రేల కేరళ రాష్ట్రం పుష్పం. రేల పువ్వు థాయ్లాండ్ జాతీయ పుష్పం. ఈ పుష్పాన్ని వాళ్లు ‘గోల్డెన్ షవర్ ఫ్లవర్’ అని పిలుస్తారు. దీనిని శక్తికి, శుభానికి సంకేతంగా భావిస్తారు.
రేల చెట్టు కాండం బాగా చేవదేలి ఉంటుంది. దీని కలప దృఢమైనది. ఎక్కువ కాలం మన్నుతుంది. రోకళ్ల తయారీకి, కోలాటం కర్రలకు రేల చెట్టు కర్రలను ఉపయోగిస్తారు. రేలచెట్టులోని అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగినవే! కాయలు పాముల్లా పొడవుగా నల్ల వక్క రంగులో ఉంటాయి. పండిన కాయల గుజ్జును సుఖ విరేచనం కోసం వాడతారు. అతిగా మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే అరుచి (రుచి తెలియకపోవడం)కి రేల పండు గుజ్జు దివ్య ఔషధం. వేర్లని ఆయుర్వేద వైద్యంలో జ్వర నివారణకు ఉపయోగిస్తారు. వేరుని కాల్చి, పొగ పీల్చితే జలుబు తగ్గుతుంది. తామర, గజ్జి, అరికాళ్ల మంటలు, అరిచేతి మంటల నుంచి ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తోటలో ఒక రేల చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్టే!
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు